తిరుపతి ఉప పోరు: ‘ఆ ది’శగా అరాచకాలకు కుట్ర!

20 Mar, 2021 09:13 IST

ఉప పోరులో పోటీకి తహతహ 

ద్వితీయ స్థానం కోసం పోటాపోటీ

కార్యకర్తలతో చంద్రబాబు, సోమువీర్రాజు వేర్వేరుగా భేటీ

పరువు కాపాడాలని దిశానిర్దేశం

అరాచకాలు సృష్టించి వైఎస్సార్‌సీపీపై నెట్టేయాలని ఆదేశం

పరువు కోసం టీడీపీ, బీజేపీ నేతలు పాకులాడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ద్వితీయ స్థానాన్ని అయినా దక్కించుకోవాలని ఆ రెండు పార్టీల అధినేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగానే తమ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒకరు కేంద్ర ప్రభుత్వ అండదండలతో రెచ్చిపోతే.. మరొకరు ద్వితీయ శ్రేణి నేతలను రెచ్చగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. అరాచకాలు సృష్టించి, మత విద్వేషాలకు బీజం వేయాలని నిర్ణయించారు. ఆ నెపం అధికార పార్టీపై నెట్టే కుట్రకు ప్రణాళిక రచించారు. అందుకోసమే కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.

సాక్షి, తిరుపతి: పంచాయతీ, మునిసిపల్‌ ఫలితాలతో మంచి ఊపు మీదున్న వైఎస్సార్‌సీపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు అస్త్రశ్రస్తాలను సిద్ధం చేస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్‌ ఉప పోరులో పరువైనా దక్కించుకోవాలని మల్లగుల్లాలు పడుతున్నాయి. అందులో భాగంగానే విద్వేషాలు రెచ్చగొట్టాలని నిశ్చయించాయి. కమలనాథులు ఒకడుగు ముందుకేసి పూర్తి బాధ్యతలను మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి అప్పగించారు.  

బుజ్జగించి..మద్దతు ఎంచి! 
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలవ్వక ముందు నుంచే టీడీపీ అభ్యర్థిని పనబాకలక్ష్మి ముఖం చాటేశారు. కొంత కాలంగా ఆమె ఆ పార్టీ కార్యక్రమాల్లో అంటీఅంటనట్టుగానే వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దూతలను పంపి ఆమె ను బలవంతంగా ఒప్పించినట్టు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అందులో భాగంగానే గురువారం నిర్వహించిన సమావేశానికి ఆమె అతికష్టం మీద హాజరయ్యారు. సమావేశంలో టీడీపీ కార్యకర్తలు నాయకత్వ లోపంపై ఫిర్యాదు చేసినా అధినేత పట్టించుకోలేదు. ‘మనకు జనసేన సపోర్ట్‌ ఉంటుంది. ఆ పార్టీ కార్యకర్తలతో మంచిగా మెలగండి’ అని టీడీపీ అధినేత తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య నాయకులకు ఫోన్లో చెప్పినట్టు సమాచారం. 

అరాచకాల బాధ్యత నీదే! 
తిరుపతి ఉప ఎన్నికల్లో కనీసం ద్వితీయ స్థానం దక్కేలా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పార్టీ శ్రేణులకు గట్టిగా చెప్పినట్లు సమాచారం. తిరుపతిలో శుక్రవారం ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగిస్తే సాయశక్తులా కృషి చేస్తానని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోమవీర్రాజును కోరినట్లు తెలిసింది. తాను చెప్పినప్పుడు కేంద్ర మంత్రులను తిరుపతిలో ప్రచారానికి పంపాలని సూచించారు. అరాచకాలు, మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేసినట్లు సమాచారం. వైఎస్సార్‌ కడప జిల్లాలో చేసిన అరాచకాలకు మించి చేయాలంటే తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆ సమయంలో కేసులు, అరెస్టులు లేకుండా చూసుకునే బాధ్యత బీజేపీ పెద్దలు చూసుకోవాలని డిమాండ్‌ చేసినట్టు తెలిసింది.
చదవండి:
నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా  
పిట్టకథలు, జోస్యం చెప్పుకోవచ్చు

మరిన్ని వార్తలు