బుల్లెట్‌ ట్రైన్‌లో చంద్రబాబు తిరుగుతున్నారా?.. సీపీఎం నేతలు ఫైర్‌

28 Apr, 2023 17:43 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: చంద్రబాబుపై సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ దేశాభివృద్ధి కోసం పనిచేయడం లేదని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకి చెప్పాలని నిలదీశారు. పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా.. బాబు చెప్పాలంటూ తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు.

‘‘బీజేపీ దేశాభివృద్ధి కోసం పనిచేయడం లేదని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా.. బాబు చెప్పాలి. రైతుల ఆదాయం డబుల్‌ చేస్తానన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా? బాబు చెప్పాలి. 2022 కల్లా దేశంలో బుల్లెట్‌ ట్రైన్‌ మోదీ నడుపుతామన్నారు.. బుల్లెట్‌ ట్రైన్‌లో చంద్రబాబు తిరుగుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు.
చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’

‘‘18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన మోదీ అవి ఇచ్చారా.. చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు మోదీలో చూస్తున్నది అభివృద్ధి కాదు, పచ్చి అవకాశవాదం. గడ్డిపరకనైనా పట్టుకుని ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న మోదీ విజన్‌లో  పేదలకు, ప్రజలకు స్థానం ఎక్కడ?, పెట్టుబడిదారుల విజన్ మతోన్మాదుల విజన్ అసలు విజన్ కాదు. మోదీ, చంద్రబాబుది విజన్ కాదు.. అదొక డివిజన్’’ అంటూ తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు.

చంద్రబాబు ఏ విజన్‌తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు:శ్రీనివాసరావు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణను టీడీపీ వ్యతిరేకిస్తామని చెబుతోంది. మరి మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోంది. మరి చంద్రబాబు ఏ విజన్‌తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు’’ అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని మోదీ అంటున్నారు. చంద్రబాబు మరి కంటిన్యూ చేస్తా అంటున్నారు.. ఇందులో ఉన్న విజన్ ఏమిటి?. చంద్రబాబుది రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి లేదు. ఈ వైఖరితో చంద్రబాబు ఎన్నడూ ప్రజల విశ్వాసాన్ని పొందలేరు’’ అని శ్రీనివాసరావు దుయ్యబట్టారు.
చదవండి: ఒక ముఖ్యమంత్రికి ఇంతటి స్పందన రావడం జగన్‌ విషయంలోనే..

మరిన్ని వార్తలు