పల్లా.. ఇక చాలు: టీడీపీలో ముసలం

6 Jun, 2021 14:14 IST|Sakshi

అకారణంగా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయలేం 

విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడి మీటింగ్‌కు డుమ్మా కొట్టిన టీడీపీ కార్పొరేటర్లు 

మాజీ ఎమ్మెల్యే నిర్వాకంపై నిరసన

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కార్పొరేటర్లలో అప్పుడే ముసలం బయలుదేరింది. ఏకంగా ముప్పై మంది కార్పొరేటర్లు గెలిచినా ఇప్పటికీ సరైన నిర్దేశం లేకపోవడంతో ఎవరికి వారు అన్నట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనికి తోడు టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోతున్నారని అంటున్నారు. కరోనా కష్ట సమయంలో కూడా జీవీఎంసీ తీరు సమర్ధనీయంగానే ఉన్నా.. లేనిపోని ఆరోపణలు ఎక్కుపెట్టి నానాయాగీ చేయాలని పల్లా అదే పనిగా నగర కార్పొరేటర్లకు నూరిపోస్తూ వచ్చారు. ఇక టీడీపీ అధిష్టానం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఓ వారం రోజుల పాటు షెడ్యూల్‌ విడుదల చేసింది.

దరిమిలా.. జీవీఎంసీపై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు, అధిష్టానం ఆదేశాలను అనుసరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పల్లా భావించారు. ఆ మేరకు శనివారం రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్పొరేటర్లు, నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. కానీ సదరు సమావేశానికి ముగ్గురే ముగ్గురు కార్పొరేటర్లు హాజరయ్యారు. నలుగురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో నిజంగా లోపాలుంటే ఎత్తి చూపాలి కానీ చీటీకి మాటికీ విమర్శలు, నిందారోపణలు చేస్తే ప్రజల్లో పలుచన అయిపోతామని ఓ సీనియర్‌ కార్పొరేటర్‌ చెప్పినా వినిపించుకోకుండా మీటింగ్‌ పెట్టారని అంటున్నారు. అందుకే ఆ మీటింగ్‌ను చాలా ’లైట్‌’ తీసుకున్నామని టీడీపీ నేత ఒకరు చెప్పుకొచ్చారు. అడ్డగోలుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టేది లేదని తెగేసి చెప్పినట్టు స్పష్టం చేశారు.

సమన్వయకర్తను పల్లా ఎలా నియమిస్తారు 
వాస్తవానికి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలను నియమించే బాధ్యత టీడీపీ అధిష్టానానిదే. కానీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా పల్లా శ్రీనివాసరావు తన మేనల్లుడైన ప్రసాదుల శ్రీనివాస్‌ను నియమించుకోవడంపై ఆ పార్టీలోనే వివాదం రేగుతోంది. పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండా ఏకపక్షంగా తన బంధువుని గాజువాక సమన్వయకర్తగా నియమించుకోవడం పల్లా ఏకపక్ష ధోరణికి పరాకాష్ట అని టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు.

చదవండి: వలపు వల.. బెజవాడలో మాయలేడీ మోసాలు  
టీడీపీ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు

మరిన్ని వార్తలు