‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. అసెంబ్లీ టికెట్‌పైనే పట్నం, రోహిత్‌రెడ్డి దృష్టి

31 Oct, 2022 13:24 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: తాజా రాజకీయాలు తాండూరు చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో అంతుపట్టని విధంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు టికెట్‌ ఎవరికనే చర్చ అధికార పార్టీలో జోరుగా జరుగుతోంది.

గతంలో తాండూరు స్థానం నాదంటే.. నాది అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బాహాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ‘ఎర’ అంశం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఘటన జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా స్పష్టత రావడంలేదు. ప్రస్తుతం వారి రాజకీయ భవిష్యత్‌పై స్థానికంగా చర్చనీయాంశమైంది.   

ఇద్దరి మధ్య పోటీ తీవ్రం 
తాండూరులో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యతతో రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. తన అనుచరులను సైతం వెంట తెచ్చుకొన్నారు.  

పదవుల విషయంలోనూ.. 
తాండూరు అసెంబ్లీ స్థానం కోసం పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఆశిస్తున్నారు. రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినా మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు పార్టీ,  నామినేట్‌ పదవుల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. తాండూరు అసెంబ్లీ టికెట్‌ సీఎం కేసీఆర్‌  తమకే ఇస్తారని ఇద్దరు నేతలు ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు రాజకీయంగా, అధికారికంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పైచేయిగా నిలిచారు. 

కలిసొచ్చేది ఎవరికో.. 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  పార్టీ అధిష్టానం టికెట్‌ ఎవరికి ఇస్తుందనేది తాజాగా చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపునకు బీజేపీ నాలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగడం.. కథ అడ్డం తిరిగి మధ్య వర్తులు జైలు పాలవడం నాలుగు రోజుల వ్యవధిలో చకచక జరిగిపోయాయి. అయితే ఇందులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని స్వయంగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.  కాగా ఈ వ్యవహారం తాండూరు టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న ఇద్దరి రాజకీయ భవిషత్‌ను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
చదవండి: మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపు కన్ఫర్మ్: మంత్రి హరీష్‌రావు

మరిన్ని వార్తలు