ఓటమి భయంతో కాకినాడలో తోక ముడిచిన టీడీపీ

4 Aug, 2021 09:46 IST|Sakshi
కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌

ఓటమి భయంతోనే వెనుకడుగు

మెజార్టీ కార్పొరేటర్ల తిరుగుబాటు

‘సంక్షేమానికి’ జైకొట్టిన 35 మంది కార్పొరేటర్లు

పార్టీలను పక్కనబెట్టి ఏకాభిప్రాయం

నేడు కాకినాడ రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

కాకినాడ: నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ ముందే తోక ముడిచింది. ఈ ఎన్నికలో తమ పార్టీ పాల్గొనడం లేదంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం ప్రకటించారు. రెండో డిప్యుటీ మేయర్‌ ఎన్నికకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాకినాడ కార్పొరేషన్‌లో రాజకీయం రసకందాయంలో పడింది. నాటి ఎన్నికల్లో టీడీపీకి 32 మంది కార్పొరేటర్లతో మేయర్‌ స్థానాన్ని దక్కించుకుంది.

మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటెద్దు పోకడలు, పార్టీ పట్ల అంకిత భావంతో పని చేసే వారిపై వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరితో చాలాకాలంగా టీడీపీ కార్పొరేటర్లు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఆయన విధానాలు నచ్చక టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. తాజాగా మెజార్టీ కార్పొరేటర్లు కూడా బయటకొచ్చేశారు. ప్రస్తుతం మేయర్‌తో కలిపి పది మందికి మించి కార్పొరేటర్లు కూడా ఆ పారీ్టలో లేరు. రాజకీయాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా ఏకతాటిపై పని చేస్తామంటూ వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. వారు తమ నిర్ణయాన్ని మీడియా ముందు ప్రకటించడంతో టీడీపీ కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. దీంతో ఎన్నికలకు ముఖం చాటేయాలనే నిర్ణయానికి వచ్చింది.

సంక్షేమానికి జై .. 
కాకినాడలోని 45 మంది కార్పొరేటర్లలో 35 మంది ఒక్కటిగా కలిసి ఉంటామంటూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో మంగళవారం మీడియా ముందు ప్రకటించారు. 2017 ఎన్నికల్లో 48 డివిజన్లకు ఎన్నికలు జరగగా టీడీపీ 32, వైఎస్సార్‌ సీపీ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచారు. ముగ్గురు మృతి చెందగా ప్రస్తుతం 45 మంది ఉన్నారు. వీరిలో 35 మంది పార్టీ రహితంగా జగన్‌కు జై కొట్టారు. మేయర్‌ సుంకర పావని సహా 10 మంది మాత్రమే టీడీపీ పక్షాన నిలిచారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నియంతృత్వ పోకడలతో విసుగెత్తిపోయమని.. సీఎం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తామంతా మద్దతుగా నిలిచామని ప్రకటించారు. వైఎస్సార్‌ సీపీకి జై కొట్టిన వీరందరూ బుధవారం రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో ఏకతాటిపై ఉండాలని నిర్ణయించుకున్నారు. తామంతా ముఖ్యమంత్రి నాయకత్వంలో ద్వారంపూడికి మద్దతుగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక బుధవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఎన్నికల అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ వ్యవహరించనున్నారు.

మరిన్ని వార్తలు