AP Municipal Elections 2021: పరువు పొత్తులు!

8 Mar, 2021 03:21 IST|Sakshi
జనసేన అభ్యర్థి లోవరాజుకు మద్దతుగా ప్రచారం చేస్తున్న టీడీపీ నేత చింతమనేని

మున్సిపల్‌ ఎన్నికల్లో పరువు కోసం టీడీపీ అగచాట్లు

టీడీపీతో జనసేన చెట్టపట్టాల్‌

బీజేపీతో బంధం.. టీడీపీతో తెరచాటు సంబంధం

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ‘పంచాయతీ’కి మించి దారుణ ఓటమి తప్పదని పసిగట్టిన టీడీపీ కనీసం పరువైనా కాపాడుకునేందుకు జనసేన పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. స్థానికంగా అవకాశం ఉన్న ప్రతి చోటా ఆ పార్టీతో కలిసి పనిచేస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేకపోవడం, కొన్ని చోట్ల పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువవడంతో జనసేనతో అక్రమ బంధానికి టీడీపీ తెరతీసింది. పలు కార్పొరేషన్లలో టీడీపీ నేతలు బహిరంగంగానే జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. వారికి అవసరమైన ఆర్థిక ఆసరాను అందిస్తున్నారు.

పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశంతోనే జనసేన నేతలతో కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం బీజేపీతో కలసి ప్రయాణం సాగిస్తున్నట్లు ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తన భాగస్వామ్య పార్టీని వదిలేసి టీడీపీతో తెరచాటు పొత్తులకు తెర తీయడం గమనార్హం. తెరపై బీజేపీ నేతలతో కనిపిస్తూ తరచూ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపే ఆయన టీడీపీతో అనైతిక పొత్తులకు తలుపులు తెరవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  
 
బెజవాడలో బయటపడ్డ బాగోతం
విజయవాడ కార్పొరేషన్‌ 15వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి గాదిరెడ్డి ఝాన్సీలక్ష్మి కోసం టీడీపీ అభ్యర్థి బేతి లక్ష్మి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా జనసేన తూర్పు నియోజకవర్గంలోని పదికిపైగా డివిజన్లలో టీడీపీ అభ్యర్థులకు మద్దతిచ్చింది. కొన్ని డివిజన్లలో డమ్మీ అభ్యర్థులను నిలపగా కొన్నిచోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు బయటకు రాకుండా టీడీపీకి సహకరిస్తున్నారు. 15వ డివిజన్‌లో జనసేన అభ్యర్థికి ఓటేయాలని టీడీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ఆదివారం ప్రచారం చేయడం ఈ రెండు పార్టీల అపవిత్ర పొత్తును బట్టబయలు చేసింది. జనసేన కోసం 34వ డివిజన్‌లో టీడీపీ సీనియర్‌ నాయకుడు కొట్టేటి హనుమంతరావు భార్యను ఎంపీ కేశినేని నాని పోటీ నుంచి తప్పించి డమ్మీ అభ్యర్థికి బీ ఫారం ఇచ్చారు. కొట్టేటి దీనిపై కేశినేని కార్యాలయం వద్ద ధర్నాకు దిగి జనసేనకు లబ్ది చేకూర్చడానికి తనను బలి చేస్తారా? అని ఇటీవల నిలదీశారు. ఇలా విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ–జనసేన అనుబంధం కొనసాగుతోంది. 

గోదారిలో చీకటి పొత్తులు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కార్పొరేషన్‌లో నాలుగు డివిజన్లను జనసేనకు వదిలేసిన టీడీపీ మిగిలిన చోట్ల తమకు మద్దతిచ్చేలా ఆ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నేరుగా జనసేనతో చీకటి పొత్తు కుదుర్చుకున్నారు. మున్సిపాల్టీలో 27 వార్డులకు 10, 12 వార్డులను జనసేనకు కేటాయించి మిగిలిన వార్డుల్లో ఆ పార్టీ తమకు మద్దతిచ్చేలా మాట్లాడుకున్నారు. 

నామినేషన్లకు ముందే అవగాహన 
రాష్ట్రవ్యాప్తంగా అవకాశం ఉన్న ప్రతిచోటా రెండు పార్టీలు లోపాయకారీగా ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తున్నాయి. నామినేషన్లకు ముందే ఆయా నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల నేతలు ఒక అవగాహనకు వచ్చి ఏ వార్డులు, డివిజన్లలో ఎవరు పోటీ చేయాలి? ఎక్కడ ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకున్నారు. చాలా మున్సిపాల్టీల్లో జనసేనకు ఒకటి రెండు వార్డులు కేటాయించి మిగిలిన చోట్ల తమకు మద్దతిచ్చేలా, ఆ పార్టీ ఓట్లు తమకు వేయించేలా మాట్లాడుకున్నారు.

ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎక్కువ చోట్ల ఈ సూత్రం కింద రెండు పార్టీల నేతలు పనిచేస్తున్నారు. జనసేన తరఫున ఎవరూ పోటీ చేసే పరిస్థితి లేకపోయినా ఏదో ఒక వార్డు కేటాయించి అన్నీ తామే సమకూర్చి టీడీపీ నేతలు పోటీకి దించినట్లు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా మిగిలిన డివిజన్లలో ఆ పార్టీ స్థానిక నేతలను తమకు మద్దతుగా తిప్పుకుంటున్నారు. విజయవాడ లాంటి చోట్ల జనసేన అభ్యర్థులు ఎక్కువ డివిజన్లలో పోటీ చేసినా టీడీపీతో ఒప్పందం మేరకు సైలెంట్‌ అయిపోయినట్లు చెబుతున్నారు.

చదవండి: 
నరసాపురంలో బహిరంగంగానే... 

మరిన్ని వార్తలు