కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు.. టీడీపీ ఓవరాక్షన్‌

16 Nov, 2021 08:00 IST|Sakshi

చంద్రబాబును వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారంటూ దుష్ప్రచారం

తాడేపల్లి రూరల్‌ : కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు పురస్కరించుకుని టీడీపీ నాయకులు సోమవారం ఎక్కడాలేని అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అధినేతను ఇంట్లో నుంచి బయటకు రానీయడంలేదని నానా యాగీ చేశారు. కానీ, చివరికి చంద్రబాబే తన కుప్పం పర్యటనను రద్దుచేసుకుంటే పార్టీ శ్రేణులు ఓవరాక్షన్‌ చేసి హంగామా సృష్టించారు. అసలేమైందంటే.. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుండగా అక్కడకు వస్తానని స్థానిక నాయకులకు సమాచారమిచ్చారు.

ఆయన సోమవారం అక్కడకు వెళ్లాల్సి ఉండగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం చూపిస్తూ ప్రభుత్వం తమ అధినేతను ఇంట్లో నుంచి కదలనీయకుండా అడ్డుకుంటోందని టీవీల్లో, సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. కానీ, వాస్తవానికి చంద్రబాబు తనే కుప్పం పర్యటనను రద్దుచేసుకుని అక్కడి నాయకులతో టెలి కాన్ఫరెన్స్‌లో పరిస్థితులను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు.

ఉ.11గంటల అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి ముఖ్య నాయకులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకున్నారు. కానీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అరాచకం చేస్తోందని, చంద్రబాబును కుప్పం వెళ్లకుండా అడ్డుకుంటోందని హోరెత్తించారు.   

మరిన్ని వార్తలు