అన్నాడీఎంకే పంచాయతీ: ఢిల్లీలో పళని.. గల్లీలో పన్నీర్‌

24 Jul, 2022 21:28 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేపై పట్టు సాధించిన  పళనిస్వామి ఢిల్లీలో ప్రధాని మోదీ సహా పలువురు నేతలను కలుసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక పార్టీ అంతర్గత పోరులో వెనుకబడిన పన్నీరు సెల్వం చెన్నైలో ఉంటూ పిటీషన్ల పర్వం కొనసాగిస్తున్నారు. 

నేపథ్యం ఇదీ.. 
ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం మధ్య భగ్గుమన్న విబేధాలు అన్నాడీఎంకే చీలికదిశగా సాగు తు న్నాయి. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ ఎన్నికైన∙వెంటనే పనిలోపనిగా ఓపీఎస్‌ పనిపట్టడం ప్రారంభించారు. పన్నీర్, ఆయన ఇద్దరు కుమారులు రవీంద్రనాథ్, జయప్రదీప్‌ ఇతర మద్దతుదారులపై శాశ్వత బహిష్కరణ వేటు వేశారు. అంతేగాక కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌ను తప్పించి, అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పన్నీర్‌ కుమారుడైన తేనీ లోక్‌సభ సభ్యుడు రవీంద్రనా«థ్‌కు అన్నాడీఎంకే పార్లమెంటరీ నేత హోదా నుంచి కూడా తప్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఎడపాడి ఇటీవల లేఖ రాశారు. పార్టీ కార్యాల యం ధ్వంసం చేసి, ఖరీదైన వస్తువులను, కొన్ని పత్రా లను అపహరించినట్లుగా ఎడపాడి మద్దతుదారైన సీవీ షణ్ముగం ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన ఓపీఎస్, వైద్యలింగం, మనోజ్‌పాండియన్‌ సహా 9 మందిపై  చర్య తీసుకోవాలని కోరుతూ చెన్నై రాయపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన ఫిర్యాదు చేశారు.  

బిజీబిజీగా ఓపీఎస్‌ 
రాష్ట్రంలో పరిస్థితులను పక్కనబెట్టి.. ఎడపాడి పళనిస్వామి దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఈపీఎస్‌ శనివారం ఢిల్లీ పెద్దలను కలవడం మొదలుపెట్టారు.  ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందిన ద్రౌపది ముర్మును  కలిసి అభినందనలు తెలిపారు. అలాగే, శుక్రవారం రాత్రి ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీడ్కోలు విందులో పాల్గొన్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకున్నారు. ఎడపాడి ఢిల్లీలో మరో రెండురోజులుండి పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, పన్నీర్‌ వైఖరిని మోదీకి వివరించనున్నట్లు తెలిసింది. కాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీడ్కోలు, కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ సభలకు ఎడపాడిని మాత్రమే కేంద్రం ఆహ్వానించినట్లు ప్రధాన ప్రతిపక్ష ఉపనేత ఆర్‌బీ ఉదయ్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడిని కేంద్రం అంగీకరించినట్లు భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.  

స్పీకర్‌కు ఓపీఎస్‌ లేఖ 
తనను అన్నాడీఎంకే నుంచి తొలగించినట్లుగా ఎడపాడి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవద్దని     లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఓ పన్నీర్‌సెల్వం, తేనీ ఎంపీ రవీంద్రనాథ్‌ శనివారం ఓ లేఖ పంపారు. ఈపీఎస్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లదనే వివాదం న్యాయస్థానంలో విచారణ దశలో ఉందని, ఇదే అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఓపీఎస్‌ రాసిన ఉత్తరం పరిశీలనలో ఉందని అందులో పేర్కొన్నారు. ఈసీ రికార్డుల్లో పార్టీ కన్వీనర్‌గా పన్నీర్‌సెల్వమే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన అనుమతి లేకుండా, పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 11వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి చట్టబద్ధత లేదని లేఖలో స్పష్టం చేశారు. 

బ్యాంకు ఖాతాలు సీజ్‌ చేయాలి 
కాగా అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేయాలని ఆ పార్టీ కన్వీనర్‌ హోదాలో ఓ పన్నీర్‌సెల్వం రిజర్వు బ్యాంకు చెన్నై మండల డైరెక్టర్‌కు శనివారం లేఖ రాశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వ్యవహారంలో ఎన్నికల కమిషన్‌ ఓ నిర్ణయానికి వచ్చే వరకు అన్నాడీఎంకేకు చెందిన ఏడు బ్యాంకు ఖాతాలను తక్షణం స్తంభింపజేయాలని కోరారు. ఈసీ రికార్డుల్లో తానే కన్వీనర్, కోశాధికారినని, ఇందుకు సంబంధించిన రికార్డులను ఇప్పటికే ఈసీకి సమర్పించానని అందులో   స్పష్టం చశారు. 

మరిన్ని వార్తలు