మునుగోడు ఎన్నికతో టీఆర్‌ఎస్‌ సైలెంట్‌! ఉనికేలేని బీజేపీకి ఇది ప్లస్‌?

22 Sep, 2022 18:58 IST|Sakshi

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టదలచుకోలేదా? ప్రత్యర్థి పార్టీ కార్యకర్త చనిపోయినా తమకు అనుకూలంగా మలుచుకుంటుందా? ఖమ్మం జిల్లాలో అసలు కమలనాథుల వ్యూహం ఏంటి? 

తెలంగాణలో బీజేపీ ఉనికి లేని జిల్లా ఏదంటే ఖమ్మం అనే చెప్పాలి. ఈ జిల్లాలో కాషాయ సేనకు చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరు. దీంతో ఇక్కడ కమలం పార్టీ పుంజుకోవడం సాధ్యం కావడంలేదు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అదేవిధంగా వామపక్షాలు, టీఆర్ఎస్‌ పార్టీల హవా కూడా నడుస్తోంది. వామపక్షాలకు సీట్లు లేకపోయినా ఓట్‌ బ్యాంక్, కేడర్ బలం అయితే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ఒక్కొక్క సీటులో మాత్రమే విజయం సాధించింది. 

కాషాయ నేతల హడావుడి 
ఖమ్మం జిల్లాలో నాలుగో ప్లేస్‌లో ఉన్న కమలం పార్టీ పుంజుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అందుకే రాజకీయంగా రచ్చ జరిగిన ఏ ఘటనను వదిలిపెట్టడంలేదు. సొంత పార్టీ కార్యకర్త చనిపోతే ఎంత హడావుడి చేశారో.. టీఆర్ఎస్‌ కార్యకర్త హత్యకు గురైన సందర్భంలో కూడా అంతే హడావుడి చేస్తున్నారు కమలం పార్టీ నాయకులు. ఆగస్టు 15వ తేదీన ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి టీఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై టీఆర్ఎస్‌ నాయకత్వం, ప్రభుత్వం స్పందించిన తీరుపై ఆ పార్టీ కేడర్‌లోనే అసంతృప్తి వెల్లడవుతోంది. ఇక్కడే బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఘటనలో టిఆర్ఎస్‌ను టార్గెట్ చేసుకుని బీజేపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. అదే సమయంలో సొంత పార్టీ కార్యకర్త కృష్ణయ్య హత్యకు గురైతే అధికారంలో ఉండి కూడా టీఆర్ఎస్‌ సరిగా స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మునుగోడు కారణమని ప్రచారం
ఇదే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నేతలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ్మినేని కృష్ణయ్య హత్య ఘటనలో టిఆర్ఎస్ సైలెంట్ గా ఉండటానికి ప్రదాన కారణం మునుగోడు ఉప ఎన్నికనే అనే విషయాన్ని జనంలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కమలం నాయకులు. కృష్ణయ్య హత్యలో సీపీఎం నాయకుల పాత్ర ఉండటంతో..   కేసు నుంచి బయట పడటానికి మునుగోడులో టిఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. 

కృష్ణయ్య హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కమలనాథులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే కేంద్ర మంత్రి బీఎల్ వర్మ స్వయంగా కృష్ణయ్య ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణయ్య హత్య విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర మంత్రి వర్మ వారికి మాటిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పరామర్శకు ప్లాన్‌ చేశారు. చనిపోయింది టీఆర్ఎస్ నాయకుడే అయినా మానవత్వంతో అయినా ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

టీఆర్‌ఎస్‌ నేతలకు బీజేపీ గాలం!
కొన్ని నెలల క్రితం ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఇష్యూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చల్లోకి వచ్చింది. టిఆర్ఎస్ నాయకులు, పోలీసుల వేధింపుల వల్లే తాను చనిపోతున్నానని ప్రకటించి సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మృతుని అమ్మమ్మ, చెల్లితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పడం, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు ముఖ్య నేతలు ఖమ్మం వచ్చి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేయడంతో.. కల్ గా బీజేపీకి కొంత మైలేజ్ వచ్చింది. ఈ ఘటన బీజేపీ కార్యకర్తల్లో ఎంతో మనో ధైర్యాన్ని నింపిందన్న అంశాన్ని గుర్తుచేస్తూ... కృష్ణయ్య హత్యను టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు లైట్ గా తీసుకుంటున్నారన్న చర్చ సైతం ఖమ్మం జిల్లాలో మొదలైంది.

మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల ముఖ్యనేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. టిఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలకు గాలం వేస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో పాటు మరికొందరు నేతలను బీజేపీలోకి రప్పించుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రాజకీయ సమీకరణాలు మార్చేందుకు కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు