టీడీపీ బహిష్కరణ ఓ నాటకం

19 May, 2021 05:00 IST|Sakshi

రఘురామ ఓ బ్రోకర్‌.. బాబు తొత్తు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ 

సాక్షి, అమరావతి: టీడీపీ శాసనసభ సమావేశాల బహిష్కరణ ఓ నాటకమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ విమర్శించారు. కరోనా ఉందని భయపడి పక్క రాష్ట్రానికి చంద్రబాబు, లోకేశ్‌ పారిపోయారని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలు ఒక రోజా, రెండు రోజులా అనేది ముఖ్యం కాదని చెప్పారు. సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి, ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం ఎప్పుడు వస్తుంది.. అని సహజంగా ప్రతిపక్షం ఎదురు చూడాలన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి.. ప్రతి ఇంటికి పెద్ద కొడుకై సీఎం జగన్‌ అన్ని సమస్యలను తీరుస్తున్నారని తెలిపారు.

చంద్రబాబుకు ప్రస్తావించేందుకు సమస్యలేమీలేవని, అందుకే శాసనసభ సమావేశాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును అడ్డుపెట్టుకుని రాజద్రోహనికి పాల్పడుతున్నారన్నారు. రఘురామ ఓ బ్రోకర్‌ అని మండిపడ్డారు. ఏడాదిగా ఆయన చేసే విమర్శలు, చేష్టలు, తీరు చూసి ప్రజలు విసిగిపోయి ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. కరోనా వ్యాక్సిన్, ఇతర మందులు, ఇతర సహాయం కావాలని కేంద్రానికి లేఖరాయని చంద్రబాబు.. రఘురామ గురించి కేంద్రంలోని ముఖ్యులందరికి లేఖలు రాశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఆయనపై ఉన్నంత ప్రేమ ప్రజలపై లేదన్నారు. చంద్రబాబు తాబేదారు, తొత్తుగా ఉన్న రఘురామకృష్ణరాజుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 

మరిన్ని వార్తలు