-

తిత్లీ పాపం.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ..

16 Feb, 2021 11:05 IST|Sakshi

అధికారంలో ఉండగా ఉద్దానంలో టీడీపీ నాయకుల అకృత్యాలు

తుపాన్‌ విధ్వంస సమయంలోనూ లెక్కలేనన్ని అక్రమాలు

తమ వారికి మేలు చేసి, బాధితులను వంచించిన అన్యాయాలు 

లెక్కగట్టి మరీ పంచాయతీ పోరులో బుద్ధి చెప్పిన ప్రజలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానంలో టీడీపీ పతనం పతాక స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు ఊరూరా చక్రం తిప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు కనీసం వార్డు మెంబర్‌ స్థానాన్ని కూడా దక్కించుకోలేని దీన స్థితికి చేరుకున్నారు. దశాబ్దాల తరబడి పాలించిన వారు పనులు చేయకపోవడం, ఆపత్కాలంలో అక్రమాలకు పాల్పడడం పతనానికి హేతువులయ్యాయి. ముఖ్యంగా తిత్లీ తుఫాన్‌ పరిహారంలో చేసిన అక్రమాలు టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. పరిహారం పంపిణీలో అర్హులకు అన్యాయం చేసి, అనర్హులకు లబ్ధి చేకూర్చిన టీడీపీ నేతలకు ఉద్దానం ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఏకపక్షంగా ఓట్లేసి టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారందరినీ కసి తీరా ఓడించారు.

ఒంటరి మహిళల పింఛన్ల అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మరోవైపు సంక్షేమ పథకాలు, ఉద్దానం అభివృద్ధికి పాటు పడుతున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఆ పార్టీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారిని అధిక సంఖ్యలో గెలిపించుకు న్నారు. తిత్లీ తుఫాన్‌ సమయంలో టీడీపీ నేతల పాల్పడిన అవినీతి అంతా ఇంతా కాదు. భూమి లేని వారికి, నష్టం జరగని వారికి పరిహారం ఇప్పించి, వాస్తవంగా భూములుండి, నష్టపోయిన వారికి అన్యాయం చేశారు. ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరికీ తాజా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయు డు, బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్‌ శివాజీ కుటుంబీకులకు ప్రజలు షాకిచ్చా రు.

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ స్వ గ్రామం ఉన్న కవిటి మేజర్‌ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు భారీ మెజారిటీతో విజ యం సాధించారు. ఈ మేజర్‌ పంచాయతీలో కూన రవికుమార్, బెందాళం అశోక్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. అయినా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాగే, గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ స్వగ్రామమైన సోంపేట పంచాయతీలోనైతే ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు విజయం సాధించారు. ఇక్కడ 18 వార్డులుండగా ఒక్కటి కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. వైఎస్సార్‌సీపీ పూర్తిగా స్వీప్‌ చేసింది.  తిత్లీ అక్రమాలకు పాల్పడ్డ వారిలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలవ్వడం ఇక్కడ చర్చనీయాంశమైంది. పెద్ద శ్రీరాంపురంలో ప్రతి సారి గెలిచిన టీడీపీ ఈసారి మట్టి కరిచింది. బల్లెడ సుమన్‌ అనే సామాన్యుడి చేతిలో టీడీపీకి చెందిన సీనియర్‌ నేత మాదిన రామారావు ఓడిపోయారు. అలాగే, కంచిలి మండలంలోని చిన్న కొజ్జరియా, పెద్ద కొజ్జరియ, శ్రీరాంపురం, జాడు పూడి తదితర గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోవడానికి తిత్లీ అక్రమాలే కారణంగా చెప్పుకోవచ్చు.

ఒంటరి పింఛన్ల అక్రమాలు..
భర్తలున్న టీడీపీ మహిళలకు ఒంటరి మహిళల పింఛన్లు మంజూరు చేసి లబ్ధి చేకూర్చిన వైనం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపింది. కళ్ల ముందే అనర్హులకు పింఛన్లు ఇవ్వడంపై ప్రజలు కన్నెర్ర చేశారు. ముఖ్యంగా పింఛన్ల అక్రమాలు జరిగిన బూర్జపాడు, ఈదుపురం, లొద్దపుట్టి, మండపల్లిలో టీడీపీ నేతలు ఘోరంగా ఓడిపోయారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 98 పంచాయతీలకు గాను 83 పంచాయతీలను, పలాస నియోజకవర్గంలో 95 పంచాయతీలకు గాను 87 పంచాయతీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుందంటే టీడీపీ అక్రమాలు ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు.

ప్రగతి పరుగులు..
ఉద్దానం ఏరియాలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా టీడీపీ పునాదులను పెకిలించేశాయి. కిడ్నీ సమస్య పరిష్కారానికి చేస్తు న్న కృషి,  స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపాయి. ముఖ్యంగా కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేస్తున్న రీసెర్చ్‌ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్లు ఎన్నికల్లో ప్రజలను ఆలోచింప చేశాయి. అలాగే ఉద్దానం ఏరియాలో స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చేపడుతున్న రూ.700కోట్ల మంచినీటి ప్రాజెక్టు, మత్స్యకారుల కోసం నిర్మిస్తున్న మంచినీళ్లపేట జెట్టీ, కిడ్నీ రోగులకు రూ. 10వేల పింఛను, ఇవన్నీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమయ్యాయి.

వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు మందసలో 2965 ఓట్ల మెజారీ్ట, సోంపేటలో 2841 ఓట్ల మెజారీ్ట, కవిటిలో 1700పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఆషామాషీ కాదు. పూండి గోవిందపురంలో ఎప్పుడూ టీడీపీయే గెలిచేది. జమీందారి వ్యవస్థ కొనసాగేది. ఆయనెవరు బొట్టు పెడితే వాళ్లే గెలిచేవారు. ఈసారి ఆ పరిస్థితి మారింది. అక్కడ వైఎస్సార్‌సీపీ గెలిచింది. లక్ష్మీపురం పంచాయతీలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తినాయుడు కుటుంబీకులు గెలిచేవారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. సోంపేట, మందస, మెట్టూరు, గుణుపల్లి, చీపురుపల్లి, రేయపాడు నగరంపల్లిలో ప్రతి సారి టీడీపీయే గెలిచేది. తొలిసారిగా ఘోరంగా ఓటమి పాలైంది.
(చదవండి: విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు)
మరింత వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..     

మరిన్ని వార్తలు