‘లేబర్‌ కోడ్‌’లు రద్దు చేసేవరకు పోరాడుతాం

24 Dec, 2022 02:07 IST|Sakshi
మాట్లాడుతున్న తపస్‌సేన్‌ 

సిద్దిపేటఅర్బన్‌: కార్మికుల హక్కులను హరిస్తూ...వారికి ఉరితాళ్లుగా మారిన లేబర్‌ కోడ్‌లను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసేంతవరకు పోరాడుతూనే ఉంటామని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపస్‌సేన్‌ స్పష్టం చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభల ముగింపు సమావేశం శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేరళ కార్మిక మంత్రి శివన్‌ కుట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా తపస్‌సేన్‌ మాట్లాడుతూ..కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌ అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ సామాన్యులను, కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని పెట్టుబడిదారులకు దోచిపెడు తూ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు (సీఆర్‌) మాట్లాడుతూ...29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా వర్గీకరించి కార్మికులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చిందన్నారు. 

మళ్లీ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడుగా సీఆర్‌
సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్‌.వీరయ్య, భూపాల్, ఎస్‌.రమ, పి.జయలక్ష్మి, కె, వెంకటేశ్వర రావు, జె.మల్లికార్జున్, వీఎస్‌.రావు, వీరారెడ్డి, ఈశ్వర్‌ రావు, రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కార్యదర్శులుగా వెంకటేశ్, పద్మశ్రీ, ముత్యంరావు, చంద్రశేఖర్, మధు, మల్లేశ్, రమేశ్, శ్రీకాంత్, రమేశ్, కూరపాటి రమేశ్, గోపాల స్వామి, కోశాధికారిగా రాములు ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు