స్వతంత్రం మాటున కుతంత్రం

21 Feb, 2021 11:05 IST|Sakshi

పంచాయతీల్లో టీడీపీ, జనసేన మిలాఖాత్‌

అమలాపురం (తూర్పుగోదావరి): జనం ముందు కత్తులు దూసుకోవడం.. తెర వెనుక పొత్తులు పెట్టుకోవడం టీడీపీ, జనసేనలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. పార్టీ అగ్రనాయకుల నుంచి సామాన్య కార్యకర్తల వరకూ ఇదే పంథా అవలంబిస్తున్నారు. అమరావతి నుంచి అల్లవరం వరకూ తెరచాటు పొత్తులకు తెర లేపుతున్నారు. మొదటి రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు భారీ విజయాలు సాధించారు. పల్లె పోరు ఫలితాల్లో అంచనాలు తలకిందులు కావడంతో కనీసం నాలుగో విడతైనా కొన్ని విజయాలు సాధించి పరువు నిలుపుకోవాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన పార్టీలు పలు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు తెర వెనుక పొత్తులు పెట్టుకుంటున్నాయి. దీనిపై ప్రజల్లో విమర్శలు రాకుండా ఆ పార్టీల మద్దతుదారులకు ‘స్వతంత్ర’ ముసుగు వేస్తున్నారు.

స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారికి మద్దతు ఇవ్వాలంటూ చెప్పుకొంటున్నారు. కోనసీమలోని మేజర్‌ పంచాయతీల్లో ఒకటైన అల్లవరం మండలం బెండమూర్లంకలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ పడుతున్న దొమ్మేటి పద్మకు జనసేన మద్దతు తెలిపింది. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అంబాజీపేట మండలం మాచవరంలో రెండు పారీ్టలూ కలసి అభ్యరి్థని నిలిపాయి. టీడీపీకి చెందిన నాగాబత్తుల సుబ్బారావు సతీమణి శాంతకుమారి పోటీ చేస్తుండగా, జనసేన బహిరంగ మద్దతు ఇస్తోంది. అభ్యర్థికి స్వతంత్ర ముసుగు వేసింది. ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికలకు సైతం తెర వెనుక పొత్తులను అప్పుడే సిద్ధం చేసుకుంటున్నాయి.

ఎంపీటీసీ ఎన్నికల్లో రెండు స్థానాలకు జనసేనకు మద్దతు ఇచ్చేలా.. సహకార సంఘ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేలా రెండు పారీ్టల్లో ఒకరిద్దరు నాయకులు కలసి ఒప్పందాలు చేసుకోవడం ఇరు పారీ్టల కార్యకర్తల్లో వ్యతిరేకతను తీసుకువస్తోంది. ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లిలో టీడీపీకి చెందిన పినిశెట్టి వెంకట రెడ్డినాయుడు పోటీ చేస్తుండగా టీడీపీ మద్దతు ఇస్తోంది. అమలాపురం మండలంలో చిందాడగరువు, జనుపల్లి, భట్నవిల్లి, గున్నేపల్లి, సాకుర్రు, ఈదరపల్లి; ఆత్రేయపురం మండలం మెర్లపాలెం, ర్యాలి గ్రామాల్లో కూడా ఈ రెండు పార్టీలూ పరస్పరం తెర వెనుక సహకరించుకుంటున్నాయి. ఐ.పోలవరంలో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావుకు జనసేన మద్దతు ఇస్తోంది. కొత్తపేట మండలం మందపల్లి, పి.గన్నవరం మండలం ఎల్‌.గన్నవరం, రాజోలు మండలం కాట్రేనిపాడు పంచాయతీల్లో రెండు పార్టీలూ కలసి ఉమ్మడి అభ్యర్థులను పోటీ పెట్టాయి.
చదవండి: ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర 
నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ

 

>
మరిన్ని వార్తలు