చంద్రబాబు భయపడుతున్నారా?.. ఎందుకంత ఫ్రస్ట్రేషన్‌?

25 Feb, 2023 09:34 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రోజురోజుకు చిత్రాచిత్రంగా, పట్టరాని అసహనంతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. కృష్ణా జిల్లా గన్నవరంలో పర్యటించిన సందర్భంగా  మాట్లాడిన విషయాలు గమనిస్తే ఆయన ఏదో తేడాగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం సహజంగానే వస్తుంది. చంద్రబాబు అన్న మాటలు ఏమిటో చూడండి. దొంగాటలు వద్దు.. లగ్నం పెట్టుకుందాం రండి.. తాడోపేడో తేల్చుకుందాం.. ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా సైకోని కూడా తీసుకురండి.. అని అంటున్నారంటే ఏమని అనుకోవాలి. ఇది అసలు ఒక సీనియర్ నేత మాట్లాడవలసిన తీరేనా!పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి అర్దం, పర్దం లేకుండా ఆవేశపడడం ఒక ఎత్తు అయితే రండి.. కొట్టుకుందాం అని అంటున్నారంటే ఏమనాలి?

ఆయనకు నిజంగా అంత భయం లేకపోతే తన చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోస్‌కు  చెందిన వంద మంది భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు. ఆయన కూడా తనకు ఆస్థాయి  భద్రత అవసరం లేదని, సాధారణ భద్రత సరిపోతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఆయనకు భద్రత వద్దనడం లేదు. కాని తానేమో పూర్తి భద్రత వలయంలో ఉండి, టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతున్న తీరు చాలా దారుణంగా ఉంది.

గన్నవరంలో ఆయన పర్యటనలో స్థానికులు పెద్దగా పాల్గొనలేదట. ఆయనేదో నాలుగు డైలాగులు చెప్పి, యధా ప్రకారం ముఖ్యమంత్రిపైన, వైసీపీపైన దూషణలకు పాల్పడి నోటి తీట తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు. అన్ని చోట్ల పోలీసులను బెదిరించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం మద్దతుదారులుగా పోలీసులు మారకపోతే ఆయన ఊరుకోరట. ప్రభుత్వం వైపు ఉండకూడదట.

నిజానికి గన్నవరం లో జరిగిన ఘటనలో పోలీసులు తమ బాధ్యత నిర్వహించకుండా ఉంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేది. అలా జరగలేదన్నదా చంద్రబాబు బాద అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తీవ్రమైన ఘటన జరిగి ఉంటే,  శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రచారం మరింతగా చేయవచ్చన్నదా ఆయన ఆలోచన అనిపిస్తుంది. ఒకవైపు టిడిపి కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వడం, వారిని దూషించడం అన్నిటికి చంద్రబాబే బాధ్యత వహించాలి.

ఎందుకంటే ఆయన ఒక టార్గెట్ పెట్టుకుని టీడీపీ వారిని రెచ్చగొడుతున్నారు. మీరేమైనా చేయండి, కేసుల సంగతి మేం చూసుకుంటాం అని ఆయన గతంలోనే చెప్పారు. పోలీసులను ఏకంగా సంఘ విద్రోహ శక్తులంటూ ఇష్టారాజ్యంగా అనపర్తిలో, ఇతర చోట్ల మాట్లాడారు. తద్వారా తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులపైన దాడులు చేయాలని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు.  చుట్టూ భద్రతా వలయం ఉంది కనుక తన  జోలికి రావాలంటే అంత ఈజీకాదని ఆయన భావన కావచ్చు. అందువల్ల ఆయన అందరిని రెచ్చగొట్టి తాను మాత్రం సేఫ్ గా ఉంటున్నారు.

