బూతుల మోతాదు పెంచిన చంద్రబాబు.. పీక్స్‌లో ఫ్రస్టేషన్‌!

20 Nov, 2022 21:05 IST|Sakshi

బహుశా ఏపీలో మాత్రమే ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం, ఇలాంటి అధ్వాన్నపు మీడియా ఉంటుందేమో! అధికారపక్షంపై ఎవరైనా దాడి చేస్తే అది నిరసన, ప్రజాస్వామ్యం. ప్రతిపక్షానికి నిరసన తెలిపితే మాత్రం దాడి.. ప్రతిపక్ష నేతతో సహా టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే అది వేద పారాయణం. అధికారపక్షం వారు ఘాటుగా సమాధానం ఇస్తే బూతులు మాట్లాడినట్లు.. ఈ రకంగా అటు ప్రతిపక్ష రాజకీయం, దానికి మద్దతు ఇచ్చే తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేయాలని విశ్వయత్నం చేస్తోంది.
చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం?

ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడినా అంగీకరించకూడదు. కాని నలభై ఏళ్ల సీనియర్ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందరికి ఆదర్శంగా ఉండవలసింది పోయితానే బూతుల మోతాదు పెంచేశారు. ఏపీలో అధికారంలోకి రావాలన్న తహతహతో ఇలా ప్రవర్తిస్తున్నారు. చివరికి ఆయన నా కొడుకులు.. ఆంబోతులు.. రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని.. రా.. నేనేంటో చూపిస్తా... ఇలా రకరకాల బూతులతో కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన ప్రసంగాలు అందరిని విస్తుపరచాయి. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కావాలన్నది అక్కడి ప్రజల డిమాండ్. దానికి రాయలసీమ అంతటా మద్దతు ఉంది.

రాయలసీమ పట్టణాలు, గ్రామాలు అన్నిటా వికేంద్రీకరణ ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. అయినా దానిని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కర్నూలులో మాట్లాడే సాహసం చేశారు. ఆయనకు అమరావతే సర్వస్వంగా ఉంది. మొత్తం రాష్ట్ర ప్రజల సంపద అంతా అక్కడే తన పార్టీ వారికి తన వర్గం వారికి దక్కించడం కోసం నానా తంటాలు పడుతున్నారు. అమరావతి నినాదం గత ఎన్నికలలో ముంచినా ఆయనలో మార్పు రాలేదు.

దానికి కారణం అక్కడ ఉన్న వెస్టెడ్ ఇంటరెస్టు అనండి.. రియల్ ఎస్టేట్ ఇంటరెస్టు అనండి.. ఇలాంటివేవో ఆయనకు బలంగా ఉన్నాయని అంటారు. చంద్రబాబు వైఖరిపై వివిధ జిల్లాలలో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మరింత తీవ్రమైన ప్రతికూలత ఉండడంతో, దానిని తగ్గించుకోవడం కోసం చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాకు వెళ్లారు. అక్కడ ఏదో రకంగా జనసమీకరణ చేసి ప్రసంగాలు చేశారు. కర్నూలులో  హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తాను భావించానని ఆయన చెబుతున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి విభజిత ఏపీలో కర్నూలులో హైకోర్టు పెట్టాలని రాయలసీమ న్యాయవాదులు ధర్నాలు చేశారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. అసలు ఆ మాటే ఎత్తవద్దన్నట్లుగా వ్యవహరించారు. శ్రీ బాగ్ ఒడంబడిక అన్నది ఆంధ్ర, రాయలసీమ నేతల మధ్య జరిగిన ఒక అవగాహన. దానిని గౌరవించడం పాలకుల విధి. కాని చంద్రబాబు రాయలసీమ వారే అయినా, ఆయన అక్కడివారి ఆకాంక్ష తీర్చడానికి సిద్దపడలేదు. నిజంగానే ఒకవేళ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే అదోరకంగా ఉండేది. కాని అలా చేయకపోగా, ఇప్పుడు అసత్యాలు చెబుతున్నారు.

పైగా తన ర్యాలీ వద్దకో, పార్టీ ఆఫీస్ వద్దకో వచ్చి హైకోర్టు ఏర్పాటును డిమాండ్‌ను వ్యక్తం చేసిన న్యాయవాదులను, విద్యార్థులను రౌడీలని, గూండాలని సంభోదిస్తున్నారు. వాళ్ల సంగతి చూస్తానంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి సభలనైనా, ర్యాలీనైనా అడ్డుకోరాదు. కాని అదే సమయంలో తమ కోర్కెల సాధనకోసం ప్రశాంతంగా నిరసన చెప్పుకునే హక్కు ఉంటుంది. కర్నూలులో న్యాయ వాదుల ప్రతినిధులను పిలిపించుకుని వారి వాదన ఏమిటో విని ఉండవచ్చు. అలా కాకుండా  తన పార్టీ ఆఫీస్ వద్దకు వస్తారా అంటూ హుంకరించారు.

ఇదంతా రాజకీయంగా ఆయనకు నష్టమే తప్ప లాభం ఉండదు. ఆ సంగతి తెలిసినా, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ట్రాప్‌లో పడి నోటికి వచ్చినట్లు నిరసనకారులను దూషించారు. దీనిపై కవరింగ్ ఇవ్వడానికి తెలుగుదేశం వీర మద్దతుదారుగా ఉన్న ఈనాడు పత్రిక చాలా కష్టపడింది. చంద్రబాబు మాట్లాడిన బూతులను యథాతధంగా ఇవ్వలేదు. అదే సమయంలో  నిరసనకారులకు చంద్రబాబు గట్టి జవాబు ఇచ్చారని రాసింది. అదేమిటంటే బూతులు తిట్టడం అన్నమాట. ఒకే.. ముఖ్యమంత్రిని, వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పద్దతిగా  విమర్శించవచ్చు. కాని వారితో పాటు ప్రజలను దూషించడం ఏమిటో అర్థం కాదు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, మంత్రులు బదులు చెబితే వారంతా దాడి చేస్తామంటున్నారని ఈ పత్రిక హెడ్డింగ్‌లు పెడుతోంది. నిజంగానే ఇలాంటి నిరసనలు మంచిది కాదని చంద్రబాబు కాని, ఈనాడు వంటి పత్రికలు కాని భావిస్తే వారు ఆ విషయం చెప్పవచ్చు కాని, దూషణలకు లంఖించుకుంటారా? మరి అదే టీడీపీ వారు ఎక్కడైనా దాడులు చేస్తే మాత్రం వాటిని నిరసనలుగా చూపించే యత్నం చేస్తున్నారు. కొందరు చోటామోట నేతలు బూతులు తిట్టినా, వారి జోలికి రాకూడదని, పోలీసులు చర్యలు తీసుకోరాదని, ఒకవేళ అలా తీసుకుంటే ప్రజాస్వామ్యం నాశనం అవుతోందంటూ  గగ్గోలు పెడుతున్నారు.

విశాఖపట్నం విమానాశ్రయంలో జనసేన కార్యకర్తలు.. కొందరు వైసీపీ నేతలు, మంత్రులపై దాడులకు తెగబడితే అది అసలు జరగనట్లు, పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నట్లు టీడీపీ మీడియా ప్రచారం చేసింది. పైగా పవన్‌కు సంఘీభావం అని, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని చంద్రబాబు కొత్త డ్రామాకు తెరదీశారు. కాని అంతలో ప్రధాని మోదీతో భేటీ తర్వాత పవన్ టీడీపీ గురించి ప్రస్తావించడం తగ్గించడంతో ఆ డ్రామాకు బ్రేక్ పడింది. టీడీపీ మీడియా కూడా పవన్‌కు కవరేజీ తగ్గించేసిందట.  ఇది వేరే సంగతి.

వైసీపీ ప్రభుత్వం గడప, గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో పాల్గొనే ఎమ్మెల్యేలకు ప్రజలు ఎవరైనా తమ సమస్యలు విన్నవిస్తే, గడపగడపలో నిరసన అని, నిలదీశారు అని ఇదే ఈనాడు, తదితర టీడీపీ మీడియా పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చింది. కర్నూలులో హైకోర్టు కోసం న్యాయవాదులు చంద్రబాబును ప్రశ్నిస్తే అది మాత్రం దాడి అని వక్రీకరిస్తున్నారు. నిజంగా దాడి అయితే ఎంత గొడవ జరగాలి. అలాంటిదేమీ కనిపించలేదు. చాలా వరకు శాంతియుతంగానే నిరసన చెప్పారు.

చంద్రబాబు తన ప్రసంగాలలో రెచ్చగొట్టేలా మాట్లాడారు. అక్కడి ప్రజల మనోభావాలు గాయపడేలా ప్రసంగించారు. ఆయనకు ఇది అలవాటే. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కొన్నిసార్లు ఇలాగే చేశారు. ఉమ్మడి ఏపీలో  పాదయాత్ర చేసినప్పుడు పలుమార్లు ఘర్షణ వాతావరణం సృష్టించేవారు. చివరికి  తన రాజకీయ అవసరాల కోసం తానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జై కొట్టారు. దానిపై లగడపాటి రాజగోపాల్ వంటివారు చంద్రబాబుకు  ఏపీలో నిరసన చెప్పబోగా వారిని గృహ నిర్భంధం చేయాల్సి వచ్చింది.

చిత్రమేమిటంటే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పర్యటిస్తే  తనవల్లే రాష్ట్రం వచ్చిందని, ఏపీలో పర్యటిస్తే, రాష్ట్రాన్ని విడదీసి సోనియా గాంధీ ఆంధ్రుల పొట్టకొట్టిందని రెండు మాటలూ తానే  చెప్పేవారు. ఇప్పుడు కూడా రాజకీయంగా తను బాగా నష్టపోతానని అనుకుంటే చంద్రబాబే కర్నూలు హైకోర్టుకు జై కొట్టినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో ఏదో రకంగా శాంతి భద్రతలను చెడగొట్టడానికే చంద్రబాబు కాని, ఆయన పార్టీ నేతలు కాని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. తమ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎవరైనా నిరసనకారులు ఆవేశపడితే, అప్పుడు ఏదైనా జరిగితే దానిని వైసీపీపై నెట్టవచ్చన్నది వారి వ్యూహం కావచ్చు.

అంతేకాదు. తాము నోటికి వచ్చినట్లు దూషించినప్పుడు పోలీసులు కేసులు పెడితే ఎలా అబద్దాలతో ఎదుర్కోవాలో టీడీపీ నేతలు ట్రైనింగ్ ఇస్తున్న సన్నివేశం వీడియో గమనిస్తే వారికి న్యాయ వ్యవస్థను మోసం చేయడంలో ఎంతటి అనుభవం ఉన్నది అర్థం చేసుకోవచ్చు. వీలైతే వ్యవస్థలను మేనేజ్ చేయి.. లేదంటే అబద్దాలతో న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించు.. అని బాహాటంగానే చెప్పుకునే పరిస్థితి టీడీపీలో వచ్చిందంటే ఆ పార్టీ ఎంత దయనీయ స్థితిలో ఉందో ఊహించుకోవచ్చు. అధికారం కోసం ఎంతకైనా దిగజారడానికి తెలుగుదేశం అధినేతతో సహా ఆ పార్టీ నేతలంతా సిద్ధం అవుతున్నారన్నమాట. కనుక వారిపట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు