కూన అండ్‌ కో.. దొరికింది దోచుకో! 

14 Sep, 2021 20:57 IST|Sakshi
సింగూరు రెల్లుగెడ్డ బెర్ముపై కోరేసిన రోడ్డు   

రహదారుల నిర్మాణాల్లో కూన రవి అండ్‌ కో అక్రమ దందా

నాణ్యత లేని రోడ్లు వేసి రూ.కోట్లు కూడబెట్టిన నాయకులు

అవస్థలు పడుతున్న ప్రజలు  

సాక్షి, శ్రీకాకుళం : అధికారం దక్కింది అక్రమాల కోసమే అన్నట్టు ఐదేళ్ల పాటు టీడీపీ నాయకులు సాగించిన అవినీతి యజ్ఞం ప్రజల పాలిట శాపంగా మారింది. వారి హయాంలో జరిగిన పనుల వల్ల ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అమదాలవలస నియోజకవర్గంలో కూన రవికుమార్‌ ఫ్యామిలీ దందా ఏ స్థాయిలో జరిగిందో అక్కడి పనులే చెబుతున్నాయి. నాసిరకం పనులతో రూ.కోట్లు వెనకేసుకుని ఇప్పుడు అధికార పక్షంపై విమర్శలకు దిగుతున్నారు. 

పనుల్లో కొన్ని.. 
విపత్తు నివారణ పథకం కింద బొడ్డేపల్లి జెడ్పీ రోడ్డు నుంచి సింగూరు మీదుగా ఎన్‌హెచ్‌–5 రోడ్డు వరకు రూ. 2.73కోట్ల  నిధులుతో తారు రోడ్డు వేశారు. ఈ రోడ్డు సింగూరు వద్ద రెల్లుగెడ్డ గట్టుమీదుగా వెళ్తుంది. నాసిరకంగా పనులు చేపట్టడంతో రోడ్డు ఒక భాగం ఏకంగా కూలిపోయింది. కూన రవికుమార్‌ సోదరుడు విజయలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత కూన వెంకట సత్యనారాయణ ఈ పనులు చేపట్టారు.
చదవండి: వామ్మో.. ఒకేచోట 100కుపైగా పాములు

కింతలి నుంచి సీపన్నాయుడు పేట వరకు రూ.4 కోట్లు నాబార్డ్‌ నిధులతో రోడ్డు పనులు చేశారు. ఈ పనుల కాంట్రాక్ట్‌ను కూన రవికుమార్‌ సోదరుడు వెంకట సత్యనారాయణ దక్కించుకున్నాడు. నాసిరకం పనులు చేయడంతో రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది.  పొందూరు గ్రామంలో జమాల్‌ మిల్లు నుంచి కళాశాల రోడ్డులోని అమ్మాజమ్మ టిఫిన్‌ దుకాణం వరకు కుడి వైపు రూ.45 లక్షలతో సుమారు వెయ్యి మీటర్లు పొడవున కాలువలను నిర్మించారు. దీని కాంట్రాక్ట్‌ను కూన సోదరుడే దక్కించుకున్నాడు. ఈ కాలువలపై పలకలను వేయలేదు. సరిగా నిర్మాణం జరగకపోవడంతో నీరు ఎక్కడ పడితే అక్కడే నిలిచిపోయి బురదగా మారిపోతోంది. 


రాపాక నుంచి దళ్లవలస మీదుగా కింతలి వరకు రూ.7కోట్ల ఆర్‌ఐడీఎఫ్‌ నిధులతో రోడ్డు నిర్మించారు. కూన రవి కుమార్‌ సోదరుడు వెంకట సత్యనారాయణ ఈ రోడ్డు కాంట్రాక్ట్‌ను తీసుకున్నారు. నాసిరకం పనులు చేపట్టడంతో ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు శిథిలమైపోవడంతో ఇటీవలే ప్యాచ్‌వర్కులు చేశారు. కొత్తగా మరికొన్ని చోట్ల గోతులు ఏర్పడ్డాయి.  
చదవండి: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు: సీఎం జగన్‌

వాండ్రంగి కూడలి నుంచి జోగన్నపేట వరకు రోడ్డు, కాలువల నిర్మాణానికి రూ.4 కోట్లు నిధులు మంజూరయ్యాయి. దీని కాంట్రాక్ట్‌ను కూన రవికుమార్‌ సోదరుడే దక్కించుకున్నాడు. 2018–19లో అర్ధంతరంగా పనులు నిలుపుదల చేసారు. ఇంకా 200 మీటర్లు మేరకు రోడ్డును జోగన్నపేట వద్ద వేయాల్సి ఉంది. కాలువలను పూర్తి చేయలేదు. కొన్ని చోట్ల కాలువలు పూడుకుపోయాయి. అరకొరగా నిర్మించిన కాలువలపై పలకలను వేయలేదు. జరిగిన పనులు కూడా బాగాలేవు. కొంతమేర బిల్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ చేసినవి కూడా నాసిరకం పనులే. 

ఇలా చేసిన ప్రతి పనిలోనూ అక్రమాలు కనిపిస్తూనే ఉన్నాయి. నియోజకవర్గంలో వేసిన ప్రతి రోడ్డు వాళ్లే వేశారు. ఏ కాంట్రాక్ట్‌నైనా వాళ్లే చేయాలి. వారికే దక్కాలి. ఇతరులకు కాంట్రాక్ట్‌లు దక్కిన సందర్భాలు తక్కువే. అంతా వారి కనుసన్నల్లోనే జరిగింది. టెండర్ల ప్రక్రియ నామమాత్రమే. అంతా వారి చెప్పినట్టే జరిగేవి. అధికార వర్గాలు సైతం వంతపాడాయి. సాధారణంగా టెండర్లలో అన్నీ వర్గాలు పాల్గొనాలి. ఎవరు తక్కువ కోట్‌ చేస్తే వారికి దక్కాలి. కానీ ఇక్కడ టెండర్ల వేయడమే అధికారుల వంతు. ఎవరికి దక్కాలో నిర్ణయించేదంతా టీడీపీ పెద్దలదే. ఎవరెక్కడ టెండర్‌ వేయాలో నిర్ణయించేది వీళ్లే. అంతా ఒక సిండికేట్‌గా తయారై గూడు పుఠాణి నడిపారు. మొత్తానికి మంజూరైన పనులన్నీ వారే దక్కించుకుని ఆ పనుల్లో కోట్లు కొల్లగొట్టారు. నాసిరకం పనులు చేసి ప్రజాధనాన్ని దోచేశారు. ఇప్పుడా పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పక్షంపై విమర్శలకు దిగుతున్నారు.  

మరిన్ని వార్తలు