MK Stalin: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం!

3 Sep, 2021 07:47 IST|Sakshi

ప్రజలసొత్తు  ప్రయివేటీకరించడం తగదు 

అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ 

ప్రధాని మోదీకి లేఖరాస్తానని వెల్లడి 

నీట్‌ పరీక్షపై అసెంబ్లీలో రగడ 

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజల సొత్తును కేంద్రప్రభుత్వం ప్రయివేటీకరించడం దారుణం. దీన్ని ఎంతమాత్రం సహించబోమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చెన్నై కలైవానర్‌ అరంగంలో గురువారం నాటి అసెంబ్లీ కార్యక్రమాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వైద్య, ప్రజారోగ్యశాఖలపై సభ్యుల మధ్య చర్చ సాగింది. ఈ సమయంలో సభ్యులు పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ప్రసంగించారు.  

అంగడి సరుకుగా మార్చేశారు 
కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత సెల్వపెరుమాళ్, సీసీఐ సభ్యుడు రామచంద్రన్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజాపనుల శాఖ 70 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఆస్తులను ఏడేళ్లుగా అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వం అమ్ముకుంటూ వస్తోందని విమర్శించారు. ఊటీ రైల్వే పథకం, విమానాశ్రయం, జాతీయ రహదారుల శాఖ, హార్బర్‌ వంటివన్నీ అంగడి సరుకుగా మార్చేసింది. ఇది ఒక్క తమిళనాడు సమస్య కాదు, దేశ సమస్యగా భావించాలని అన్నారు. ఈ దురాగతాన్ని ముఖ్యమంత్రి అడ్డుకోవాలి, పారంపర్య ఆస్తులను కాపాడుకోవాలని కోరారు.

ఈ వ్యవహారాన్ని తమ ప్రభుత్వం అడ్డుకుంటుందని వాణిజ్యశాఖమంత్రి తంగం తెన్నరసు బదులిచ్చారు. అనంతరం సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, ప్రజాపనులశాఖ పరిధిలోని సంస్థలు మనందరి సొత్తని అన్నారు. లాభాపేక్షకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని స్థాంపించిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రజల ఆస్తులను ప్రయివేటుపరం చేయడం సబబు కాదని ప్రధాని మోదీకి ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నట్లు స్టాలిన్‌ తెలిపారు.  

అధికార– విపక్ష సభ్యుల వాగ్వాదం 
వైద్యవిద్యలో ప్రవేశానికి నీట్‌ పరీక్షను ప్రవేశపెట్టింది ఎవరనే అంశంపై అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరుణానిధి, జయలలిత  హయాంలో రాష్ట్రంలో నీట్‌ పరీక్ష రాలేదు, ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి ఉన్నప్పుడే వచ్చిందని వైద్యమంత్రి ఎం. సుబ్రమణియన్‌ అన్నారు.  2011లో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నీట్‌ పరీక్షను ప్రతిపాదించినా డీఎంకే గట్టిగా వ్యతిరేకించదని చెప్పారు.

నీట్‌కు వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. నీట్‌ పరీక్షపై స్పీకర్‌ అనుమతితో కాంగ్రెస్‌ సభ్యురాలు విజయధరణి మాట్లేడేందుకు సిద్ధం కాగా అన్నాడీఎంకే సభ్యులు కేకలు వేస్తూ అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ సభాపక్ష ఉపనేత రాజేష్‌కుమార్‌ చేయిచూపుతో ఏదో మాట్లాడగా, అన్నాడీఎంకే సభ్యులంతా లేచినిలబడి ఖండించారు. 

అమరులకు.. స్మారకమండపం 
సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ సామాజిక రిజర్వేషన్ల కోసం 1987లో జరిగిన పోరాటంలో అశువులు బాసిన 21 మంది యోధులకు రూ.4 కోట్లతో స్మారకమండపం నిర్మిస్తామని, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. నకిలీ రిజిష్ట్రేషన్లను అడ్డుకునేందుకు అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. టోల్‌గేట్లలో చార్జీల వసూలును రద్దు చేయడం లేదా వాటి సంఖ్యను 16కు కుదించడంపై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి వేలు స్పష్టం చేశారు.   

చదవండి: Padmarajan Record: రాజాధిరాజన్‌  ఓడినా.. రికార్డే 

మరిన్ని వార్తలు