డీఎంకే సరికొత్త అధ్యాయం మొదలైంది: స్టాలిన్‌

2 May, 2021 15:10 IST|Sakshi

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తథ్యమని అయితే ప్రాణాలు పణంగా పెట్టి విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం లేదని డీఎంకే అధినేత స్టాలిన్‌ అన్నారు. మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యకర్తలంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు శాసన సభకు ఏప్రిల్‌ 6న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో 141 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ డీఎంకే అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది. దీంతో, కార్యకర్తలు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరి సంబరాలు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను, పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు.. ‘‘పోల్‌ బూత్‌ వద్ద ఉన్న కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. విజయం ఖాయమని తెలుసు. అయితే, సంబరాలు చేసుకోవడం తగదు. మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. డీఎంకే సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. ముందు మనల్ని మనం కాపాడుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలం కదా. అందుకే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించండి’’ అని పిలుపునిచ్చారు.

ఇక డీఎంకే నేత, ఎంపీ టీకేఎస్‌ ఎలంగోవన్‌ మాట్లాడుతూ... ‘‘డీఎంకే శ్రేణులు విజయోత్సాహంలో మునిగిపోయాయి. అయితే, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త తమ ఇంట్లోనే సంబరాలు చేసుకోవాలి. డీఎంకే కుటుంబంలోని సభ్యులుగా మన అధినేత సూచనలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా ఎన్నికల విజయోత్సవాలపై ఎన్నికల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అయిదు రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: తిరుగులేని స్టాలిన్‌.. వార్‌ వన్‌సైడ్‌!?

మరిన్ని వార్తలు