చంద్రబాబుకు చెంపపెట్టు.. జనసేనకు ఇదే మంచి ఛాన్స్‌?

17 Jan, 2024 14:43 IST|Sakshi

పబ్లిక్ సర్వెంట్స్‌పై వచ్చే అవినీతి అభియోగాల మీద విచారణ జరపడానికి ముందుగా ఉన్నతాధికారుల  అనుమతి తీసుకోవాలా?. ఈ రూల్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందా? వర్తించదా?. దీనిని తేల్చడానికి సుమారు నాలుగు నెలల వ్యవధి తీసుకున్న గౌరవ సుప్రీంకోర్టు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. 

2018లో వచ్చిన చట్ట సవరణ ఆయనకు వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి, వర్తించదని మరో న్యాయమూర్తి చెప్పడంతో ఈ వ్యవహారం చీఫ్ జస్టిస్ కోర్టులోకి వెళ్లింది. ఆయన దీనికి ఏం పరిష్కారం చూపుతారో ఇప్పుడే చెప్పలేం. అదే సమయంలో చంద్రబాబుపై వచ్చిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేయకపోవడం, ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ  కోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకించకపోవడంతో ఈ ఉత్తర్వులు  శరాఘాతంగా మారాయి. చంద్రబాబుకు ఒక జడ్జీ ఎక్కడా అసలు ఊరట కల్పించలేదు. 17ఏ పేరుతో అవినీతి కేసుల్లో రక్షణ కల్పించలేమని జస్టిస్ బేలా అభిప్రాయపడ్డారు. మరో జడ్జీ అనిరుధ్ బోస్ మాత్రం 2018కి ముందు కేసులకు కూడా గవర్నర్ అనుమతి అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు. 

అయితే ఇప్పుడైనా అనుమతి తీసుకోవచ్చని చెప్పారు. ఈ అంశంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు లేకపోవడం గమనార్హం. చంద్రబాబు ఎలాగోలా ఈ కేసు నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు చాలా వరకు వృథా అయినట్లే అనిపిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక చంద్రబాబు అరెస్టు చెల్లదని, రిమాండ్ సరికాదని చెప్పి ఉంటే ఈపాటికి చంద్రబాబు పెద్ద ఎత్తున మీడియా సమావేశం పెట్టి ఏపీ ప్రభుత్వంపైన, సీఐడీపైన, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడేవారు. సుప్రీంకోర్టు అలా చేయకపోవడంతో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ నేతలు, వారికి సంబంధించిన మీడియా ఛానళ్లు, టీడీపీ మద్దుతారులైన కొంతమంది లాయర్లు మాత్రం స్వరం తగ్గించి ఈ తీర్పు ఆధారంగా సీఐడీ చంద్రబాబుపై ఉన్న వివిధ కేసులలో ముందుకు వెళ్లకూడదన్నట్లు మాట్లాడటం ప్రారంభించారు. 

అనిరుధ్‌ బోస్ ఇచ్చిన  తీర్పులోని ఒక భాగమైన 17ఏ సెక్షన్ వర్తిస్తుందన్న పాయింట్‌ను మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీకి భజన చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు ఎవరూ  అధైర్యపడవవద్దని, అంతిమ విజయం మనదేనని అనడం ద్వారా పరిస్థితిని తెలియచెప్పారు. ఇంతకాలం స్కిల్ డెవలప్మ్‌మెంట్‌ కార్పొరేషన్ కేసులో అసలు అవినీతే జరగలేదని టీడీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. గవర్నర్ అనుమతి లేకుండా ఈ కేసు ముందుకు వెళ్లజాలదని  ప్రచారం చేశారు. అంతే తప్ప తాము స్కామ్‌కు పాల్పడలేదని వాదించడానికి అంతగా సుముఖత చూపలేదు. తమ క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అనుమతిస్తుందని వారు అనుకున్నారు. కానీ, సుప్రీంకోర్టు అందులోను ఒక న్యాయమూర్తి మాత్రమే 17ఏ లోని ఒక భాగం వరకే కొంత అనుకూల తీర్పు ఇచ్చినా, ఆయన కూడా ఇప్పుడైనా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని చెప్పడంతో   చంద్రబాబుకు ఆ ఉపశమనం కూడా లేకుండా చేసినట్లయింది. 

అంటే దీని అర్ధం ఈ ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఈ కేసులో అవినీతి ఉందన్న నమ్మకానికి వచ్చినట్లే అనుకోవాలి. ఒకవేళ  ఇద్దరు జడ్జీలు 17ఏ విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, కేసు ఏమీ పోదు. కేవలం గవర్నర్‌కు ఫైల్ పంపించి అనుమతి తీసుకుంటే సరిపోతుంది. గవర్నర్ స్థాయిలో మేనేజ్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటే అది వేరే విషయం. కానీ, సుప్రీంకోర్టు 17ఏపై తీర్పు ఇవ్వకుండా, ఇద్దరు జడ్జీలు పరస్పర విరుద్దమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే టైమ్‌లో చంద్రబాబు కోరిన విధంగా కేసును క్వాష్ చేయకపోవడంతో సీఐడీకి దీనిపై తదుపరి విచారణ కొనసాగించడానికి స్వేచ్ఛ వచ్చినట్లయిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 17ఏపై తదుపరి  తీర్పు ఇవ్వడానికి ముందు చాలా ప్రక్రియ ఉంటుంది. అదంతా అయ్యే సరికి ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. అంతదాకా ఎందుకు చంద్రబాబు కేసులో ఈ తీర్పు రావడానికి సుప్రీంకోర్టు నాలుగు నెలల వ్యవధి తీసుకోవడం కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. 

