‘ఈనాడు’ ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతోంది?

22 Jul, 2022 19:02 IST|Sakshi

అది 1986వ సంవత్సరం ఆగస్టు పదిహేనో తేదీ.. పైన ఎండ.. కింద వరద.. వినడానికి ఆశ్చర్యంగానే ఉండవచ్చు. కానీ అది నిజం. సడన్‌గా కాకపోయినా గోదావరికి విపరీతమైన వరద ఎగువ నుంచి వచ్చింది. అది సుమారు 36 లక్షల క్యూసెక్కులపైనే ఉంది. దాని కారణంగా గోదావరి గట్టు దెబ్బతిన్నాయి. పలు చోట్ల గండ్లు పడ్డాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో అనేక పట్టణాలు, వందలాది గ్రామాలు నీట మునిగిపోయాయి.
చదవండి: ఏపీలో వృద్ధి చాలా బాగుంది.. నీతి ఆయోగ్‌ బృందం ప్రశంసలు 

ప్రజలు అల్లల్లాడారు. కొవ్వూరు సమీపంలోని విజ్జేశ్వరం ప్లాంట్ చూస్తూ ఉండగానే మెయిన్ కెనాల్‌లో కొట్టుకుపోయింది. పలు కాల్వలు పొంగిపొర్లాయి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఎవరూ ఎన్టీఆర్‌ ప్రభుత్వం విఫలం అనో, మరొకటనో పెద్దగా  విమర్శించలేదు. సహాయ కార్యక్రమాలు ఎలా జరగాలన్నదానిపైనే అధికంగా మాట్లాడారు. ఏటి గట్లను ఎలా పటిష్టం చేయాలన్నదానిపై అదికారులు దృష్టి పెట్టారు.

అప్పట్లో ఈనాడు పత్రిక సైతం ఆయా వర్గాలకు, రంగాలకు  జరిగిన వరద నష్టం గురించి వార్తలు ఇచ్చిందే కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనికట్టుకుని వార్తలు ఇచ్చినట్లు జ్ఞాపకం లేదు. కానీ ఇప్పుడు చూడండి. ప్రస్తుతం ముప్పై లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా, ప్రభుత్వం సకాలంలో స్పందించి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కానీ, గతంలో ఏటి గట్ల ఎత్తు పెంచడం వల్ల కానీ గోదావరికి గండి పడలేదు. కాకపోతే నది కట్టదాటి నీరు రావడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. ముఖ్యంగా నది మధ్యలో ఉండే లంకల్లోని ప్రజలు అవస్థలు పడ్డారు. ప్రతి వరద సమయంలోనే ఈ లంకల ప్రజలకు ఇది అనుభవమే. వెంటనే ప్రభుత్వాలు నిర్దిష్ట నిబంధనల ప్రకారం వారికి సహాయ కార్యక్రమాలు చేపడతాయి.

ఈ సారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా భోజనం, నీరు సరఫరా, తాత్కాలిక శిబిరాల ఏర్పాటు మొదలైన చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించి, ఆయా జిల్లాలకు అవసరమైన నిధులు విడుదల చేశారు. ఆహారం విషయంలో ఎక్కడా రాజీపడవద్దని ఆదేశించారు. ప్రభుత్వం అంటే వెయ్యి కాళ్ల అమీబా వంటిది. అది ఎటు నుంచి ఎటు వెళుతుంటుందో, ఎక్కడ ఎవరు ఏమి చేస్తుంటారో చెప్పలేం. ఇదేదో ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అని కాదు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమస్య తప్పదు. కానీ తెలుగుదేశం పార్టీకి కంకణం కట్టుకుని సేవ చేస్తున్న ఈనాడు దినపత్రిక మాత్రం అసలు సహాయ కార్యక్రమాలే జరగడం లేదన్నట్లుగా ప్రచారం ఆరంభించింది.

అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎంతో జాగ్రత్తగా, ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకంగా వార్తలు రాయకుండా జాగ్రత్త పడుతోంది. దీనిని ప్రజలు గమనించలేదని వారి భావన కావచ్చు. దానినే పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకుంటుందంటారు. అలాగే ఈనాడు కూడా వ్యవహరిస్తోంది. మరో ఉదాహరణ కూడా చెప్పాలి. హైదరాబాద్‌లో అధ్వాన్నంగా ఉన్న ఒక రోడ్డు ఫోటోను ఈనాడు జిల్లా ఎడిషన్‌లో వేశారు. అదే ఏపీలో అయితే  జనరల్ ఎడిషన్ మొదటి పేజీలో ప్రచురించి అక్కడ అసలు రోడ్లే లేవన్నట్లు స్టోరీలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయాలని అనడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక రకంగాను, తెలంగాణలోను మరో రకంగాను వ్యవహరిస్తూ ఈనాడు పత్రిక , ఈనాడు టివీ చానల్ కానీ, టీడీపీకి నిస్సిగ్గుగా సపోర్టు చేస్తూ బట్టలు ఊడదీసుకుని తిరుగుతున్న మరికొన్ని ఇతర మీడియా సంస్థలు కాని ఎలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయో చెప్పడానికి ఈ విషయం ఉదహరించవలసి  వస్తున్నది.

ఒక పక్క వరద బాధితులను ఆదుకునే చర్యలలో ప్రభుత్వ అధికారులు బిజీగా ఉంటే, ఈ మీడియా మాత్రం ప్రభుత్వంపై విషం కక్కే పనిలో ఆత్రంగా కనిపించింది. ఈనాడులో ఒక రోజు పెట్టిన హెడింగ్ ఏమిటంటే వరద బాధితులను గాలికి వదలివేశారు అని. అది నిజమా? అన్నది ఆలోచిస్తే ఎక్కడైనా ఏదైనా గ్రామంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కొందరికి సాయం అంది ఉండకపోవచ్చు. కాని దానిని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్‌లో ప్రొజెక్టు చేయడం ద్వారా ఈనాడు తన కుళ్లు బుద్ది ప్రదర్శించిందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

ముందుగా ప్రభుత్వం మంత్రులను, సీనియర్ అధికారులను పంపించి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న వైనాన్ని, పలు చోట్ల గ్రామాలలో సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సదుపాయాలు కల్పిస్తున్న తీరు గురించి కాని, వారికి భోజనాది సదుపాయాలు సమకూర్చుతున్న వైనం గురించి, ప్రభుత్వ సిబ్బంది పడుతున్న కష్టం గురించి కాని వాస్తవిక సమాచారం ఇచ్చి, ఎక్కడైనా లోటుపాట్లు రాస్తే అది జర్నలిజం అవుతుంది. నిజంగానే ప్రభుత్వం వైపు నుంచి అసలు స్పందన లేకపోతే వార్తలు రాయవచ్చు. అలా కాకుండా ఒక పక్కన వేగంగా ప్రభుత్వం స్పందిస్తుంటే, మరో పక్క ఈనాడు వంటి మీడియా అబద్దాలనాడుగా మారి ప్రజలపై ద్వేషపూరిత కథనాలను కక్కడం దారుణంగా ఉంది.

నిజంగానే ఈనాడులో వస్తున్నంత దారుణంగా పరిస్థితి ఉందా అని విచారిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఈ మీడియా తీరుపై కూడా ఆందోళన చెందుతున్నారట. ప్రభుత్వపక్షాన ప్రజలకు సాయం అందుతున్నప్పుడు ఇలా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే, జనంలో విశ్వసనీయతను కోల్పోవడం జరుగుతుందని, ఆ తర్వాత ఏదైనా నిజం రాస్తే కూడా జనం నమ్మరని, ఈనాడు ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతోందని అంటున్నారట. మరో సంగతి ఏమిటంటే తెలుగుదేశం ఆఫీస్ నుంచి పార్టీ వారికి కొన్ని ఆదేశాలు వెళ్లాయట. వరద నీటిలో దిగి ఫోటోలు, వీడియోలు దిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ అధికారులు ఎవరూ రాలేదని చెప్పించాలని చెప్పారట. దానికి తగినట్లుగానే కొంతమంది చేస్తున్నారు. అది వేరే సంగతి. అయితే వాస్తవం ఏమిటంటే గ్రామాలలో  ఉన్న వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, మండల సిబ్బంది తదితరులు ప్రజలకు సేవలందించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం వల్ల పెద్దగా ఇబ్బందులు రావడం లేదు.

అలాగనీ ప్రజలందరికి తమ సొంత ఇళ్లలో ఉన్న మాదిరి సౌకర్యాలు సమకూర్చడం ఎవరివల్లాకాదు. మన ఇంటికి పది మంది వస్తేనే ఏమి చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడతాం. సరిపడినన్ని మంచాలు లేక కొందరు కింద కూడా పడుకుంటారు. ఇది సహజం. అలాంటిది ఇంత పెద్ద కలామిటీ సంభవించినప్పుడు ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వాలు స్థూలంగా వారికి కనీస అవసరాలు తీర్చుతున్నారా? లేదా అన్నది గమనించాలి. ప్రభుత్వ సిబ్బంది పడవలలో వరదలో ప్రయాణం చేసి ప్రజలను కలుసుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలలో వారికి ఆశ్రయం కల్పించడం వంటివి జరుగుతున్నాయి.

భోజనాలు కూడా సకాలంలో అందుతున్నాయి. వీటిని కొన్ని మీడియాలు కవర్ చేస్తున్నాయి. కానీ ఈనాడు, ఇతర టీడీపీ మీడియాకు మాత్రం ఇవేవి కనిపించకపోతే మానే. అచ్చంగా ప్రజలను ఎవరూ పట్టించుకునే వారే లేకుండా పోయారని, వారిని భయపెట్టే విధంగా వార్తలు ఇస్తుండడం శోచనీయం, పిల్లలకు పాలు లేవు, పెద్దలకు తిండి లేదు అంటూ పచ్చి పాపంగా ఈనాడు కథనాలను దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. ఇదంతా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడిస్తారా అన్న పగ, జగన్ ప్రభుత్వంపై ఉన్న కక్షతో ఇలా చేస్తున్నారు.

ఈనాడులో ఈ వార్తలు వచ్చిన రోజుల్లోనే హిందూ ఆంగ్ల దినపత్రిక డెబ్బై ఐదు వేల మందిని సహాయ శిబిరాలకు తరలించారని వారికి సహాయం అందుతోందని వార్తలు రాసింది. మరి ఎవరిని నమ్మాలి? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను రాస్తూ, వారికి శాశ్వత సదుపాయం కల్పించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని రాశారు. తప్పు లేదు. కానీ దానికి కారణం కేంద్ర ప్రభుత్వమా? గత ప్రభుత్వమా? నిధులు ఎవరు ఇవ్వాలి మొదలైన అంశాలు టచ్ చేయకుండా అదేదో ప్రస్తుత ప్రభుత్వం విఫలం అయిందని ప్రజలు అనుకోవాలన్నట్లుగా కథనాలు ఇస్తున్నారు. వీళ్ల వైఖరి చూస్తే ఏటి గట్లకు ఎక్కడా గండ్లు పడలేదేమిటి? అన్న బాధ వీరికి ఉందా అన్న అనుమానం వస్తుంది.
చదవండి: ఇవేం రాతలు, ఇవేం కూతలు?

పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా  నీటిని కిందకు విడుదల చేయడానికి గేట్లను సమర్థంగా ఓపెన్ చేయగలిగారు. ఇందులో ఏదైనా చిన్న తేడా వచ్చినా టీడీపీ మీడియా రచ్చ, రచ్చ చేసి ఉండేది. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన సహజ శైలిలో పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ హెలికాఫ్టర్‌లో సర్వే చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా గతంలో తుపానులు, వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు సీఎం హోదాలో హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తూ టీ కూడా సేవిస్తూ సర్వే చేస్తున్న వీడియో ఫోటోలను సోషల్ మీడియాలో కొంతమంది పోస్టు చేశారు. గతంలో హుద్ హుద్ తుపాను సమయంలో విశాఖలో అన్ని సదుపాయాలు ఉన్నా, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఖరీదైన బస్‌లో బస చేసి చాలా కష్టపడ్డానని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు జగన్ ప్రచార ఆర్భాటాలు చేయడం లేదు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎలా తయారైందంటే ప్రతిపక్షం అంటే అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేయడమే అన్నట్లుగా ఉంది.

చివరికి ఏ దశకు వెళ్లారంటే తామే సమస్యను సృష్టించడం, తర్వాత వారే ప్రచారం చేయడం. జనసేన కూడా ఈ విషయంలో టీడీపీని దాటి పోవాలని చూస్తోంది. అందుకే రోడ్లు బాగోలేదంటూ చేస్తున్న ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో ఒక చోట జనసేన కార్యకర్తలే చక్కగా ఉన్న రోడ్డును తవ్వుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని బట్టి ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏ స్థాయిలో టీడీపీ, జనసేన, వారికి మద్దతు ఇచ్చే ఈనాడు తదితర మీడియాలు ఎంత అధమ స్థాయిలో వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు   

>
మరిన్ని వార్తలు