బాహుబలి రేంజ్‌ క్లైమాక్స్‌ అంటే ఇదే.. అన్నాడీఎంకే పగ్గాలు పళనికే..!

12 Jul, 2022 18:15 IST|Sakshi

ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సభలు.. సమావేశాలు, దాడులు.. దౌర్జన్యాలు, ఎత్తులు.. పై ఎత్తులతో గత పక్షం రోజులుగా సాగిన అన్నాడీఎంకే ఆధిపత్య పోరుకు తెరపడింది. పార్టీ పగ్గాలు ప్రస్తుతానికి పళనిస్వామికే దక్కాయి. అయితే సోమవారం క్లైమాక్స్‌ మాత్రం బాహుబలి, కేజీఎఫ్, విక్రమ్‌ సినిమాలకు తక్కువ కాదన్నట్లుగా సాగింది.

సర్వసభ్య సమావేశంలో వానగరం వేదికగా ఎడపాడి పార్టీ పగ్గాలు అందుకున్నారనే సమాచారంతో.. పన్నీరు సెల్వం వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. ఓపీఎస్‌ తన మద్దతుదారులతో రాయపేటలోని పార్టీ కార్యాలయం తలుపులను బద్దలు కొట్టి.. దాన్నిస్వాధీనంలోకి తెచ్చుకున్నారు. సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం అక్కడికి వచ్చి వీరంగం సృష్టించింది. దాడులు.. ప్రతిదాడులతో పార్టీ కార్యాలయ     ప్రాంగణం దద్దరిల్లింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసి పలువురు ఆందోళన కారులను అరెస్ట్‌ చేసింది. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: గత కొంతకాలంగా అన్నాడీఎంకేలో సాగుతున్న ఆధిపత్యపోరులో ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించారు. పన్నీర్‌ కల్పించిన అడ్డంకులను అధిగమించి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి ఎంపికయ్యారు. దీంతో ప్రత్యర్థి వర్గం ఎడపాడి మద్దతుదారులపై విరుచుకుపడగా జరిగిన అల్లర్లు, వాహనాల ధ్వంసం, పరస్పర ముష్టిఘాతాలు, కత్తివేట్లతో పార్టీ కార్యాలయ పరిసరాలు యుద్ధభూమిని తలపించాయి. అమ్మ మరణంతో ఖాళీగా మారిన ప్రధాన కార్యదర్శి పదవిని చేజిక్కించేందుకు తొలుత శశికళ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆమె జైలుకెళ్లగా, సమన్వయ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లుగా పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి జయస్థానాన్ని భర్తీ చేశారు. అయితే ఇద్దరికీ పొసగకపోవడంతో చాపకిందినీరులా ఉన్న అంతఃకలహాలు అసెంబ్లీ ఎన్నికల తరువాత బట్టబయలయ్యాయి. పార్టీ సారథులుగా ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అంటూ ఏక నాయకత్వ నినాదం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో సుమారు 80 నుంచి 90 శాతం మంది నాయకులు, కార్యకర్తలు ఎడపాడి వైపు నిలువడంతో పన్నీర్‌సెల్వం కోపం కట్టలు    తెంచుకుంది. 

ఎడపాడికి అన్నీ మంచి శకునాలే.. 
ఇదిలా ఉండగా, ఈనెల 11వ తేదీన ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యేందుకు ఎడపాడి అన్నీ సిద్ధం చేసుకున్నారు. సమావేశంపై స్టే కోసం పన్నీర్‌సెల్వం కోర్టు కెక్కడంతో ఎడపాడి శిబిరం తీవ్ర ఉత్కంఠకు లోనైంది. అయితే సోమవారం వెలువడిన తీర్పు ఎడపాడికి అనుకూలమైంది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు.

దీంతో యధావిధిగా సర్వసభ్య సమావేశం జరిగింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి, కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్‌ ఎంపికయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్‌ పదవులు రద్దు, పార్టీ నుంచి పన్నీర్‌ బహిష్కరణ, ప్రధాన కార్యదర్శి పదవికి నాలుగు నెలల్లోగా ఎన్నికలు తదితర 16 తీర్మానాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకగ్రీవ ఆమోదం పొందాయి. అంతేగాక శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అనే పదవిని రద్దు చేస్తూ పార్టీ బైలాను సవరించారు. కాగా అన్నాడీఎంకేను మళ్లీ అధికారంలోకి తెస్తామని సర్వసభ్య సమావేశంలో ఎడపాడి ధీమా వ్యక్తం చేశారు.  

రెచ్చిపోయిన ఇరువర్గాలు
ఎడపాడి ఎత్తులకు చిత్తయిన పన్నీర్‌సెల్వం పార్టీ ప్రధాన కార్యాలయంలో పాగా వేశారు. ఎడపాడి మద్దతుదారులంతా వానగరంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో ఉండగా, పన్నీర్‌సెల్వం తన అనుచరులతో కలిసి రాయపేట పార్టీ కార్యాలయంలోకి తలుపులను బద్దలు కొట్టి మరీ వెళ్లారు. అక్కడున్న ఎడపాడి ఫొటోలను చించివేసి తగులబెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం పార్టీ కార్యాలయంలోకి జొరబడి వీరంగం సృష్టించింది. ఇందుకు ప్రతిగా పన్నీర్‌ అనుచరులు సైతం ముష్టిఘాతాలకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కత్తులు, కర్రలు ఇతర మారణాయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఒకరినొకరు వెంటాడారు. ఫలితంగా కొందరికి గాయాలయ్యాయి.  

శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో.. 
దాడుల కారణంగా అనేక వాహనాలు ధ్వంసమై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి.. శాంతిభద్రతల సమస్య తలెత్తింది. పోలీసులు భారీగా మొహరించి లాఠీచార్జీ చేసినా పార్టీ శ్రేణులను నిలువరించడం సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 144 సెక్షన్‌ విధించి పార్టీ కార్యాలయానికి సీలు వేసి పలువురిని అరెస్ట్‌ చేసింది. ఇందుకు నిరసన తెలుపుతూ పన్నీర్‌ తన మద్దతుదారులతో ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఎడపాడి వర్గీయులు పన్నీర్‌సెల్వం తదితరులపై పోలీసు కేసు పెట్టారు. పార్టీ నుంచి తనను ఎడపాడి బహిష్కరించడం కాదు, తానే ఎడపాడి, కేపీ మునుస్వామిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు.

చదవండి: సీఎంకు చల్లటి చాయ్‌: అధికారికి నోటీసులు.. కఠిన చర్యలు!

మరిన్ని వార్తలు