TN CM Stalin: రాహుల్ స్పీచ్‌లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు

26 Dec, 2022 12:33 IST|Sakshi

చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్పీచ్‌లు చూసి కొందరు భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే జవహర్‌లాల్ నెహ్రూ గుర్తుకు వస్తున్నారని కొనియాడారు. నేహ్రూ, గాంధీల వారసులు మాట్లాడుతుంటే గాడ్సే భక్తులకు మండుతోందని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ తన స్పీచ్‌లలో ఎన్నికలపరమైన రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, సిద్ధాంతపరమైన రాజకీయాల గురించే ప్రస్తావిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రసంగాలు చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు.

భారత తొలి ప్రధాని నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది అని స్టాలిన్ అన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను అమ్మెస్తోందని, పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లాడటానికి కూడా అనుమతించకుండా గొంతు నొక్కుతోందని మండిపడ్డారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత్‌-చైనా బలగాల ఘర్షణ విషయంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బీజేపీ నిరాకరించింది. సభ్యులు సభలో ఆందోళనలు చేయడంతో రోజూ వాయిదాల పర్వాన్నే కొనసాగించింది. ఈ నేథ్యంలోనే శీతాకాల సమావేశాలను ఆరు రోజులు ముందుగానే ముగించింది. 
చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ!

మరిన్ని వార్తలు