సత్వరమే స్పందించినా రాజకీయమా?

3 May, 2022 04:45 IST|Sakshi
బాధితురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెక్కును అందజేస్తున్న హోం మంత్రి తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌ తదితరులు

రేపల్లె అత్యాచార ఘటనపై హోం మంత్రి తానేటి వనిత

రైల్వే పోలీసులు స్పందించి ఉంటే దారుణం జరిగేది కాదు

రాష్ట్ర పోలీసులు క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకున్నారు

తెల్లవారేసరికే నిందితులను అరెస్టు చేశాం

మంత్రి సురేష్, వాసిరెడ్డి పద్మతో కలసి బాధితులకు హోం మంత్రి పరామర్శ

ఒంగోలు అర్బన్‌/ఒంగోలు/రేపల్లె రూరల్‌: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో వివాహితపై జరిగిన లైంగిక దాడి దురదృష్టకరమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలిచిందని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి చర్యలు తీసుకున్నా టీడీపీ, ఇతర పార్టీలు రాజకీయం చేయడం దారుణమన్నారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబులతో కలసి వనిత పరామర్శించారు. రూ.4.12 లక్షలను బాధిత కుటుంబానికి అందజేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ కూడా వ్యక్తిగతంగా కొంత మొత్తాన్ని అందించారు.

అనంతరం తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. బాధితురాలి భర్త అర్ధరాత్రి  స్థానిక పోలీసులను సంప్రదిస్తే.. వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారని, తెల్లవారేసరికల్లా నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిందితులపై అట్రాసిటీ కేసుతోపాటు లైంగికదాడి, హత్యాయత్నం, దొంగతనం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ద్వారా బాధితులకు రూ.2 లక్షల పరిహారం అందజేశామని గుర్తు చేశారు. మహిళా, శిశు సంక్షేమం కింద మరో రూ.50 వేలు అందజేస్తున్నామన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళలపై అత్యాచారాలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందన్నారు. మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఢిల్లీలో ఉన్నా ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ బాధితులకు సాయమందించేలా ఆదేశాలిచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ దినేష్‌కుమార్, ఎస్పీ మలికాగర్గ్‌ తదితరులు పాల్గొన్నారు.
హోం మంత్రి తానేటి వనిత కారును అడ్డుకుంటున్న టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు 

హోం మంత్రి కాన్వాయ్‌పై దాడి
కాగా హోం మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌పై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఒంగోలు ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌ నుంచి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలసి బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి బయలుదేరిన మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. వనిత కారు అద్దాలను ధ్వంసం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుంటున్నా వినకుండా ప్రజాప్రతినిధులను దూషించారు. ఈ ఘటన ఒంగోలు రాంనగర్‌ ఒకటో లైను వద్ద చోటు చేసుకుంది. దీనిపై సంతనూతలపాడు నియోజకవర్గ వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ కొమ్మూరి సుధాకర్‌ మాదిగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకురాలు రావుల పద్మజ, ట్రాన్స్‌జెండర్‌ గోను దుర్గ, శేషమ్మ, రావిపాటి సీత, ఆళ్ల వెంకటరత్నం తదితరులు దాడికి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అత్యాచార ఘటనలో నిందితులకు 15 రోజులు రిమాండ్‌
కాగా అత్యాచారానికి పాల్పడిన ఇరువురు నిందితులను రేపల్లె అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్‌ విధించారని సీఐ వి.సూర్యనారాయణ తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనలో బాల నేరస్తుడిని గుంటూరు బాల నేరస్తుల న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్‌ విధించారన్నారు. 

మరిన్ని వార్తలు