హతవిధీ! ఇక్కడే ఇలా ఉంటే.. ఇతర జిల్లాల్లో మన పరిస్థితి ఏంటి?

25 Feb, 2023 09:04 IST|Sakshi

గన్నవరం పరిణామాలపై చంద్రబాబు ఆవేదన 

ముఖ్యనేతలపై ఆగ్రహావేశాలు భయంతోనే ఎవరూ రావడం 

లేదన్న కొనకళ్ల కేశినేని వల్లే ఈ దుస్థితని వల్లెవేసిన బుద్దా 

బాబు వెన్నంటి గన్నవరానికి నేతలు  

సాక్షి, కృష్ణా: ‘జిల్లాలో పార్టీ పరిస్థితి ఇంతలా దిగజారిపోతుందని నేనస్సలు ఊహించనేలేదు. ఇక్కడ పార్టీ పరిస్థితి అయిపోయిందేమో అనిపిస్తోంది. ఇక్కడే ఇలా ఉంటే ఇక ఇతర జిల్లాల్లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ ముఖ్య నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆవేదన, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ నాపై దాడి జరిగినా ఇంతేగా’ అంటూ వాపోయారనేది పార్టీ వర్గాల ద్వారా అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం.

గన్నవరంలో కె.పట్టాభిరాం హల్‌చల్, పోలీసులపై దాడి తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగిందని, తక్షణం గన్నవరానికి శ్రేణులను పెద్దఎత్తున తీసుకెళ్లండని ఆదేశించారు. ఎవరూ అంతగా స్పందించలేదని తెలుసుకున్న చంద్రబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పలు సూచనలు చేసి ఆయనతోనూ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహింపజేశారు. అయినా ముఖ్యులు ముఖం చాటేయడంతో అధినేత ఆగ్రహం కట్టలు తెంచుకుందని సీనియర్‌ నేత ఒకరు వివరించారు.

కృష్ణాలోనే పార్టీ పరిస్థితి ఇలా తయారవుతుందని తాను ఊహించలేదని, ఇక్కడే ఇలా ఉంటే ఇతర జిల్లాల్లో ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించాలంటూనే.. ఇక్కడంతా అయిపోయిందని ఆవేదన వ్యక్తంచేయడంతో తామంతా మౌనం వహించిక తప్పలేదన్నారు. ఒకానొక దశలో మీరెందుకూ పనికిరారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. జిల్లా నాయకులకు కొంతకాలం పాటు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వొద్దని సంబంధితులను ఆదేశించారని సమాచారం. ఇంతలా మీరెందుకు ఉన్నారని ప్రశ్నించడంతో సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తొలుత స్పందిస్తూ ప్రభుత్వ చర్యల వల్ల, పోలీసుల తీరుతో నాయకులు ఎవరూ బయటకు రావడంలేదని, కేసులకు భయపడుతున్నారని చెప్పుకొచ్చినట్లు తెలిసింది.

గన్నవరంలో ముఖ్య నాయకులు అందుబాటులో లేకపోవడం, పార్టీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినమాట వాస్తవమేనని వివరించడంతో చంద్రబాబు కాస్త చల్లబడినట్లు మరో నాయకుడు అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) కారణంగానే ఎన్టీఆర్‌ జిల్లాలో పార్టీ బాగా డిస్టర్బ్‌ అయ్యిందని బుద్దా వెంకన్న తనదైన శైలిలో వల్లెవేశారనేది సమాచారం.  

ఏది ఏమైనా గన్నవరం వెళ్లాలి కదా... 
గన్నవరంలో వరుస సంఘటనల తర్వాత మీరంతా వెళ్లండని చెప్పినా స్పందించకపోవడం తప్పేనని, నాయకులే ఉదాశీన వైఖరితో ఉంటే పార్టీ క్యాడర్, ప్రజలకు ఏం సందేశం వెళుతుందని చంద్రబాబు అనడంతో ఇకపై జాగ్రత్తగా ఉంటామని ముఖ్యులు చెప్పుకొచ్చారని తెలిసింది. పట్టాభి తప్పుడు వ్యవహారశైలి ఎవరికీ నచ్చకపోవడమే అసలు కారణమని ఆ తరువాత అంతర్గత చర్చల్లో వివరించారనేది సమాచారం.

అయినా బోడె ప్రసాద్, రావి వెంకటేశ్వరరావు, మాగంటి బాబు, కేశినేని శివనాథ్‌ (చిన్ని), వెనిగండ్ల రాము తదితరులు వెళ్లారని కొనకళ్ల చెప్పుకొచ్చారు. కొల్లు రవీంద్ర, కేశినేని నాని, దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, బొండా ఉమాతో పాటు ఇతర నియోజకవర్గాల నాయకులూ ముఖం చాటేశారు. ఎనీ్టఆర్‌ జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చి హౌస్‌ అరెస్టు చేయాలని కోరినట్లు అధినేత దృష్టికి వెళ్లింది. ఆరోగ్యం బాగోలేదని పలువురు,  జిల్లాలో లేమని మరికొందరు సాకులు వెతుకున్నారని చంద్రబాబుకు తెలిసింది.  

చివరకు గన్నవరం నేతలూ..
చివరకు గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్‌         మండల పార్టీ నాయకులు, ఇతర సీనియర్లు కూడా అటువైపు రాకపోవడంతో చంద్రబాబుకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ వాస్తవ పరిస్థితిపై మరింత అవగాహన వచ్చిందని సీనియర్‌ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.  

ఎట్టకేలకు బాబు వెన్నంటి.. 
టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యులకు తలంటడంతో ఎట్టకేలకు శుక్రవారం చంద్రబాబుతో పాటు గన్నవరం పర్యటనలో కృష్ణా, ఎనీ్టఆర్‌ జిల్లాల పార్టీ అధ్యక్షులు కొనకళ్ల, నెట్టెం రఘురాం, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, రావి వెంకటరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: బాలకృష్ణ డైలాగులు రాసిస్తే లోకేష్‌ చెప్తున్నారు: జోగి రమేష్‌

మరిన్ని వార్తలు