కుప్పానికి టీడీపీ దొంగ ఓటర్లు 

14 Nov, 2021 04:06 IST|Sakshi
కర్ణాటక నుంచి ప్రత్యేక బస్సు ద్వారా దొంగ ఓటర్లను తీసుకొచ్చి రోడ్డుపై విడిచిపెడుతున్న దృశ్యం

కర్ణాటక, పలమనేరు నుంచి రాక 

రాత్రంతా వారికి టీడీపీ నేతల శిక్షణ 

పోలింగ్‌ వద్ద పట్టుబడితే వైఎస్సార్‌సీపీ నేతలు పంపినట్లు చెప్పాలని సూచన

దొరక్కపోతే సైకిల్‌కు ఓటేయాలని స్లిప్పులు, డబ్బులు, మద్యం పంపిణీ 

మహిళా వలంటీర్ల నివాసాలకు వెళ్లి బెదిరిస్తున్న టీడీపీ నేతలు 

సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి టెన్షన్‌ రోజురోజుకీ ఎక్కువవుతుండడంతో ఆ పార్టీ నేతలు దొంగ ఓటర్లను రంగంలోకి దించుతున్నారు. ఇలాగైనా పరువు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. పోలింగ్‌కు ఇంకా ఒక్కరోజే సమయం ఉండడంతో డబ్బులు, మందు పంపిణీ పూర్తిచేయడంతో పాటు దొంగ ఓట్లు వేయించి లబ్ధిపొందాలని ప్రలోభాలకు తెరలేపారు. నిజానికి.. కుప్పంలో పనులు దొరక్క అనేకమంది బెంగళూరుకు వలస వెళ్లిపోయారు. వారంతా అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. వారిలో సుమారు 35 వేల మందికి అటు కుప్పంలోనూ.. ఇటు బెంగళూరులోనూ ఓటు హక్కు ఉంది. అలాగే, వీరికి అక్కడ ఇక్కడ ఆధార్, రేషన్‌ కార్డులు ఉన్నాయి.

పింఛను, బియ్యం రెండుచోట్లా తీసుకుంటున్నారు. దీంతో వీరిలో అధిక శాతం మందిని టీడీపీ నేతలు తీసుకొచ్చి ఓట్లు వేయిస్తుండడంతో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధిస్తూ వస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ విషయాన్ని 2019 ఎన్నికల్లో అప్పటి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దివంగత చంద్రమౌళి గుర్తించారు. పక్కా వివరాలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో 25 వేల ఓట్లను తొలగించారు. మరో 10వేల ఓట్లను వివిధ కారణాలతో తొలగించలేదు. వారందరినీ టీడీపీ నేతలు ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలకు పిలిపిస్తున్నట్లు సమాచారం. 

దొంగ ఓటర్లకు ప్రత్యేక శిక్షణ
బెంగళూరు, కేజీఎఫ్, పలమనేరు నుంచి మరో 5 వేల మందితో దొంగ ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ నేతలు రవాణా సదుపాయాలుఏర్పాటుచేశారు. ఇలా వచ్చేవారి కోసం కుప్పానికి దూరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. వీరికి ప్రత్యేకంగా ఓటరు ఐడీ కార్డులు, స్లిప్పులు సిద్ధంచేసినట్లు సమాచారం. వాటితో సోమవారం పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నాక ఏం చేయాలో టీడీపీ నేతలు శిక్షణనిచ్చారు. పోలింగ్‌ కేంద్రాల వద్దకు దొంగ ఓటర్లు చేరుకున్నాక.. వారిని ఎవరైనా గుర్తిస్తే వైఎస్సార్‌సీపీ వారు పంపించారని చెప్పమని తర్ఫీదు ఇచ్చారు. ఎవరూ అడ్డుకోకపోతే సైకిల్‌ గుర్తుకు ఓటేయమంటున్నారు. 

వలంటీర్లకు బెదిరింపులు 
టీడీపీ నేతలు వలంటీర్ల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌ తన అనుచరులతో శుక్రవారం రాత్రి ఓ మహిళా వలంటీర్‌ ఇంటికి వెళ్లి తీవ్రస్థాయిలో బెదిరించారు. శనివారం మరో ముగ్గురు మహిళా వలంటీర్ల నివాసాలకు టీడీపీ నేతలు వెళ్లి బెదిరించినట్లు బాధితులు వాపోతున్నారు.  

కొత్తదారుల్లో నగదు పంపిణీ 
ఇక ఎన్నికల్లో డబ్బులు పంపిణీని ఇప్పటివరకూ నేరుగా ఇళ్లకు వెళ్లి ఇవ్వడమే చూశాం. కానీ, కుప్పంలో టీడీపీ నేతలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న చిల్లర దుకాణాలు, చిన్నచిన్న బంకులు, మెడికల్‌ షాపులు, టీ బంకులను కేంద్రాలుగా ఎంచుకున్నారు. టీడీపీ అభ్యర్థులు ఈ దుకాణాల్లో డబ్బులు, పేర్లు, కోడ్‌ నంబర్లు స్లిప్‌పై వేసి ఇస్తారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఓటర్లకు ఓ నంబర్‌ కోడ్‌తో ఉన్న స్లిప్‌ ఇస్తారు. దానిని వారు చెప్పిన దుకాణంలో ఇస్తే డబ్బులు ఇచ్చేస్తారు. ఈ తరహా డబ్బుల పంపిణీ శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ప్రారంభం కానున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరోవైపు.. టీడీపీ నేతలు అన్ని వార్డులకు రెబల్‌ అభ్యర్థులుగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయించారు.

వీరంతా టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా రెబల్‌ అభ్యర్థులను స్వతంత్రులుగా ప్రకటిస్తారు. వీరిపై పోలీసుల నిఘా పెద్దగా ఉండదు. దీనిని టీడీపీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వేలు టీడీపీ అభ్యర్థి తరఫు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికిపోయాడు. అతని నుంచి రూ.50,500 స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్రులుగా ఉన్న టీడీపీ అభ్యర్థుల ద్వారా ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అలాగే.. ఎక్కువ సంఖ్యలో ఓట్లు కలిగిన వారికి పెద్దమొత్తంలో డబ్బులు లేదా బహుమతులు ఇవ్వటానికి టీడీపీ అన్ని ఏర్పాట్లుచేసినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.  

మరిన్ని వార్తలు