టీడీపీలో ఆధిపత్య పోరు.. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి 

29 Sep, 2022 11:10 IST|Sakshi

ఇన్‌చార్జిలను ఓవర్‌టేక్‌ చేస్తూ సీనియర్ల కార్యక్రమాలు 

నియోజకవర్గ బాధ్యులు పనిచేయడం లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదులు 

తిరుగుబాటు నేతలపై వేటుకు ఇన్‌చార్జిల ఒత్తిళ్లు 

టిక్కెట్‌ నాకంటే నాకంటూ ప్రచారం 

వర్గాలుగా విడిపోయిన క్యాడర్‌ 

సాక్షి, కడప: తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు రోడ్డెక్కింది. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఆ పార్టీ సీనియర్‌ నేతలకు మధ్య “పచ్చ’గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సీనియర్‌ నేతలు తమను ఓవర్‌ టేక్‌ చేసి ఏకపక్షంగా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా తాము పనిచేయడం లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆరోపిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో టిక్కెట్‌ తమకేనంటూ సీనియర్లు ప్రచారం చేయడమే కాకుండా తమకు వ్యతిరేకంగా వర్గాన్ని కూడగడుతున్నారని ఇన్‌చార్జిలు ధ్వజమెత్తుతున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రధానంగా కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప నియోజకవర్గాల్లో ఆ పార్టీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. అసలే వైఎస్సార్‌ జిల్లాలో అంతంత మాత్రంగా  ఉన్న పార్టీలో ఉన్న కాస్త మంది నేతలు పరస్పర ఆరోపణలతో రోడ్డున పడడంతో అధిష్టానం తలలు పట్టుకుంటోంది.  

కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ, నియోజకవర్గ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డిల మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఇరువురికి ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. సాయినాథ్‌కు రాష్ట్రస్థాయి పదవి ఇవ్వడాన్ని పుత్తా జీర్ణించుకోలేకపోయారు. పైపెచ్చు సాయినాథ్‌శర్మ పుత్తాను పరిగణనలోకి తీసుకోకుండా సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తాజాగా కమలాపురం టీడీపీ టిక్కెట్‌ ఆశిస్తున్న వీరశివారెడ్డితో చేయి కలిపారు. ఇద్దరూ నిత్యం సమావేశమవుతున్నారు. ఇది పుత్తాకు మింగుడు పడలేదు. దీంతో సాయినాథ్‌శర్మ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని పుత్తా అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. ఎట్టకేలకు అధిష్టానం మంగళవారం సాయినాథ్‌శర్మను పార్టీ రాష్ట్ర పదవి నుంచి తొలగించింది. పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న సాయినాథ్‌శర్మను పదవి నుంచి తొలగించడం సరికాదని, ఆయన వర్గం అధిష్టానాన్ని తప్పుబడుతోంది.  

ఇక మైదుకూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ ఆవిర్భావం నుంచి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పార్టీలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దీన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం ఆయనకు పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పదవి కట్టబెట్టింది. అయితే రెడ్యం వెంకట సుబ్బారెడ్డికి, నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు మధ్య   పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రెడ్యం తన గెలుపు కోసం పనిచేయలేదని పుట్టా ఆరోపిస్తుంటే, పుట్టా మైదుకూరు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం అసలు పనిచేయడం లేదని రెడ్యం ప్రత్యారోపణలు చేస్తున్నారు. రెడ్యంను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని సుధాకర్‌యాదవ్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం రెడ్యంను అధిష్టానం పార్టీ పదవి నుంచి తొలగించింది. పనిచేస్తున్న వారికే గుర్తింపు అని చెబుతున్న చంద్రబాబు, పార్టీ కోసం పనిచేస్తున్న రెడ్యంను పార్టీ నుంచి తొలగించడం సరికాదని ఆయన వర్గం ఆరోపిస్తోంది.  

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ పార్టీలో వర్గ విభేదాలు ఇటీవల కాలంలో పతాక స్థాయికి చేరాయి. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న తనకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ అని నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు కూడా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. నూటికి లక్షసార్లు టిక్కెట్‌ తనకేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి మరీ తేల్చి చెప్పారు. అటు లింగారెడ్డి, ఇటు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ఈసారి ఎన్నికల్లో టిక్కెట్‌ తమకేనంటూ మరోవైపు వరద రాజులురెడ్డి వర్గం వాదిస్తోంది. దీంతో కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. 

ఇక కడప నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి చెందిన అమీర్‌బాబు ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్‌ తనకేనని ఆయన చెబుతున్నారు. ఈ దఫా ఎన్నికల్లో కడప టిక్కెట్‌ మైనార్టీలకు కాకుండా నాన్‌ మైనార్టీలకు ఇవ్వాలని టీడీపీలోని మరో వర్గం డిమాండ్‌ చేస్తోంది. ఇదే జరిగితే తమకే టిక్కెట్‌ అంటూ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, సీనియర్‌ నాయకులు ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డిలు ప్రచారం చేస్తున్నారు. శ్రీనివాసులురెడ్డి రాబోయే ఎన్నికల్లో కడప పార్లమెంటు అభ్యర్థిగా ఉంటారని అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. అయితే తాను పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలంటే కడప టిక్కెట్‌ తన సతీమణికి ఇవ్వాలని శ్రీనివాసులురెడ్డి మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడప టిక్కెట్‌ను ఆశిస్తున్న లక్ష్మిరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై అలక బూనినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరుపున లక్ష్మిరెడ్డి కోడలు పోటీలో ఉంటుందని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. దీంతో కడపలో ఉన్న కాస్త క్యాడర్‌ వర్గాలుగా చీలిపోయింది. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పచ్చ పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి.  

మరిన్ని వార్తలు