తమిళనాడు పోల్స్‌: దుస్తులు ఉతికి, గిన్నెలు తోమి

23 Mar, 2021 15:02 IST|Sakshi

పార్టీని గెలిపిస్తే వాషింగ్‌ మెషీన్‌ ఉచితం:  అన్నా డీఎంకే

ఎన్నికల ప్రచారంలో బట్టలుతికిన అభ్యర్థి తంగా కతిరావన్‌

సాక్షి,చెన్నై: తమిళనాట అసెంబ్లీ ఎ‍న్నికల ప్రచారం జోరందుకుంది. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని  పార్టీలు, అభ్యర్థులు  ఓటర్లను ఆకర్షించేందుకు పలు వాగ్దానాలు గుప్పించడం, చిత్ర విచిత్ర శైలిలో ప్రచారం చేయడం సర్వ సాధారణం. తమిళనాట హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సరికొత్త పంథాను ఫాలో అయిపోతున్నారు. తాజాగా నాగపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఏఐఏడిఎంకె అభ్యర్థి తంగా కతిరావన్ వార్తల్లో నిలిచారు. బహిరంగంగా బట్టలు ఉతికి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే తన నియోజక వర్గంలో ‘అమ్మప్రభుత్వం’ ప్రతీ ఇంటికి ఒక వాషింగ్ మెషీన్‌ను ఇస‍్తుందని హామీ ఇచ్చారు. చురుకైన స్థానిక నేతగా పేరొందిన కతివారన్‌ తొలిసారి మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు.

సోమ‌వారం ప్ర‌చార స‌మ‌యంలో నాగ‌ప‌ట్ట‌ణంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ప్రచారాని వెళ్లిన సమయంలో ఒక మహిళ బట్టలు ఉతుకుతూ కనిపించింది. అంతే రంగంలోకి దిగిన కతిరావన్‌ బట్టలు తాను ఉతుకుతానని ఆమెను కోరారు.మొదటలో మొహమాటంతో  కాస్త సంశయించిన ఆ మహిళ చివరికి ఆయన చేతికి దుస్తులు ఇవ్వక తప్పలేదు.  దీంతో కాసేపు బట్టలు వాష్‌ చేసిన ఆయన, పనిలో పనిగా పక్కనే ఉన్న గిన్నెలను కూడా తోమేశారు.  ఈ పరిణామంతో ఔరా అం‍టూ  ఆశ్చర్యపోవడం అక‍్కడున్నవారి వంతైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరు రోబోతో ప్రచారం చేస్తున్నారు, మరికొందరు పార్టీ ఎన్నికల చిహ్నాన్ని తమ తలపై వేసుకుంటున్నారు.  కాగా ఇంటింటికి వాషింగ్ మెషీన్లు, సోలార్ స్టవ్‌లు, కేబుల్ టీవీ కనెక్షన్లను ఫ్రీగా ఇస్తామని అన్నా డీఎంకే తాజా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు