Nara Lokesh: చిత్తూరు జిల్లా జైలు బయట రెచ్చిపోయిన లోకేశ్‌

31 Aug, 2022 04:53 IST|Sakshi
చిత్తూరులో లోకేశ్‌ కాన్వాయ్‌ చుట్టూ కనిపించని జనం

చిత్తూరు అర్బన్‌/పూతలపట్టు (యాదమరి): రెచ్చగొట్టే మాటలు, పరుష పదజాలంతో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ నోటికొచ్చినట్టు మాట్లాడారు. చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకరలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడి చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లతో ములాఖత్‌ కోసం బుధవారం చిత్తూరు నగరంలోని జిల్లా జైలుకు నారా లోకేశ్‌తో పాటు ఆ పార్టీ నేతలు చినరాజప్ప, అనిత, దొరబాబు, వసంత్‌ తదితరులు వచ్చారు.

రిమాండ్‌ ఖైదీలతో దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన లోకేశ్‌ జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ‘చిత్తూరు ఎస్పీ అండతోనే వైసీపీ కుక్కలు రెచ్చిపోయాయి. యుద్ధం మొదలైంది. ఇంకా వాళ్లను తన్ని మరో పది మంది జైలుకు రండి. నేనున్నా.. చూసుకుంటా. నేను పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్నప్పుడు కుప్పానికి రూ.300 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశాను. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఆరేళ్లు ఉన్నప్పుడు కూడా కుప్పంలో ఇటువంటి ఘటనలు జరగలేదు’ అంటూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారు.

కాగా, మంగళవారం సాయంత్రం పూతలపట్టు మండలం వేపనపల్లె గ్రామంలో జైలు పాలైన వారి కుటుంబ సభ్యులను, టీడీపీ నాయకులను లోకేశ్‌ పరామర్శించారు. మాట్లాడుతూ టీడీపీ నాయకులపై దాడులు చేస్తున్న వారిపై కచ్చితంగా కసి తీర్చుకుంటామని హెచ్చరించారు. టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని, వారికి పోలీసులు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు