అన్నాడీఎంకేది అప్పుల పాలన.. రోజుకు రూ.87.31 కోట్ల వడ్డీ!

10 Aug, 2021 13:31 IST|Sakshi

ఒక్కో కుటుంబంపై రూ.2.64 లక్షల రుణభారం 

ఐదేళ్లలో రూ.5.70 లక్షల కోట్ల అప్పు 

రోజుకు రూ.87.31 కోట్ల వడ్డీ చెల్లింపు 

శ్వేతపత్రం విడుదల చేసిన ఆర్థికమంత్రి 

దశాబ్దకాలం పరిపాలించిన అన్నాడీఎంకే రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. ఆర్థికమంత్రి పీటీఆర్‌ పళనివేల్‌ త్యాగరాజన్‌ విమర్శించారు. ఈ మేరకు గత ప్రభుత్వం చేసిన రుణాలు, వాటికి చెల్లిస్తున్న వడ్డీ వాటివల్ల రాష్ట్ర ప్రజలపై పడుతున్న అదనపు భారం తదితర అంశాలను సవివరంగా తెలియజేస్తూ ఆయన సోమవారం శ్వేతపత్రం విడుదల చేశారు. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం సాగించిన.. అప్పుల పాలన కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందని ఆర్థిక మంత్రి పీటీఆర్‌ పళనివేల్‌ త్యాగరాజన్‌ అన్నారు. నాటి పాలకుల అసంబద్ధ నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబ సభ్యుడు.. బాధితులుగా మారిపోయారని విమర్శించారు. తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై చెన్నై సచివాలయంలో సోమవారం ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.  

‘‘గత ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు అప్పు చేసింది. అందులో 50 శాతాన్ని అంటే రూ.1.50 కోట్లను రోజువారీ ఖర్చుకు వినియోగించడం వల్ల.. అది రెవెన్యూలోటుగా మారింది. ఆ సొమ్మును ప్రణాళికబద్ధమైన పథకాలకు వెచ్చించి.. ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచి ఉండొచ్చు. కరోనా ఛాయలు లేకముందే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోకి జారిపోయింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలో నివసించే ఒక్కో కుటుంబంపై ప్రస్తుతం రూ.2.63 లక్షల రుణభారం పడింది.

ఒక్కో వ్యక్తి రూ.50 వేల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అన్నిశాఖలు ఆర్థికలోటులో కూరుకుపోయినా, మద్యం అమ్మకాల ద్వారా భారీగానే ముట్టింది. అప్పులతోనే నెట్టుకొచ్చేలా రవాణా, విద్యుత్‌శాఖలను దిగజార్చారు. విద్యుత్‌శాఖకు 90 శాతం, రవాణాశాఖకు 5 శాతం లెక్కన రూ.91 వేల కోట్ల రుణం పొందేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విద్యుత్‌శాఖలో నెలకొన్న ఆర్థికలోటుకు కేంద్ర ప్రభుత్వం కూడా కారణమే.

రాష్ట్ర ప్రభుత్వ వాటాను సక్రమంగా చెల్లించడం లేదు. జీఎస్టీ బకాయి రూ.20,033 కోట్లకు పేరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులను కేంద్రం బలవంతంగా లాక్కుంది. దీంతో రాష్ట్రానికి వడ్డీ భారం పెరిగిపోతోంది. అసెంబ్లీ అంగీకారం లేకుండా రూ. కోటి వృథాగా ఖర్చు చేశారు. 2011–2016లో రూ.17వేల కోట్లు, 2021లో  రూ.61,320 కోట్ల లోటు బడ్జెట్‌కు రాష్ట్రం పడిపోయింది. గత ఐదేళ్లలో పరోక్షంగా రూ.29,079 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. మొత్తంగా ప్రభుత్వ రుణభారం రూ.5.24 లక్షల కోట్లకు చేరింది.

ప్రస్తుతం ప్రభుత్వం రూ.92.305 కోట్ల లోటు బడ్జెట్‌ను ఎదుర్కొంటోంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో పన్ను వసూళ్ల పురోగతి 11.4 శాతం ఉండగా, అన్నాడీఎంకే కాలం నాటికి అది 4.4 శాతానికి దిగజారింది. ప్రభుత్వం నడిపే ఒక్కో బస్సు ఒక కిలోమీటరుకు రూ.59.15 నష్టాన్ని భరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించనందున రూ.2,577 కోట్ల నష్టం ఏర్పడింది. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత లోటుబడ్జెట్‌ను ఎదుర్కొనలేదు. రుణాలు చెల్లించే సామర్థ్యాన్ని కోల్పోవడంతో వడ్డీభారం పెరిగిపోయింది.

తమిళనాడు ప్రభుత్వం రోజుకు రూ.87.31 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. 1999–2000లో రూ.18,989  కోట్లు, 2000–01లో రూ.28,685 కోట్లు, 2001–02లో రూ.34,540 కోట్లు, 2005–06లో రూ.50,625 కోట్లు, 2011–12లో రూ.1,03,999 కోట్లు, 2015–16లో రూ.2,11,483 కోట్లు, 2017–18లో రూ.3,14,366 కోట్లు, 2020–21లో రూ.4,56, 660 కోట్లు, 2021లో ఇప్పటి వరకు రూ.4,85,502 కోట్లుగా రుణభారం పెరిగిపోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే  మనం దుర్భర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎన్నోరెట్లు పడిపోయిందని రిజర్వు బ్యాంకు బృందమే ఒక ప్రకటన లో స్పష్టం చేసింది.  ఆర్థికలోటును ఎదుర్కొనేందుకు మాప్రభుత్వం సిద్ధమైంది. ఐదేళ్లలో ఈలోటు ను సరిచేస్తాం’’ అని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. 

ఎలాంటి భయం లేదు : ఎడపాడి 
డీఎంకే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తమకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని, భయం కూడా లేదని ప్రధాన ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. సేలం జిల్లా ఎడపాడిలో మీడియాతో సోమవారం మాట్లాడారు. 2011లో డీఎంకే ఓడిపోయినప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వంపై రూ.1.14 లక్షల కోట్ల రుణభారాన్ని మోపి వెళ్లారన్నారు. ఆనాటి నుంచి అప్పుల భారం పెరిగిపోతూనే వచ్చిందన్నారు. అవన్నీ అభివృద్ధి పథకాల కోసం తమ ప్రభుత్వం తీసుకున్న అప్పులని పేర్కొన్నారు. 

చదవండి: ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా 1600 కి.మీ దూరం.. నవజాత శిశువుకు చికిత్స

మరిన్ని వార్తలు