వలంటీర్లపై వాళ్లది విద్వేషం! ఆ ఒక్కమాటతో సీఎం జగన్‌..

16 Feb, 2024 09:41 IST|Sakshi

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి చెప్పేదేదో స్పష్టంగా చెప్పేస్తారు. తన మనసులో ఉన్నమాట దాచుకోరు. చల్లకొచ్చి ముంత దాచే వ్యవహారం ఆయనతో కాదు. వలంటీర్ల అభినందన సభలో ఆయన తన మనోగతాన్ని చాలా గట్టిగా మొహమాటం లేకుండా వెల్లడించారు. వచ్చే రెండు నెలలు  ప్రజలకు అందించవలసిన సేవలను, చెప్పవలసిన విషయాలను వలంటీర్లకు వివరించి వచ్చే ఎన్నికల యుద్దానికి సన్నద్దం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.

ఒకరకంగా ఇది ధైర్యంతో కూడిన విషయం. విపక్షాలు చేసే విమర్శలతో నిమిత్తం లేకుండా ఆయన..  పేదల తరపున పనిచేసే ప్రభుత్వానికి వలంటీర్లు వారధులుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వలంటీర్లు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు కారు. కేవలం స్వచ్చంద కార్యకర్తలు. వారు తమ అభిప్రాయాల ప్రకారం రాజకీయంగా నడుచుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్థను సృష్టించి ప్రపంచంలోనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించిన జగన్ దాని వల్ల కూడా తన ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడానికి మార్గం సుగమం అయిందని చెప్పకనే చెప్పేశారు.


సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లకు అభివందనం పేరుతో వారి సేవలను దృష్టిలో ఉంచుకుని అవార్డులను ప్రకటించారు. వచ్చే ఎన్నికలు ఎంత కీలకమైనవో ప్రజలకు తెలియచెప్పవలసిన బాద్యత వలంటీర్లపై ఉందని అన్నారు. ఈ అభినందన సభలో జగన్ మాట్లాడిన  ప్రతి మాటకు విశేష స్పందన  కనిపించింది. సీఎం., సీఎం. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. సభ జరిగిన తీరు చూస్తే వలంటీర్లు ఎంత కమిటెడ్‌గా ఉన్నది, జగన్ పట్ల ఎంత అభిమానంతో ఉంది అర్ధమవుతుంది. వారిని చూడగానే ప్రభుత్వ స్కీములు పొందిన పేదలంతా ముఖ్యమంత్రి జగన్ ను చూసినట్లు సంతోషపడుతున్నారు.

ప్రత్యేకించి వృద్దులైతే వారి సంతోషానికి అవధులు ఉండడం లేదు. గతంలో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గంటల తరబడి వేచి చూసి పెన్షన్ పొందడానికి నానా కష్టాలు పడవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు వలంటర్ ప్రతి నెల మొదటి తేదీన ఇంటికి వచ్చి మూడువేల పెన్షన్ ఇస్తుండడంతో వారికి ఎంతో గౌరవం, సంతృప్తి ఇస్తోంది. ఇదే విషయాన్ని జగన్ తన స్పీచ్ లో కూడా ప్రస్తావిస్తూ, చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీముల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని హెచ్చరించారు.  గతంలో వలంటీర్ల వ్యవస్తను ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

వలంటీర్లు అంటే మూటలు మూసే ఉద్యోగమని, ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారని టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్లను మహిళలను కిడ్నాప్ చేసే వ్యక్తులంటూ తీవ్రంగా అవమానించారు. ఎన్నికలు  దగ్గరబడుతున్న తరుణంలో వారు తమ వైఖరి మార్చుకుని వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నా, వారిలో ఈ వలంటీర్లపై పేరుకున్న విద్వేషాన్ని మాత్రం దాచుకోలేకపోతున్నారు.


ఈనాడు రామోజీరావు ఈ అల్పజీవులపై విషం చిమ్ముతూ టీడీపీ, జనసేన ఎజెండాను మోస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ వారందరిని తన సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటూ వారి సేవలను అభినందిస్తూ మాట్లాడారు. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు  గంజాయి మొక్కల వంటివైతే, వలంటీర్లుతో కూడిన ప్రస్తుత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తులసి మొక్క వంటివని  సీఎం జగన్‌ కొనియాడారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్దంలో నిరుపేదలకు వలంటీర్లకు అండగా నిలవాలని ఆయన కోరారు.

మేనిఫెస్టోల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి తాము ఎంతో కష్టపడి నవరత్నాల అమలుకు 70 వేల కోట్లు వ్యయం చేస్తున్నామని, అలాంటిది చంద్రబాబు నాయుడు ఏకంగా 1.26 లక్షల కోట్లు ఖర్చు చేస్తానని చెబుతున్నారని, అది ప్రజలను మోసం చేయడమేనని, ఈ విషయం ప్రజలకు వలంటీర్లు తెలియచెప్పాలని జగన్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును నమ్మితే ఇంతే సంగతన్నది ప్రజలకు అర్ధం కావాలని అన్నారు. తాము బటన్ నొక్కుతుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం అంతకు మించి పంచుతామని అంటున్నారని, దీనిన ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు.

మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మీ బిడ్డ పై చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు, ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా,మరో జాతీయ పార్టీ పరోక్షంగా ఏకం అవుతున్నాయని, కాని నాకు మాత్రం రెండున్నరలక్షల మంది సైన్యం ఉన్నారని జగన్ అన్నప్పుడు వలంటీర్లు అంతా హర్షద్వానాలతో హోరెత్తించారు.వలంటీర్ల సేవలకు తాను సాల్యూట్ చేస్తున్నానని అంటూ, పెత్తందార్లకు,పేదలకు మద్య జరుగుతున్న యుద్దంలో పేదలే గెలవాలని జగన్ అన్నారు. ఒకవైపు పోరాట పటిమను ప్రదర్శించడానికి వలంటీర్లలో స్పూర్తి నింపే విధంగా, మరో వైపు ప్రత్యర్ధి రాజకీయ పక్షాల డొల్లతనాన్ని ఎండగడుతూ జగన్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుందని చెప్పాలి.

రెండు నెలల్లో జరిగే యుద్దానికి అంతా సిద్దం కావాలని , సిద్దం సభ  తరహాలో ఆయన నినదించారు.తన ప్రభుత్వం ఎక్కడా అవినీతి లేకుండా రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర వివిధ స్కీముల కింద నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో వేసిందని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు టైమ్ లో అంతా అవినీతిమయంగా ఉండేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా టైమ్ చూసి దెబ్బగొట్టడం అంటే ఇదేనేమో!. వలంటీర్లపై టీడీపీ,జనసేన  తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అందుకు భిన్నంగా వలంటీర్లను గౌరవించి వారి  ఆదరణను చురగొనే యత్నం జగన్ చేశారని అనుకోవచ్చు!!.

దీనిపై రాజకీయ విమర్శలు వచ్చినా ఆయన ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారు. గతంలో జన్మభూమి కమిటీలను రాజకీయ లక్ష్యంతోనే చంద్రబాబు ఏర్పాటు చేశారు.కాకపోతే వారు పూర్తిగా అవినీతి మయం అయి టీడీపీ  ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశారు.కాని వలంటీర్లు ఎక్కడా అవినీతి లేకుండా సేవలు అందిస్తున్నారు. ఈ వ్యవస్థ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు. దాంతో విపక్షాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాయి.  

అంతేకాక.. చంద్రబాబు ఒకసారి తాను వేసిన రోడ్డు మీద నడుస్తూ వేరే వాళ్లకు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు.చివరికి తాను మంజూరు చేసిన మరుగు దొడ్డిని వాడుతూ వేరే వారికి ఓటు వేయరాదని ఆయన వాదించారు.


ఈ పరిస్థితిలో జగన్ ఎక్కడా ప్రజలను బెదించడం లేదు. తాను చేసిన సేవలను ప్రజలకుగుర్తు చేయాలని మాత్రమే కోరుతున్నారు. తద్వారా ఆయన తనవాదన రెడీ చేసుకుని వలంటీర్ల అభినందన సభలో ఇంత స్పష్టంగా వారిని ఆకట్టుకునే రీతిలో స్పీచ్ ఇచ్చారని అనుకోవచ్చు.

వచ్చే ఎన్నికలలో వలంటీర్ల ప్రభావం ప్రజలపై బాగా ఉండే అవకాశం ఉంటుందని టీడీపీ ,జనసేన భయపడుతున్నాయి. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా వారిపై కక్షపూరిత ప్రచారం చేశాయి. తద్వారా జగన్ ప్రభుత్వానికి అండగా నిలబడే విధంగా వారిని  రెచ్చగొట్టారని అనుకోవచ్చు. దాని ఫలితమే అభినందన సభలో జగన్ పట్ల వలంటీర్లు  అంత అభిమానాన్ని కనబరుచుకున్నారని భావించవచ్చు.

:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

whatsapp channel

మరిన్ని వార్తలు