గత ఎన్నికల ముందు తనను సీబీఐ అరెస్టు చేస్తుందని, అందరు వచ్చి తన చుట్టూ ఉండాలని అంటుండేవారు. ఇప్పుడు ఏమో తేల్చుకుందాం రండి, లగ్నం పెట్టుకుందాం రండి అంటున్నారు. ఆ లగ్నానికి ఆయన పార్టీ నేత పట్టాభి వంటివారిని కూడా తీసుకువస్తారేమో తెలియదు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. పట్టాభి పోలీసుల  పట్ల అనుచితంగా ప్రవర్తించి అరెస్టు అయిన తర్వాత మామూలుగా అయితే వెంటనే బెయిల్ పిటిషన్ వేసేవారు. అలాంటిది ప్రస్తుతం మాత్రం అంత తొందరేమీ లేదని  అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.  దీనిద్వారా సానుభూతి సంపాదించాలన్నది టీడీపీ ప్లాన్ అట. అంటే తన దిక్కుమాలిన రాజకీయం కోసం తన పార్టీవారిని సైతం బలి చేయడానికి చంద్రబాబు వెనుకాడరా అని టీడీపీలోనే చర్చ జరుగుతోందట.  

వైఎస్సార్‌సీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకుగాను ఆయనను అయితే జైలులో  పెట్టాలి.. లేదా పిచ్చాసుపత్రిలో చేర్చాలి అని అన్నారు. చంద్రబాబు లగ్నం పెట్టాలని అంటున్నారని అందుకు తాము సిద్దమేనని ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తన చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను వదలిపెట్టి రావాలని నాని సూచించారు.

మరి ఇందుకు చంద్రబాబు సిద్దపడతారా? ఇవేవి జరిగేవి కావు. కేవలం కార్యకర్తలను దాడులకు పురికొల్పడానికే  చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు కు బాలకృష్ణ పూనినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగానే బాలకృష్ణకు సినిమా డైలాగులు తప్ప రాజకీయ డైలాగులు చెప్పడం అంతగా చేతకాదు. ఏదేదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయన కోవలోకి చంద్రబాబు వచ్చారన్నది నాని అభిప్రాయం కావచ్చు.

ఇక వివేకా హత్య కేసుపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఇన్నీ ,అన్నీ కావు.. వివేకా హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కదా! మరి అప్పుడు తన ప్రభుత్వంలోని పోలీసు అదికారులు  విచారణ సరిగా చేయలేకపోయారని అది తమ ప్రభుత్వ అసమర్థత అని ఒప్పుకుంటున్నారా? ఎలాగొలా ముఖ్యమంత్రి జగన్‌పైన బురద పూయాలని నానా పాట్లు పడుతున్నారు. సిబిఐ తీరు కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది. అన్ని కోణాలలో ఎందుకు విచారణ చేయడం లేదో తెలియడం లేదని ఆ కేసును పరిశీలిస్తున్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో జగన్ కేసులలో అచ్చంగా టిడిపి, కాంగ్రెస్ నేతలు సూచించిన విధంగా సీబిఐ  డీల్ చేసిందని ప్రజలంతా నమ్మారు. సీబీఐ విచారణను జనం నమ్మలేదు కాబట్టే 2019లో ప్రజలంతా జగన్ కు పట్టం కట్టారు.

ఇప్పుడు కూడా సిబీఐ అలాగే అతిగా ,ఏకపక్షంగా దర్యాప్తు చేస్తే రాజకీయంగా చంద్రబాబుకు ఉపయోగపడకపోగా, అది మరింత నష్టం చేసే అవకాశం ఉందని కొందరు ప్రముఖ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ది కార్యక్రమాల ఎజెండానుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబుతో పాటు, ఈనాడు, తదితర ఎల్లో మీడియా  విపరీతంగా  శ్రమిస్తోంది. అదికారంలోకి వస్తే తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పలేని దైన్య స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇతరత్రా జగన్ ను ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చా అని ఆలోచించి కుట్ర ప్లాన్ లను ముందుకు తీసుకు వస్తున్నది. ఇలాంటివి ఫలిస్తాయని అనుకోవడం భ్రమే అవుతుంది. ప్రజలంతా అమాయకులని భావిస్తే పప్పులో కాలేసినట్లే అవుతుందని చెప్పవచ్చు.
-హితైషి
చదవండి: హతవిధీ! ఇక్కడే ఇలా ఉంటే.. ఇతర జిల్లాల్లో మన పరిస్థితి ఏంటి?

మరిన్ని వార్తలు