తప్పు చేశా.. అందుకు తలవంచుకుంటున్నా!

13 May, 2022 08:48 IST|Sakshi
కుప్పం నియోజకవర్గం దాసిమానుపల్లిలో ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు 

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా నేను ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు

మరో స్వాతంత్య్రోద్యమానికి యువత నడుం బిగించాలి

‘కుప్పం’ పర్యటనలో చంద్రబాబు

‘బాదుడే బాదుడు’ సభలకు జనం దూరం

సాక్షి, పలమనేరు/గుడుపల్లె (చిత్తూరు) : ‘ఏడుసార్లు కుప్పం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఆదరించారు. కుప్పం ముద్దుబిడ్డగా చూసుకున్నారు. కానీ, నేను చాలా తప్పుచేశా. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి నాదే బాధ్యత. తప్పు నా వైపు ఉంది. అందుకే తలదించుకుంటున్నా. తప్పు సరిదిద్దుకుంటా.. ఇక్కడే ఇల్లు కట్టుకుని మీ సేవలో తరిస్తా..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు  అన్నారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు గురువారం కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పొగురుపల్లి, చింతరపాళ్యం, దాసిమానుపల్లి, కుప్పిగానిపల్లి, యామగానిపల్లి, అగరం క్రాస్, కనమనపల్లి, గుండ్లసాగరం తదితర గ్రామాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జాబ్‌ క్యాలెండర్ల పేరిట ఉద్యోగాలిస్తామంటూ ఈ మూడేళ్లలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.

ఆస్పత్రుల్లో మందుల్లేక సమయానికి అంబులెన్సులు రాక జనం పడుతున్న ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి కనబడవా అని.. సీఎం సొంత జిల్లాలో ఓ ఎస్సీ బాలికను అత్యాచారం చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెలుగుతోందన్నారు. హంద్రీ–నీవా పనులు టీడీపీ 88శాతం పూర్తిచేస్తే మిగిలిన పనులను ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్నారు. రూ.2 లక్షల కోట్ల ప్రజా సంపదను అమరావతిలో నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

తనవల్ల లక్షలు సంపాదిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు టీడీపీ కోసం ఎంతోకొంత విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతుల మెడకు ఉరితాడు వేయాలన్న లక్ష్యంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని ఉవ్విళ్లూరుతోందని చంద్రబాబు విమర్శించారు. గతంలో దేశ స్వాతంత్య్రం కోసం ప్రజలు ఎలా పోరాటాలు సాగించారో అదే విధంగా నేడు టీడీపీ అధికారం కోసం యువత నడుం బిగించాలన్నారు. 

నా పేరు చెప్పుకొని ‘తమ్ముళ్ల’ అక్రమాలు
నా పేరు చెప్పుకుని అక్రమాలు చేసే తమ్ముళ్లకు చెక్‌ పెడతామని, వారు నాయకుల్లా కాక వినాయకుల్లా మారారని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలోని పార్టీ నేతలు సక్రమంగా ఉంటే గత స్థానిక ఎన్నికల్లో మనం చిత్తుగా ఓడేవారమా అని ప్రశ్నించారు. మరోవైపు.. రెండ్రోజులుగా జరుగుతున్న బాబు సభలకు జనం ముఖం చాటేశారు. సభలకు పలుచోట్ల కనీసం పదుల సంఖ్యలో కూడా రాకపోవడంతో బాబు అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు