Sathya Sai District: వర్గపోరుతో సై‘కిల్‌’.. దిగజారుతున్న టీడీపీ పరిస్థితి

3 Jun, 2022 14:51 IST|Sakshi

జిల్లాలో తమ్ముళ్ల తలోదారి 

ప్రతి నియోజకవర్గంలో సొంత పార్టీలోనే ప్రత్యర్థులు 

పల్లెకు పొమ్మన లేక పొగ.. సూరికి సెగ 

మడకశిరలో కుమ్ములాటలతో విసుగెత్తిన తమ్ముళ్లు 

పత్తాలేని బాలకృష్ణతో విసిగిపోయిన ‘పురం’ పసుపుదళం  

కదిరిలో కందికుంటకు చెక్‌పెట్టేందుకు అత్తార్‌ పావులు 

పెనుకొండలో బీకే, సబిత మధ్య పోటాపోటీ 

వర్గపోరుతో ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని కార్యకర్తలు  

టికెట్‌ నాదే... అంతా నేనే. ఎవరొచ్చినా మన తర్వాతే. టీడీపీలో ప్రతి నాయకుడూ అనుచర వర్గానికీ, కార్యకర్తలకు చెబుతున్న మాటలివి. దీంతో ఎవరి వెంట నడవాలో తెలియని తమ్ముళ్లు తలోదారి పట్టారు. ఫలితంగా శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాయకులంతా వర్గపోరు రాజేస్తుండగా... కార్యకర్తలు జెండా పక్కనపెట్టి మిన్నకుండిపోయారు. 

సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి: కొత్తగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీని కాపాడే నాయకుడు కరువయ్యారు. నేతల నడుమ వర్గపోరుతో కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులు, ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. దీంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. భారీ స్థాయిలో మహానాడు నిర్వహించి శ్రేణుల్లో ఉత్తేజం నింపామని రాష్ట్ర నాయకత్వం చెబుతున్నా.. ఇక్కడ మాత్రం కార్యకర్తలంతా నిస్తేజంలో ఉండిపోయారు. సొంతపార్టీలోనే వేరు కుంపట్లు రాజుకుంటుండగా కార్యకర్తలు ఏ కుంపటి దగ్గర చలికాచుకోవాలో అర్థం కాని పరిస్థితి. 

పల్లెకు పొగ పెట్టిన సైకం.. 
పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సొంత పార్టీకే చెందిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పల్లె రఘునాథరెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా చేయడానికి గట్టిగా పోరాడుతున్నారు. ఆయనకు టికెట్‌ ఇస్తే ఓడిపోతాడని బహిరంగంగానే చెబుతున్నారు. పైగా తన అనుచరుడు సైకం శ్రీనివాసరెడ్డికి టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అధిష్టానం నిర్వహించిన సర్వేలోనూ పల్లె బాగా వెనుకబడ్డారని తేలింది. దీంతో పాటు పల్లె రఘునాథరెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేక ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు సైతం ఆయన్ను వెంటాడుతున్నాయి. దీంతో సొంతపార్టీలోనే పల్లె ఒంటరిగా మిగిలిపోయారు. చివరకు సీఎంను విమర్శిస్తేనైనా చంద్రబాబు మెప్పు పొందచ్చునేమోనన్న ఆశతో ఆయన తన స్థాయిని మించి విమర్శలు చేస్తుండగా... నియోజకవర్గ ప్రజలు ఈయనపై సెటైర్లు వేస్తున్నారు. 

చదవండి: (టీడీపీలో మహిళలకు గౌరవం లేదు)

ధర్మవరంలో సూరికి సెగ.. 
భూదందాల్లో ఆరితేరిన వరదాపురం సూరికి ధర్మవరంలో నిరసన సెగ తగలుతోంది. 2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూరి బీజేపీలో చేరారు. తిరిగి ఇప్పుడు పచ్చజెండా కప్పుకోవాలని చూస్తుండగా... సూరీని ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదని పరిటాల శ్రీరామ్‌ సవాల్‌ విసిరారు. కండువా కప్పుకోవాలంటే ‘నేనే కండువా వెయ్యాలి, ఇలాంటి వారు వస్తుంటారు పోతుంటారు’ అని శ్రీరామ్‌ విమర్శించారు. దీంతో అక్కడ టీడీపీ నాయకుడెవరో కార్యకర్తలకు అర్థం కాక ఇప్పటికే మెజార్టీ కేడర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లింది. మిగిలిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 

కదిరిలో కందికుంటకు చెక్‌.. 
చెక్‌బౌన్స్‌ కేసులో శిక్ష పడిన మాజీ ఎమ్మెల్యే కందికుంట పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. కదిరిలో టీడీపీ కేడర్‌ అత్తర్‌ చాంద్‌బాషా, కందికుంట వర్గాలుగా విడిపోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. చాంద్‌బాషా 2014లో వైఎస్సార్‌ సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లారు. ఇదే సమయంలో కందికుంటపై కేసులు నమోదయ్యాయి. దీంతో కందికుంట పక్కన పెట్టిన టీడీపీ కేడర్‌... అత్తార్‌ వైపు కూడా నడవలేక    పోతోంది. గెలిపించిన పార్టీని మోసం చేసి టీడీపీలోకి వెళ్లారని సొంత సామాజికవర్గమే అత్తార్‌పై గుర్రుగా ఉండగా.. కదిరి తెలుగు తమ్ముళ్లు ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. 

బీకేకు దీటుగా సబిత .. 
పెనుకొండలో బీకే పార్థసారధి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పార్టీ కార్యక్రమాలు సరిగా చేయడం లేదని ఇప్పటికే ఆయనపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు మాజీమంత్రి రామచంద్రారెడ్డి కూతురు సబిత ఇక్కడ టీడీపీ టికెట్‌ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వర్గాన్ని కూడగడుతున్నారు. కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలు బీకేకు తలనొప్పిగా మారాయి. అసలు బీకేకు టికెట్‌ వస్తుందో రాదోనన్న పరిస్థితి నెలకొంది.  

చదవండి: (చిరంజీవి పొలిటికల్‌ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు)

మడకశిరలో ఎవరికి వారే.. 
మడకశిరలో వింతపరిస్థితి. 2019లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిన ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఉప్పూ నిప్పులా మారారు. దీంతో కార్యకర్తలూ రెండు వర్గాలుగా విడిపోయారు. ఏ కార్యక్రమమైనా వేర్వేరుగా జరుపుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఒక వర్గానికి టికెట్‌ ఇస్తే మరో వర్గం ఓట్లు వేసే పరిస్థితి లేదు. అధిష్టానం ఇరువురినీ పిలిపించి రాజీ చేసినా తెల్లారేసరికి మళ్లీ గ్రూపులుగా విడిపోయారు. ఇలా వర్గపోరుతో కేడర్‌ మడకశిరలో ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయింది. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలూ ప్రభుత్వ పథకాలపై ఆకర్షితులవుతుండగా.. వారిని కాపాడుకోవడం తలకుమించిన భారమైంది.

బాలయ్యను మర్చిపోయిన ‘పురం’వాసులు.. 
రెండున్నర దశాబ్దాలుగా ఎన్టీఆర్‌ కుటుంబానికి హిందూపురం ప్రజలు పట్టం కడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణను గెలిపించినా ఏడాదికి ఒకసారి కూడా ఆయన హిందూపురం నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు వర్గం, పార్టీ అనేది లేకుండా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో హిందూపురంలో అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో నియోజకవర్గ జనం ఎమ్మెల్యే బాలకృష్ణను పూర్తిగా మర్చిపోయారు. ఈ సారి అందుబాటులో ఉండేవారికి ఓటేస్తే బావుంటుందన్న ఆలోచన ఉన్నారు. ఇదే జరిగితే ఈసారి హిందూపురంలోనూ టీడీపీకి గల్లంతు ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

మరిన్ని వార్తలు