సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన గంజి చిరంజీవి

29 Aug, 2022 12:26 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: మంగళగిరి టీడీపీలో కీలకనేత గంజి చిరంజీవి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశేష కృషి చేస్తోందని తెలిపారు. సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. 

ఇకపోతే.. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదని మండిపడ్డారు. నిరంతరం అవమానాలకు గురిచేస్తూ బీసీలను ఏమి ఉద్ధరిస్తారని ఆ పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సహా ఏ ఒక్క సామాజికవర్గానికి టీడీపీలో గౌరవం లేదని విమర్శించారు. టీడీపీలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానిదేనని ఆరోపించారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు వెన్ను పోటు పొడిచి పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్‌కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు.

చదవండి: (ఇది నిప్పుతో చెలగాటమాడటమే.. ప్రతిపక్షాలకు మంత్రి కొట్టు హెచ్చరిక)

మరిన్ని వార్తలు