Kishan Reddy: ఆ కారణంతోనే  కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి

5 Jul, 2023 08:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఓసీ, బీసీ సామాజికవర్గాల వారీగా సమతూకం పాటిస్తూ బీజేపీ తాజా నియామకాలు జరిగాయని చెబుతు న్నారు. పార్టీలోని సీనియర్లు, కొత్తగా చేరిన నేతలు, పాతతరం నాయకులు, కార్యకర్తలు అందరినీ సమర్థవంతంగా సమన్వయం చేస్తారనే అంచనాతో పాటు, పార్టీ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన అనుభవం పరిగణనలోకి తీసుకుని కిషన్‌రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.

ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ వ్యూహాలు, కార్యాచరణను, రాజకీయాలను సమ ర్థంగా ఎదుర్కొంటారనే భావనతో పాటు వివిధ వర్గాల ప్రజల్లో పట్టును పరిగణనలోకి తీసుకుని ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించారని అంటున్నారు. మరో నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నందున రాష్ట్రపార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేసేందుకు మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం.

స్వయం కృషితో అంచెలంచెలుగా..
గంగాపురం కిషన్‌రెడ్డి.. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన నేత. బీజేపీ అగ్రనాయకత్వం మోదీ, అమిత్‌షా, నడ్డాలకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, మోదీ, అమిత్‌షాలకు సన్నిహితుడిగా పేరు గడించారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఎంపీ అయ్యారు. మోదీ కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రి పదవిని చేపట్టారు. తర్వాత కేబినెట్‌ మంత్రిగా ప్రమోషన్‌ పొంది పర్యాటక, సాంస్కృతిక శాఖ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.  

పార్టీలో స్తబ్ధత, అసంతృప్తి నేపథ్యంలో..
కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో రాష్ట్ర పార్టీలో స్తబ్ధత నెలకొంది. మరోవైపు నేతల మధ్య సమన్వయ లేమి, రాష్ట్రనాయకత్వం తీరుపై నాయకుల్లో అసంతృప్తి పెరగడం వంటివి చోటు చేసుకున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో అయోమయం, గందరగోళం నెలకొంది. దీనికి తోడు గత కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యవహారశైలిపై పలువురు అసంతృప్త నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ముఖ్యనేతలతో సమన్వయం లేకపోవడం, వారికి తగిన ప్రాధాన్యత, గుర్తింపునివ్వకపోవడం తదితర అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే కొందరు ముఖ్యనేతలు గ్రూపులు, వర్గాలను మెయింటెన్‌ చేయడం, ఎవరికి వారు ఇష్టారీతిన వ్యాఖ్యానాలు, పరస్పర విమర్శలు, ఆరోపణలకు దిగడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, జాతీయ కార్యవర్గసభ్యులు, ఇతర నాయకులతో అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్, సునీల్‌ బన్సల్, తరుణ్‌ ఛుగ్, శివప్రకాష్‌ దశల వారీగా సంప్రదింపులు జరిపారు. సమస్యలన్నీ అధిగమించేందుకు ఏమి చేయాలన్న దానిపై అభిప్రాయాలు సేకరించారు.

ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి మార్పు, ఇతర నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో బీజేపీ నాయకులు ఎవరికి వారే యమునే తీరే అన్నట్టుగా వ్యవహరించడం, సమన్వయ లేమి కారణంగా ఎన్నికల్లో తీరని నష్టం జరగడాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలో అలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కోకూడదనే భావనతో తాజా మార్పులకు నాయకత్వం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని, ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటలను నియమించవచ్చని కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారం చివరకు వాస్తవ రూపం దాల్చింది. 

తనదైన ముద్ర వేసినా...
మూడేళ్ల మూడునెలలకు పైగా రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగిన బండి సంజయ్‌ తనదైన ముద్రను బలంగానే వేశారని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. ‘రాష్ట్ర పార్టీలో ఫుల్‌జోష్‌ను నింపడంలో సఫలీకృతమయ్యారు. బీఆర్‌ఎస్‌ పాలన పై, సీఎం కేసీఆర్‌ తీరుపై, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్రేకపూరిత ప్రసంగాల ద్వారా అధికార పార్టీకి బీజేపీయే ప్రత్యా మ్నాయ చర్చ ప్రజల్లో జరిగేట్టు చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు..’ అని అంటున్నారు.

ముఖ్యనేతల్లో అసంతృప్తి
అయితే ఎప్పుడూ తానే ఫోకస్‌లో ఉండాలనే సంజయ్‌ ప్రయత్నం.. ముఖ్యనేతల్లో అసంతృప్తికి కారణమయ్యిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా సంజయ్‌పై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో పాదయాత్ర ఒక్కటే ఎందుకు మోటర్‌సైకిల్‌ యాత్రలు, జీపు యాత్రలు, ఇతరత్రా రూపాల్లో ప్రజల వద్దకు వెళ్లాలంటూ అమిత్‌షా సూచించారు. ఆ తర్వాత కూడా ఒకట్రెండు విడతల పాదయా త్రలు సాగడం, వాటిలోనూ సంజయ్‌ తీరు మారకపోవడం, ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో.. మొత్తం రాష్ట్రాన్ని పాదయాత్రల ద్వారా కవర్‌ చేయడం సాధ్యం కాదంటూ ప్రజాసంగ్రామ యాత్రకు హైకమాండ్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

మూడేళ్ల పదవీ కాలం ముగిశాక ఆయనను కొనసాగిస్తు న్నట్టు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ నాయకత్వ మార్పు జరిగేదాకా ఆయనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పార్టీ పరిస్థితి, నేతల్లో పెరుగుతున్న అసంతృప్తిని పరిగణనలోకి తీసుకుని గడువు ముగిసిన దాదాపు నాలుగు నెలలకు రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకుంది.   

మరిన్ని వార్తలు