తిరుగులేని స్టాలిన్‌.. వార్‌ వన్‌సైడ్‌!?

2 May, 2021 13:05 IST|Sakshi

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వేల అంచనాలు నిజం చేస్తూ ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన 117 స్థానాలు దాటేసిన డీఎంకే ప్రస్తుతం 137 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఆ పార్టీ అధినేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్‌ సైతం కలత్తూరులో విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇక పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేకు షాకిస్తూ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ కొలువుదీరడం ఖాయమైన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. స్టాలిన్‌ సోదరి కనిమొళి సహా పార్టీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. 

కాగా దివంగత ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖచిత్రంగా మారి పాలనపై తమదైన ముద్ర వేసిన కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు లేకుండానే జరిగిన అసెంబ్లీ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తండ్రి మరణం తర్వాత పూర్తిస్థాయిలో డీఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్‌ అధికార అన్నాడీఎంకే- బీజేపీ కూటమిని ఎలా ఢీకొడతారన్న అంశం ప్రజల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా సోదరుడు అళగిరితో విభేదాల నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, ఒకవేళ సోదరుడు సొంతపార్టీ పెడితే దానిని ఎలా ఢీకొంటారన్న విషయాలపై విస్తృత చర్చ జరిగింది. అయితే, ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయిన స్టాలిన్‌, తండ్రిని గుర్తుచేస్తూనే తమకు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామన్న అంశాలపై ప్రసంగాలు చేశారు. 

విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తూ మేనిఫెస్టో విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. అదే విధంగా, నూతన వ్యవసాయ చట్టాలు, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ, నీట్‌ వివాదం, కరోనా వ్యాప్తి వంటి అంశాలను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అదే సమయంలో బీజేపీతో కూటమిగా ఏర్పడిన అన్నాడీఎంకే విధానాలను తూర్పారబడుతూ ముందుకు సాగిపోయారు. మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రజలకు మరింత చేరువయ్యారు. 

మరోవైపు.. అన్నాడీఎంకే సైతం మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది. ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే... పోటీ చేసేది 20 సీట్లలోనేనైనా బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, తమిళనాడు ఆడపడుచు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, స్థానిక బీజేపీ నేత, నటి గౌతమి తదితర 30 మంది స్టార్‌ క్యాంపెయినర్లను రంగంలోకి దించి ఆర్భాటంగా ప్రచారం నిర్వహించింది. కానీ, ఓటర్లు మాత్రం వార్‌ వన్‌సైడ్‌ చేశారు. ఇంట గెలిచిన స్టాలిన్‌ను రచ్చ గెలిపిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చారు. దీంతో డీఎంకేలో కరుణానిధి తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టబోయే మొదటి వ్యక్తిగా ఆయన తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సుస్థిరం చేసుకోనున్నారు.

చదవండి: తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు: సంబరాల్లో డీఎంకే కార్యకర్తలు

మరిన్ని వార్తలు