టీడీపీ సెల్ఫ్‌గోల్‌: చీప్‌ ట్రిక్స్‌తో పోరాటం

12 Dec, 2020 10:29 IST|Sakshi

ప్రజల మనసులో స్థానం సంపాదించుకునేందుకు ప్రజాపోరాటం ఎంచుకోవడం ఓ మార్గం. బలమైన వ్యక్తులను ఢీకొన్నట్లుగా ప్రగల్భాలు పలుకుతూ ప్రత్యామ్నాయంగా సెల్ఫ్‌గోల్‌ కొట్టడం మరో ఎత్తుగడ. మొదటి కోవకు చెందిన నాయకులు సుస్థిర స్థానం సొంతం చేసుకోగా, రెండో మార్గంలో ఉన్నవారు చీప్‌ట్రిక్స్‌తో కాలం గడపడం సర్వసాధారణం. అచ్చం అలాంటి వ్యవహారమే తెలుగుదేశం పార్టీలో తెరపైకి వస్తోంది. ఉనికి కోసం ఆరాటపడుతూ చీప్‌ ట్రిక్స్‌తో పోరాటం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.   

సాక్షి, తిరుపతి: రాజంపేట పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జిగా శ్రీనివాసులురెడ్డి నియమాకం అయ్యాక, ఆ పార్టీ ఉన్నతికి కృషి చేస్తున్నట్లుగా కలరింగ్‌ ఇవ్వడంలో సఫలీకృతులయ్యారు. టీడీపీ శ్రేణులను ఉత్తేజపర్చేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ వ్యక్తిగత ఆరోపణలతో కూడిన దూషణలకు దిగారు. క్రమం తప్పకుండా టీడీపీ నిరాధార ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి వర్గీయుల నుంచి ఆవేదన వ్యక్తమైంది.  ఆరోపణలు రుజువు చేయాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ శ్రేణుల నుంచి డిమాండ్‌ వ్యక్తమైంది. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక ఆయన ఉద్రిక్తత ఘటనను ప్రేరేపితం చేశారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  

తంబళ్లపల్లెలో ఉనికి కనుమరుగు  
ఎన్నికల తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉనికి కరువైంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన కారణంగా టీడీపీ జవసత్వాలను కోల్పోయింది. ఈక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి శంకర్‌యాదవ్‌ సైతం బెంగళూరులో స్థిరపడ్డారు. జీవం లేని పార్టీకి ఊపు తేవాలనే తలంపుతో ఏకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. శుక్రవారం టీడీపీ నాయకులు పర్యటనను దృష్టిలో ఉంచుకుని కొంతమంది వ్యక్తులు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేయాలి, లేదంటే క్షమాపణ చెప్పాలంటూ నినదించారు. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు ముందుగా దాడికి సిద్ధమైనట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. టీడీపీ చర్యలను ప్రతిఘటించారు. ఆపై అక్కడ నిర్మాణంలో ఉన్న ఇటుకలను ఇరుపక్షాలు విసురుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. దీనిపై రాష్ట్రస్థాయి టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేయడం మొదలుపెట్టారు. స్వల్ప ఘటనలు సైతం తమకు అనుకూలంగా మల్చుకొని ఆర్భాటపు యాగీ చేయ డం టీడీపీ వంతైంది. 

కట్టడి చేసిన పోలీసులు  
అంగళ్లు వద్ద  ఉద్రిక్తత పరిస్థితులను నియంత్రించడంలో పోలీసు యంత్రాంగం సఫలీకృతమైంది. ఇరు పార్టీల  రాస్తారోకోతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఇరువర్గాలను శాంతింపజేశారు. ముందస్తుగా చట్టపరమైన చర్యలు చేపట్టారు. కాగా, తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులంతా పోలీసు వ్యవస్థనే టార్గెట్‌ చేస్తూ ఆరోపణలు గుప్పించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు