దివిసీమ టీడీపీలో ఉప్పెన

26 Sep, 2021 06:19 IST|Sakshi
మాట్లాడుతున్న జనార్దనరావు

మోపిదేవి మండల అధ్యక్షుడితో సహా మూకుమ్మడి రాజీనామాలు

ఎంపీటీసీ పదవికి సైతం రాజీనామా?

బీసీలను గడ్డిపరకలకన్నా హీనంగా చూస్తున్నారని ఆరోపణ

మోపిదేవి (అవనిగడ్డ): కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.  మోపిదేవి మండల టీడీపీ నాయకుల మూకుమ్మడి రాజీనామాలు దివిసీమలో తీవ్ర చర్చలకు దారితీశాయి. మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబం నుంచే ఈ ముసలం పుట్టడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రులు నడకుదటి నరసింహారావు సోదరుడు, కొల్లు రవీంద్ర మేనమామ అయిన జనార్దనరావు అధిష్టానంపై రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఈయన మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతగా, రెండు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు.

శనివారం ఉత్తర చిరువోలులంకలోని ఆయన ఇంటివద్ద  టీడీపీకి, అవసరమైతే ఎంపీటీసీ పదవికి సైతం తాను, తన కుటుంబం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కమ్యూనిస్టు పార్టీలో కొనసాగామని, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌.టి.రామారావు పిలుపు మేరకు ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి టీడీపీకి మండలంలో కంచుకోటగా గ్రామాన్ని బలోపేతం చేశానని చెప్పారు. సర్పంచ్‌గా తాను, తన భార్య జననీకుమారి బాధ్యతలు నిర్వహించామని గుర్తు చేశారు. 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీపీని చేస్తామని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేకపోయినా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని తెలిపారు.

ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్లీ పోటీచేయాలని, గెలిస్తే ఎంపీపీ స్థానంలో కూర్చోబెడతామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో తన భార్య జననీకుమారిని కార్యకర్తలు గెలిపించారని పేర్కొన్నారు. అయితే ఎంపీపీ పదవి ఇవ్వకుండా.. హామీని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను గడ్డిపరకలకన్నా హీనంగా చూస్తున్నారని అన్నారు. అవసరానికి మాత్రమే వాడుకుంటూ అవకాశం ఉన్నా.. తమకు పదవి ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు.  పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి  రాజీనామా చేస్తున్నానని, తన భార్య జననీకుమారి ఎంపీటీసీ పదవిని కూడా వదులు కోవడానికి సిద్ధంగా ఉందని జనార్దనరావు వివరించారు. కాగా, ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు