టీడీపీలో ‘చిచ్చు’ బుడ్డి

14 Nov, 2020 10:22 IST|Sakshi

నగరంపై పట్టు కోసం పాకులాట

అంతర్గత పోరులో ఎవరికి వారు వ్యూహాలు

ప్రభాకర్‌ వర్గీయులను దగ్గరకు తీస్తున్న జేసీ పవన్‌

వరుస భేటీలతో విందు రాజకీయాలు

జేసీని డమ్మీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న ప్రభాకర్‌

అధికారంలో ఉన్నన్నాళ్లూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఆధిపత్యం కోసమే గొడవపడిన టీడీపీ నేతలు.. ప్రతిపక్షంలోనూ అదే బాటలో పయనిస్తున్నారు. అనంతపురంలో పట్టుకోసం అటు వైకుంఠం, ఇటు జేసీ పాకులాడుతుండగా కేడర్‌ రెండు వర్గాలుగా చీలిపోయింది. విందు రాజకీయాలతో జేసీ పవన్‌ ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తుండగా.. వైకుంఠం తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.  

సాక్షి , అనంతపురం: ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు దీపావళి తారజువ్వలా ఎగసిపడుతోంది. జేసీ, వైకుంఠం వర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. నేతలిద్దరూ కేడర్‌తో మంతనాలు జరుపుతూ ఎగదోస్తుండగా.. వర్గపోరు వంకాయ బాంబులా ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధమైంది. దీపావళికి పచ్చపార్టీలో రేగిన ‘చిచ్చు’ బుడ్డి ఎవరి కొంప ముంచుతుందోననే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ( చదవండి: మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా పై కన్నేసిన టీడీపీ నేతలు )

ఆది నుంచీ విభేదాలే... 
జేసీ కుటుంబం టీడీపీలో చేరడం కూడా వైకుంఠానికి ఇష్టం లేదు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో నోరుమెదపలేకపోయారు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా జేసీ కుటుంబానికి ఎదురు నిలుస్తున్నారు. ఒకే పార్టీలో ఉన్నా.. కేడర్‌ను రెండుగా చీల్చి రాజకీయం నడుపుతున్నారు. రెండు వర్గాల మధ్య విభేదాలు ప్రారంభం నుంచీ ఉన్నా.. ప్రధానంగా అనంతపురం నగరంలోని రోడ్డు వెడల్పు విషయంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. జేసీ దివాకర్‌ రెడ్డి ఒక అడుగు ముందుకేసి పార్టీ వీడతారనే దాకా ప్రచారం సాగింది. అంతిమంగా రోడ్డు వెడల్పు కోసం ఉత్తర్వులు కూడా జారీ చేయించుకున్నారు. కానీ అంతకుమించి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. దీని వెనుక ప్రభాకర్‌ చౌదరి మంత్రాంగం నడిపారనే ప్రచారం ఉంది. రోడ్డు వెడల్పు పనులు జరగకుండా వ్యాపారులను ఎగదోసి అడ్డుకున్నారనే ప్రచారం కూడా సాగింది.  

రాంనగర్‌ బ్రిడ్జి విషయంలోనూ మనస్పర్థలు.. 
నగరంలోని రాంనగర్‌ బ్రిడ్జి వెడల్పు కుదించే విషయంలో కూడా జేసీ, వైకుంఠం మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ బ్రిడ్జిని కూడా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా అప్పట్లో ఎంపీ హోదాలో జేసీ ప్రారంభించారు. ఎన్నికల సమయంలోనూ ఇరువురి మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఇప్పుడు ఇరువురూ ఓడిపోయిన తర్వాత.. ఒక కేసు విషయంలో జేసీ దివాకర్‌రెడ్డి అరెస్టయి నగరంలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఉండగా.. అటువైపు కన్నెత్తి చూడవద్దని తన అనుచరులనే కాకుండా పార్టీ నేతలను కూడా వైకుంఠం కట్టడి చేశారని సమాచారం. అంతేకాకుండా నిరసనల ఊసే లేకుండా చేయగలిగారనే చర్చ కొనసాగుతోంది. తద్వారా జేసీకి నగరంలో కనీస పట్టు లేదనే భావన  వచ్చేలా చేయగలిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రభాకర్‌చౌదరిని దెబ్బకొట్టేందుకు జేసీ పవన్‌ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

నేరుగా భేటీలు.. విందులు! 
వైకుంఠంతో వర్గపోరు నడుస్తున్న నేపథ్యంలో జేసీ కుటుంబం నగరంలో పాగా వేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభాకర్‌ చౌదరికి దగ్గరగా ఉన్న నేతలతో జేసీ పవన్‌ గత 15 రోజులుగా 2–3 సార్లు భేటీ అయ్యారు. అంతేకాకుండా విందు సమావేశాలు కూడా నిర్వహించారు. టౌన్‌ బ్యాంకు మాజీ అధ్యక్షుడు జేఎల్‌ మురళితో పాటు కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ రాయల్‌ మురళి, టీడీపీ బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు మధుసూదన్‌ గౌడ్,  టీడీపీ జిల్లా కార్యదర్శి సద్దల చెన్నప్ప, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు డేరంగులు వెంకటాద్రి, కో–ఆప్షన్‌ మెంబర్‌ కృష్ణమకుమార్, మాజీ కార్పొరేటర్లు రంగమ్మ, ఉమామహేశ్వరనాయుడు, విద్యాసాగర్, టీఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి మణికంఠబాబు, వాణిజ్యవిభాగం ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి తదితరులతో జేసీ పవన్‌ మంతనాలు సాగించారు.

గత 15 రోజులుగా 2–3 సార్లు సమావేశం కావడంతో పాటు విందు కూడా ఏర్పాటు చేశారు. తద్వారా నగరంలో ప్రభాకర్‌ చౌదరిని ఏకాకిని చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆ పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ తమ వర్గానికే ప్రాధాన్యత దక్కుతుందని జేసీ అనుచరులు వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా టీడీపీ పరిస్థితి దీపావళి వేళ మూడు వంకాయ బాంబులు, ఆరు లక్ష్మీ బాంబుల్లా తయారైంది. అయితే, చివరకు ఏ వర్గం బాణసంచా ఢాం అని పేలుతుందో.. ఎవరి మతాబు తుస్సుమంటుందో తేలాల్సి ఉంది. 

జేసీ పవన్‌ అంతరంగం 
ఎమ్మెల్యే వర్గాన్నంతా మనవైపు తిప్పుకోవాలి. నగరంలో పట్టుసాధించాలి. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కార్పొరేటర్‌ సీట్లు మనవాళ్లకే ఎక్కువగా ఇప్పించుకుని పైచేయి సాధించాలి. 

వైకుంఠం ప్రణాళిక 
జేసీని ఏకాకిని చేయాలి. నగరంలో వర్గమంటూ లేకుండా చూడాలి. కార్పొరేటర్‌ సీట్ల ఎంపికలోనూ మనమే సత్తా చాటాలి. జేసీ వైపు వెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేయాలి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు