అది చంద్రబాబు కుట్రే

15 Mar, 2022 04:31 IST|Sakshi

ఆయన దర్శకత్వంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించారు

కాగితాలు చించి స్పీకర్‌పై విసరడం తీవ్ర అభ్యంతరకరం

శాసనసభ, శాసన మండలిలో టీడీపీ సభ్యులు సోమవారం వ్యవహరించిన తీరును పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి శాసనసభలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌పై కాగితాలు చించి విసరడం తీవ్ర అభ్యంతరకర చర్య అని ఖండించారు. సభల నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు.
– సాక్షి, అమరావతి

ప్రోత్సహించింది చంద్రబాబే! 
టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి బీసీ వర్గానికి చెందిన స్పీకర్‌పైకి విసరడం సిగ్గుచేటు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, రూ.వేల కోట్ల ఆదాయాన్ని వదులుకుని మద్య నిషేధం దిశగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంస్కరణలు చేస్తున్నారు. మద్యాన్ని బాగా అమ్మే ఆధికారులకు చంద్రబాబు ప్రమోషన్లు ఇచ్చారు. వేలాదిగా బెల్టు షాపులు పెట్టించి, మద్యపానాన్ని ప్రోత్సహించారు. గుడి, బడి అని లేకుండా దుకాణాలు పెట్టించి చాలా కుటుంబాలను నాశనం చేశారు. జంగారెడ్డిగూడెంలో ఇద్దరు పచ్చి తాగుబోతులు చనిపోతే కల్తీ సారా అంటున్నారు. రాష్ట్రంలో సారా అసలు ఎక్కడుంది. కేవలం సభల నుంచి సస్పెండ్‌ చేయించుకుని జంగారెడ్డిగూడెం వెళ్లి శవరాజకీయాలు చేయాలనే కుట్ర, కుతంత్రంతో సభా సమయాన్ని వృథా చేశారు. 
– సామినేని ఉదయభాను, ప్రభుత్వ విప్‌

ప్రజలు ఛీకొట్టేలా టీడీపీ ప్రవర్తన
టీడీపీ చర్యలు ప్రజలు ఛీకొట్టేలా ఉన్నాయి. సహజ మరణాలను కూడా రాజకీయం చేస్తున్నారు. 40 వేల బెల్టు షాపులు పెట్టి మహిళల మంగళ సూత్రాలు తెగేలా చేశారు. ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ మూడేళ్లుగా సీఎం జగన్‌ జనరంజక పాలన చేస్తున్నారు. ప్రజలకు ఇంకా ఏం కావాలో ప్రశ్నోత్తరాల సమయంలో అడగాల్సిందిపోయి ప్రభుత్వంపై బురద జల్లడమే పరమావధిగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారు. 
– కొరముట్ల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్‌

చంద్రబాబు కోమా.. వాళ్ల నేతల డ్రామా 
ఎవరు చస్తారా రాజకీయం చేద్దామా అనే ప్రతిపక్షం మన రాష్ట్రంలో ఉంది. టీడీపీ హయాంలో ఎన్ని మద్యం దుకాణాలున్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో ఎన్ని ఉన్నాయనే గణాంకాలపై చర్చకు రమ్మంటే రారు. జంగారెడ్డిగూడెంలో సాధారణ మరణాలను కల్తీ మద్యం చావులుగా చూపించాలనుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయంగా కోమాలోకి వెళ్లిపోయారు. వారి నేతలు సభల్లో డ్రామాలు ఆడుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కావాలనే ఆటంకపరిచారు.     
– కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే

టీడీపీ తీరు సమంజసంగా లేదు
జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక వేరే ఫార్మాట్‌లో టీడీపీ సభ్యులు రావాల్సింది. కానీ వారు అలా చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన తీరు సమంజసంగా లేదు. ఏపీలో 164 మోడల్‌ స్కూళ్లలో 2,600 మంది ఉపాధ్యాయులున్నారు. వారికి సర్వీస్‌ రూల్స్‌ ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పాలి. నాడు–నేడు కోసం వేసవిలో పనిచేసిన హెడ్‌ మాస్టర్లకు సంపాదిత సెలవు ఇవ్వాలి. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి రెగ్యులర్‌ జీతాలు వర్తింపజేయాలి.
– కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ 

>
మరిన్ని వార్తలు