పైకి కత్తులు.. లోన పొత్తులు

6 Mar, 2021 06:43 IST|Sakshi

టీడీపీ నేతల దిగజారుడు రాజకీయం

ఎన్నికల బరిలో అనైతిక పొత్తులు

జనసేనతో చీకటి ఒప్పందాలు

పరస్పర సహకారంతో అడుగులు

వైఎస్సార్‌ సీపీని ఎదుర్కొనేందుకు

ఇరుపక్షాల అడ్డదారులు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో జనసేనతో అనధికారికంగా చెట్టపట్టాలేసుకున్న టీడీపీ మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం సర్దుబాటు ముసుగులో అనైతిక రాజకీయాలకు బరితెగిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి ‘స్వతంత్ర’ అనే ముసుగు తగిలించినా ప్రజల తీర్పు ముందు తలవంచక తప్పలేదు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉన్నందున తమ నాటకాలు చెల్లవని టీడీపీ కొత్త పద్ధతికి తెరతీసింది. అభ్యర్థులను నిలబెట్టలేక జనసేనతో సర్దుబాటు చేసుకుంది. చెరి సగం అంటూ వార్డుల్లో పోటీ చేస్తోంది. ఒకరికి బలమున్నచోట మరొకరు అభ్యర్థిని పెట్టకుండా పరస్పరం సహకరించుకునేలా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. క్షేత్ర స్థాయిలో ఈ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు విలువలు విడిచి బరిలో దిగుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

మచ్చుకు కొన్ని
జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన అడ్డదారులు తొక్కుతున్నాయి.
అమలాపురం మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. అతి కష్టం మీద చెరో 16 వార్డుల్లో అభ్యర్థులను పెట్టుకున్నాయి. అవీ సర్దుబాట్లతోనే. జనసేన పోటీ చేసే వార్డుల్లో టీడీపీ  పోటీ చేయకుండా నాయకులు జాగ్రత్తలు తీసుకున్నారు.  3, 4, 7, 8 వార్డుల్లో జనసేన అభ్యర్థుల విజయానికి సహకరిస్తూ టీడీపీ తన అభ్యర్థులను దింపలేదు. 5, 15, 22 వార్డుల్లో టీడీపీ కోసం జనసేన తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టకుండా పరోక్ష సహకారం అందిస్తోంది.
రామచంద్రపురం మున్సిపాలిటీలో టీడీపీకి కాస్తో కూస్తో పట్టున్నచోట జనసేన.. టీడీపీకి బలమున్న చోట జనసేన అభ్యర్థులను నిలబెట్టలేదు. ఇక్కడ 28 వార్డులకు 18 చోట్ల పోటీ జరుగుతోంది. 10 వార్డుల్లో టీడీపీ పోటీలో ఉండగా జనసేన 13 వార్డుల్లో పోటీ పడుతుంది. టీడీపీ బలంగా ఉండే కొన్ని వార్డుల్లో గతంలోనే జనసేన పోటీ నుంచి తప్పుకొంది. జనసేనకు ఒక మోస్తరు బలగమున్నచోట టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపనే లేదు. 1, 2 వార్డులు టీడీపీకి గతంలో పట్టున్నవి. ఇక్కడ జనసేన పోటీలో లేదు. ఎనిమిదో వార్డులో జనసేన పోటీలో ఉండగా టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే 21, 22 వార్డుల్లో ఈసారి జనసేన పోటీలో ఉంది. వైఎస్సార్‌ సీపీని ఎదుర్కొనాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ మౌనం దాల్చింది.
మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోనూ టీడీపీని ఓటమి భయం వెంటాడుతోంది. కనీసం డిపాజిట్‌ అయినా దక్కించుకోవాలని జనసేనతో పొత్తు పెట్టుకుంది. సామర్లకోటలో 5, 7, 11, 17, 27, 28, 30, 31 వార్డులను జనసేనకు వదిలేసింది. జనసేన పోటీ చేయకుండా వెనక్కు తగ్గిన 3, 4, 6, 8, 9, 10, 12, 13, 15, 16, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 29 వార్డుల్లో మాత్రమే టీడీపీ పోటీ చేస్తోంది.
పెద్దాపురం మున్సిపాలిటీలో 29 వార్డులుండగా టీడీపీ 27 వార్డుల్లోనే పోటీ చేస్తోంది. 10, 12 వార్డులను జనసేన అభ్యర్థులకు కేటాయించి టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది.

పంచాయతీ తీర్పుతో గుండెల్లో రైళ్లు
కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్ష టీడీపీ.. జనసేన దారుణ పరాజయాలను మూటగట్టుకున్నాయి. పరస్పరం సహకరించుకున్నా రెండంకెలను చేరుకోలేకపోయాయి. మున్సిపల్‌ ఎన్నికల్లోనైనా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు కనీస పోటీ ఇచ్చేందుకు బహిరంగ మద్దతుతో ఈ రెండు పార్టీలూ బరిలోకి దిగాయి. ఆ పార్టీల అగ్రనేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నట్లు ప్రజల ముందు నటిస్తున్నారు. బీజేపీతో తమకు ఒప్పందమని జనసేన నేతలు చెబుతున్నారు. తీరా ఎన్నికలకొచ్చేసరికి మాట మీద నిలబడలేకపోతున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ అనైతిక పొత్తులు చూసి ద్వితీయ శ్రేణి నాయకులు, సాధారణ కార్యకర్తలు పలువురు అయోమయంలో పడుతున్నారు. సీఎం వైఎస జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతునిస్తూ ఏకపక్షంగా ఇస్తున్న తీర్పులతో ఈ రెండు పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక జనసేనతో ఒప్పందానికి రావడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
చదవండి:
కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు 
చంద్రబాబుకు భారీ షాక్‌.. గో బ్యాక్‌ అంటూ నిరసన

 

మరిన్ని వార్తలు