Tamil Nadu Assembly: ఉపనేతగా పన్నీరు సెల్వం.. వాళ్లకు షాక్‌!

15 Jun, 2021 14:09 IST|Sakshi
పార్టీ వర్గాలతో పన్నీర్‌ సెల్వం(ఫైల్‌ ఫొటో)

విప్‌గా ఎస్పీ వేలుమణి

అన్నాడీఎంకే శాసనసభాపక్షం ఏకగ్రీవం 

చిన్నమ్మ మద్దతుదారులకు ఉద్వాసన

శశికళతో మాట్లాడిన 15 మంది నేతల తొలగింపు

జాబితాలో మాజీ మంత్రి ఆనందన్, అధికార పత్రినిధి పుహలేంది,  మాజీ ఎంపీ చిన్నస్వామి

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఉపనేతగా ఓ పన్నీరు సెల్వం, విప్‌గా మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సోమవారం చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే శాసన సభా పక్ష సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే చిన్నమ్మ శశికళతో టచ్‌లో ఉన్న నేతల ఉద్వాసనకు తీర్మానించారు. మాజీ మంత్రి ఆనందన్, అధికార ప్రతినిధి పుహలేందితో సహా 15 మందిని అన్నాడీఎంకే నుంచి తొలగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి 66 మంది గెలిచిన విషయం తెలిసిందే. ఆ పార్టీ శాసన సభపక్ష నేతగా మాజీ సీఎం పళనిస్వామి ఇప్పటికే ఎన్నికయ్యారు. ఇక ఉపనేత, విప్‌ ఎంపిక నిమిత్తం అన్నాడీఎంకే శాసన సభాపక్షం సోమవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. 

పట్టువీడిన పన్నీరు 
రెండున్నర గంటల పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ సాగింది. ఇందులో పన్నీరు సెల్వంను శాసనసభాపక్ష  ఉప నేత పగ్గాలు చేపట్టాల్సిందేనని ముక్తకంఠంతో నేతలు నినదించారు. దీంతో ఆయన ఓ మెట్టుదిగి పదవి చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. అలాగే అన్నాడీఎంకేను కైవశం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న శశికళను అడ్డుకునే దిశగా చర్చ సాగింది. ఈ మేరకు కీలక తీర్మానాన్ని చేశారు. ఆమెతో ఎవరైనా మాట్లాడితే ఉద్వాసనే అన్న హెచ్చరిక చేశారు. ఈ సమావేశం అనంతరం అన్నాడీఎంకే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే శాసనపక్షా పక్ష  ఉపనేతగా ఓ పన్నీరు సెల్వం, విప్‌గా మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, సహాయ విప్‌గా అరక్కోణం ఎమ్మెల్యే ఎస్‌. రవి ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ప్రకటించారు. అలాగే అన్నాడీఎంకే కోశాధికారిగా మాజీ మంత్రి కడంబూరు రాజు, కార్యదర్శిగా మరో మాజీ మంత్రి కేపీ అన్బళగన్, సహాయ కార్యదర్శిగా మనోజ్‌ పాండియన్‌లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.  

పార్టీ నేతలకు హెచ్చరిక 
శశికళతో ఫోన్లో మాట్లాడినా, సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేసినా అన్నాడీఎంకేలో చోటు లేదని హెచ్చరించే రీతిలో మరో ప్రకటన విడుదలైంది. ఆమెతో మాట్లాడిన 15 మంది నేతలను పార్టీ నుంచి తొలగించారు. ఇందులో మాజీ మంత్రి ఆనందన్, మాజీ ఎంపీ చిన్నస్వామి, పార్టీ అధికార ప్రతినిధి పుహలేందితో పాటు పలువురు నేతలు ఉండడం గమనార్హం. దీనిపై మాజీ మంత్రి జయకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేలో ఐక్యమత్యంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల సమవేశమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. శశికళకు మద్దతిస్తే ఎవరికైనా అన్నాడీఎంకేలో చోటు ఉండదని హెచ్చరించారు.   

చదవండి: ఎల్జేపీలో ముసలం.. నితీశ్‌ చాణక్యం!

>
మరిన్ని వార్తలు