నేను మూర్ఖుడిని 

29 Jan, 2023 04:45 IST|Sakshi

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ 

మా వారిపై కేసులు పెట్టిన అధికారులను వదిలిపెట్టం 

మేము కుప్పానికి పరిశ్రమలు తెచ్చాం 

శాంతిపురం (చిత్తూరు జిల్లా): తాను మూర్ఖుడినని, తమ వారిపై కేసులు పెట్టిన అధికారులను వదలిపెట్టేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చెప్పారు. చక్రవడ్డీతో కలిపి రుణం తీర్చుకుంటామని అన్నారు. భయం తమ బ్లడ్‌లోనే లేదని అన్నారు. కేసులకు భయపడకుండా పోరాటం చేయాలని పార్టీ కార్యకర్తలకు చెప్పారు.

లోకేశ్‌ యువగళం పాదయాత్ర శనివారం ఉదయం గుడుపల్లె మండలంలోని పీఈఎస్‌ ఆస్పత్రి వద్ద ప్రారంభమై సాయంత్రం శాంతిపురం మండలంలోని టి.కొత్తూరు క్రాస్‌ వద్ద ముగిసింది.

ఆయన టీడీపీకి చెందిన కురబ, బీసీ నాయకుల సమావేశాల్లో, పలుచోట్ల రోడ్లపై మాట్లాడారు. తమ హయాంలో కుప్పంలో పరిశ్రమలు తెచ్చామని, 25వేల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక బీసీల కుల వృత్తులకు కావాల్సిన పరికరాలు ఇస్తామని, తొలి ఏడాదిలోనే అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని అన్నారు.

వ్యవసాయ బోర్లకు మీటర్ల పేరుతో రైతులకు ఉరి వేస్తున్నారని, అకౌంట్లలో వేస్తామన్న బిల్లు సొమ్ము గ్యాస్‌ సబ్సిడీలాగా తగ్గిపోతోందని విమర్శించారు. 80శాతం రైతులకు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.  

మరిన్ని వార్తలు