EPS Vs OPS: నీకు ఎలాంటి అధికారం లేదు: తొలిసారి పళనిస్వామి బహిరంగ ప్రకటన

1 Jul, 2022 07:19 IST|Sakshi

చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. పన్నీర్‌ సెల్వంపై బహిరంగంగా తొలిసారి వ్యతిరేక కామెంట్లు చేశారు మాజీ సీఎం పళనిస్వామి. ఈ మేరకు  పన్నీర్‌సెల్వంకు ఇక మీదట పార్టీ కో-ఆర్డినేటర్‌ కాదంటూ ఈపీఎస్‌ ఓ లేఖ రాశారు. 

ఇకపై ఓ.పన్నీర్‌సెల్వం.. అన్నాడీఎంకే పార్టీ కో-ఆర్డినేటర్‌ కాదని, ఇద్దరి ఆమోదం తర్వాత ఏర్పాటు చేసిన జనరల్‌ కౌన్సిల్‌ భేటీ(జూన్‌ 23న) రసాభాసకు కారణం పన్నీర్‌ సెల్వమేనని పళని స్వామి ఆరోపించారు. 2021, డిసెంబర్‌ 1న  పార్టీ రూపొందించిన ప్రత్యేక చట్టాలను పన్నీర్‌సెల్వం ఉల్లంఘించారని,  జనరల్‌ కౌన్సిల్‌ భేటీ జరగకుండా పోలీసులను.. కోర్టును ఆశ్రయించారని, భేటీలో గందరగోళంతో పాటు కీలక తీర్మానాల ఆమోదానికి కొందరు కార్యకర్తల ద్వారా అడ్డుతగిలారని.. కాబట్టి పన్నీర్‌సెల్వం ఇకపై అన్నాడీఎంకే పార్టీ కో ఆర్డినేటర్‌ కొనసాగే అర్హత లేదని పళనిస్వామి ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు.. స్థానిక ఎన్నికలకు సంబంధించి.. అభ్యర్థుల పేర్లతో ఓపీఎస్‌ పంపిన లేఖను సైతం పళనిస్వామి పక్కనపెట్టారు. గడువు ముగిశాక పంపిన పేర్లను పరిశీలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు పళనిస్వామి. ఇదిలా ఉంటే.. పళనిస్వామి పంపిన లేఖలో తనను తాను పార్టీ హెడ్‌క్వార్టర్స్‌ సెక్రటరీగా పేర్కొనగా.. ఓపీఎస్‌ను కోశాధికారిగా(ట్రెజరర్‌) ప్రస్తావించారు. కిందటి ఏడాది ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలో పన్నీర్‌ సెల్వంను కో-ఆర్డినేటర్‌గా, పళనిస్వామిని జాయింట్‌ కో-ఆర్డినేటర్‌గా ఎనుకున్నారు. అయితే పళనిస్వామి పార్టీ అధికారం అంతా ఒకరి చేతుల్లోనే ఉండాలని వాదిస్తుండగా, పన్నీర్‌సెల్వం మాత్రం పాత విధానం కొనసాగాలని డిమాండ్‌ చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు