'కొల్లేరు సమస్యపై సీఎం జగన్‌ను కలుస్తా.. ఆ తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకుంటా'

14 Feb, 2023 08:19 IST|Sakshi

కైకలూరు టీడీపీలో ఐదుగురిని బరిలో ఉంచారు ఇది సరైన పద్ధతి కాదు 

టీడీపీ కైకలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జయమంగళ వెంకటరమణ

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ప్రాంత సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమరి్పస్తానని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జయమంగళ వెంకటరమణ చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కొల్లేరు మూడో కాంటూరు వరకు కుదింపు, ఆక్వా జోన్‌ పరిధిలో మరిన్ని చెరువులు చేర్చటం, ఈబీసీలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం తదితర అంశాలతో ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తానని, ఆయన స్పందననుబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

కైకలూరు నియోజకవర్గంలో టీడీపీలో ఐదుగురిని బరిలో నిలిపి వారితో పనిచేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. వైఎస్సార్‌ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే 250 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించారని, అది సరైన విధానమని తెలిపారు. నియోజకవర్గంలో ఐదుగురు నాయకులు ఉండటం వల్ల చివర్లో ఒకరికి టికెట్‌ వస్తే మిగిలినవారు వెన్నుపోటుదారులుగా మారుతున్నారని విమర్శించారు.

1999 నుంచి తెలుగుదేశం పార్టీలో సేవ చేస్తున్నానని, ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నానని వివరించారు. ఓ పౌరుడిగా ముఖ్యమంత్రిని కలిసే హక్కు ఉంటుందని, తాను గతంలో నలుగురు సీఎంలను కలిసి కొల్లేరు సమస్యలను విన్నవిస్తే అందరూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తనపై ఇటీవల హత్యాయత్నం జరిగితే రక్షణ కావాలని ప్రభుత్వానికి లేఖ రాశానని, అందుకే గన్‌మెన్‌ను కేటాయించారని ఆయన తెలిపారు.
చదవండి: సైన్యం సన్నద్ధం

మరిన్ని వార్తలు