కులం మీద బతికేవాడు అయ్యన్నపాత్రుడు 

13 Feb, 2023 03:22 IST|Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రెబల్‌గా పోటీకి దిగుతున్నా..

టీడీపీ సీనియర్‌ నేత ఈర్లె శ్రీరామ్మూర్తి  

సాక్షి,అనకాపల్లి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వెలమ కుల ద్రోహి అని టీడీపీ సీనియర్‌ నేత, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడుతున్న టీడీపీ రెబల్‌ అభ్యర్థి ఈర్లె శ్రీరామ్మూర్తి విమర్శించారు. కులం కోసం కాదు.. కులం మీద బతికేవాడే అయ్యన్నపాత్రుడు అని, తాను తప్ప ఎవరూ ఎదగకూడదని అనుకునే వాడని మండిపడ్డారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు.

ఆదివారం అనకాపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 2018లో రెవెన్యూ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీకి సేవలు చేస్తున్నానని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన తనకు గతంలో చంద్రబాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని.. కానీ మాట తప్పారని ధ్వజమెత్తారు. బీసీ కులాలంటే టీడీపీ అధిష్టానానికి గౌరవం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

తనకు ఉపాధ్యాయ సంఘాలు, పట్టభద్రులతో మంచి సన్నిహితం ఉందని, టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గానైనా నామినేషన్‌ వేసి గెలుస్తానని శ్రీరామ్మూర్తి ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉంటాననే అక్కసుతోనే అయ్యన్నపాత్రుడు అడుగడుగునా తనపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు.  

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండ­లం అల్లిపూడి అయ్యన్నపాత్రుడి స్వగ్రామ­మని, ఆయనది ఉత్తరాంధ్ర కాదని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వలస నేతలు పాలిస్తున్నారనే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అయ్యన్నకు ఆ అర్హత లేదన్నారు.    

మరిన్ని వార్తలు