ఛీ.. తిరుపతిలో పరువు పాయే!

16 Mar, 2021 08:24 IST|Sakshi

టీడీపీ ఉద్ధండులకు తప్పని భంగపాటు

ఆయా డివిజన్లలో ఫ్యాన్‌ ప్రభంజనం

ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారం చేసుకునే వారికీ శృంగభంగమే

రాజకీయ చతురత ప్రదర్శించిన ఎమ్మెల్యే భూమన

ప్రత్యర్థులను మట్టికరిపించిన అభినయ్‌

తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి శృంగభంగమే ఎదురైంది. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, యువనేత భూమన అభినయ్‌రెడ్డి రాజకీయ చతురత ముందు సైకిల్‌ తునాతునకలైంది. భవిష్యత్‌లో తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకునే నేతలు సైతం ఓటమిపాలయ్యారు. సొంత డివిజన్‌లో గెలుపు వాకిట చేరకమునుపే బొక్కబోర్లా పడ్డారు. ఒక్క ఎన్నికతో మాజీ ఎమ్మెల్యే, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, తెలుగు యువత.. తదితర నేతల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేసినట్టయ్యింది.  

సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక నగరంలో దాదాపు 19 ఏళ్ల తర్వాత కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగాయి. మేయర్‌ పీఠంపై రాజకీయ పార్టీలు ఆసక్తి ప్రదర్శించాయి. 50 డివిజన్లు ఉన్న కార్పొరేషన్‌లో 49 డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తే, అందులో 48 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. తెలుగుదేశం పార్టీ ఒక్క డివిజన్‌కే పరిమితమైంది. 22 డివిజన్లు వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవంగా దక్కాయి. ఎన్నికలు జరిగిన 27 డివిజన్లలో 26 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది.  

తండ్రికి తగ్గ తనయుడు 
తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తన కుమారుడు భూమన అభినయ్‌రెడ్డికి అప్పగించారు. ప్రత్యక్షంగా కార్పొరేషన్‌ ఎన్నికల్లో పాల్గొన్న ఆయన 4వ డివిజన్‌ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్‌ పరిధిలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టిసారించారు. 27 మంది పోటీ చేస్తే అందులో 25 మంది విద్యాధికుల్ని ఎంపిక చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు, ఏడుగురు బీటెక్, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయేట్స్, 12 మంది గ్రాడ్యుయేట్స్‌ ఉండడం గమనార్హం. తాజా ఫలితాల్లో ఒక్కరు మినహా విద్యాధికులంతా విజేతలుగా నిలిచారు. యువనేత ముందు చూపు, రాజకీయ చతురతతోనే అద్భుత ఫలితాలు సాధించారని విశ్లేషకులు పేర్కొన్నారు.  

చదవండి: (ప్రజలు నమ్మటంలేదు.. మనపని అయిపోయింది..)

టీడీపీ నేతల పరువు గల్లంతు 
కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ నేతల పరువు గల్లంతైంది. నియోజకవర్గం, పార్లమెంటు, రాయల సీమ స్థాయి నేతలుగా చెప్పుకుంటున్న వారంతా, వారివారి డివిజన్లను కూడా దక్కించుకోలేక పోయారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మను మరాలు వెంకటకీర్తి 18వ డివిజన్‌లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. టీడీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, తుడా మాజీ చైర్మన్, టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ తమ్ముడు కృష్ణాయాదవ్‌ 3వ డివిజన్‌లో బరిలోకి దిగి ఓడిపోయారు. దాదాపు 1,081 ఓట్ల తేడాతో ప్రత్యర్థి చేతిలో చిత్తయ్యారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ భార్య జ్యోత్స్న 15వ డివిజన్‌లో పోటీచేసి ఓడిపోయారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టౌన్‌బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ పులుగోరు మురళీకృష్ణారెడ్డి మద్దతుతో నిలిచిన అభ్యర్థులకూ శృంగభంగమే ఎదురైంది.

తిరుపతిలో ఉనికి చాటుకునేందుకు నిత్యం అధికార పార్టీపై బురదచల్లే నవీన్‌కుమార్‌రెడ్డి తమ్ముడు భువన కుమార్‌రెడ్డిని స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దింపి భంగపడ్డారు. 31వ డివిజన్‌లో మబ్బు దేవనారాయణరెడ్డి బలపరిచిన పుష్పలత సైతం ఓటమిని చవిచూశారు. టౌన్‌బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ పులుగోరు మురళీకృష్ణారెడ్డి సొంత డివిజన్‌ అయిన 26వ డివిజన్‌ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎవరికి వారు ఉద్ధండులమని చెప్పుకునే నాయకులను ప్రజలు తిరస్కరించారని స్థానికులు చర్చించుకుంటున్నారు.  

చదవండి: 
హిందూపురంలో బాలయ్యకు ఓటు దెబ్బ
  
సెల్‌ఫోన్‌ వాడొద్దన్నందుకు.. మనస్తాపం చెంది!

మరిన్ని వార్తలు