ఈ కేసును ప్రముఖ లాయర్ ప్రశాంత భూషణ్ వేసిన కేసుకు జత చేస్తారేమోనని అనుకున్నారు. ఎందువల్లనో అలా చేయకుండా కొంత టైమ్ తీసుకుని తీర్పు వెలువరించారు. కాగా చివరి క్షణంలో కూడా టీడీపీ లాయర్ సిద్దార్ద్ లూథ్రా ఈ కేసులో చంద్రబాబుపై ఉన్న రిమాండ్‌పై ప్రత్యేకంగా తీర్పు వచ్చేందుకు యత్నించినా ఫలించలేదట. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ఎక్కడా తప్పు చేయలేదన్నట్లుగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో  మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ, సుప్రీంకోర్టు తీర్పుతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ అవినీతి కేసులో పలు ఆధారాలు ఉన్నప్పట్టికీ టీడీపీవారి కన్నా ఎక్కువగా రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు భుజాన వేసుకుని అసలు అవినీతే  లేదన్నట్లుగా ప్రొజెక్టు చేయడానికి నానా తంటాలు పడ్డారు.

టీడీపీ ఖాతాకు అక్రమంగా కోట్ల రూపాయల నిధులు వెళ్లాయని సీఐడీ కొన్ని పత్రాలను చూపించినా వీరు దబాయిస్తుంటారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఈ విచారణకు రాకుండా అమెరికాకు పారిపోయినా అసలేమీ జరగనట్లు నటిస్తుంటారు. ఈడీ అధికారులు ఇదే కేసులో నలుగురిని అరెస్టు చేసినా అదేదో చంద్రబాబుకు సంబంధంలేని వ్యవహారంగా కలరింగ్‌ ఇవ్వడానికి యత్నించారు. విశేషం ఏమిటంటే ఒక పక్క మొత్తం కేసును కొట్టివేయాలని హైకోర్టులోనూ, ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు లాయర్లు చాలాకాలం ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌లు వేయలేదు. కానీ క్వాష్ పిటిషన్‌పై అనుకూలంగా తీర్పు రాదని భావించారేమో తెలియదు కానీ, వారు ఆలస్యంగా బెయిల్ పిటిషన్ వేశారు. తదుపరి హైకోర్టులో తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు చూపి బెయిల్ పొందారన్న అభిప్రాయం ఉంది. అది వేరే సంగతి. ఇక్కడ కొన్ని విషయాలను పోల్చి చూడాలి. 

ఢిల్లీలో  జరిగిన లిక్కర్ స్కామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు నెలల తరబడి జైలులో ఉన్నారు. వారిపై అంతా కలిపి వంద కోట్ల అవినీతి ఆరోపణ  కూడా లేదు. అదే చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల్లో అనేక వందల కోట్ల అభియోగాలు ఉన్నాయి. అయినా ఆయన సత్వరమే బయటకు రాగలిగారు. ఇక సుప్రీంకోర్టు వరకు వెళ్లి అసలు కేసే లేకుండా చేసుకోవాలని పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్లు ఖర్చు చేసి వాదనలు వినిపించారు. కానీ, ఆశించిన ఫలితం రాలేదు. వచ్చే ఎన్నికలలో దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది సహజంగానే చర్చనీయాంశం అవుతుంది. చంద్రబాబుకు కొన్నికేసులలో బెయిల్ వచ్చింది. మరి కొన్ని కొత్త కేసులు ఉన్నాయి. వాటిలో కూడా బెయిల్ తెచ్చుకుంటారా? లేక అరెస్టు అవుతారా? అన్నది చూడాలి. 

చంద్రబాబుపై అవినీతి కేసు లేకుండా బయటకు వస్తారని ఆశించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు దీనిని సమర్ధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అనుమతించి ఉంటే దానిని తమకు రాజకీయంగా మైలేజీ వచ్చేలా ఎన్నికల ప్రచారం సాగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ ఈ తీర్పును వక్రీకరించడానికి వారు ప్రయత్నించవచ్చు. ఈ కేసులో టీడీపీ ఖాతాకు చేరిన నిధులు, తదితర అంశాలలో సీఐడీ కనుక వేగంగా ముందుకు వెళితే చంద్రబాబుకు వచ్చే ఎన్నికలలో నష్టం కలగవచ్చు. మరే కేసులో అయినా అరెస్టు అయినా, లేక సీఐడీ వద్దకు తరచుగా విచారణకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చినా తెలుగుదేశం, జనసేన క్యాడర్ నైతికంగా దెబ్బతింటుంది. ప్రజలలో దీనిని ఎలా సమర్ధించుకోవాలో తెలియని ఆందోళన ఎదరువుతుంది.

టీడీపీతో పొత్తులో చేరడం వల్ల తాము కూడా అనవసరంగా అవినీతికి మద్దతు ఇచ్చినట్లయిందని జనసేన కార్యకర్తలు అనుకునే అవకాశం ఉంటుంది. దీంతో జనసేన వారు తమ సపోర్టు కావాలనుకుంటే మరిన్ని సీట్లు ఇవ్వాలని  డిమాండ్ చేయవచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడుకు ఈ తీర్పు పెద్ద షాక్ వంటిదని చెప్పాలి. ఎన్నికలలో దీని ప్రభావం పడకుండా ఉండటానికి ఆయన ఎంత కష్టపడ్డా అంత పలితం ఉండకపోవచ్చు.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega