వైఎస్సార్‌ సీపీలోకి పలువురు టీడీపీ నాయకులు

11 Sep, 2022 13:17 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీలో చేరుతున్న టీడీపీ నాయకులకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి 

ఒంగోలు సబర్బన్‌/ఒంగోలు: టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఒంగోలు నగరంలోని మూడో డివిజన్‌ నుంచి టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో శనివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. నగరంలోని 49వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులకు వైఎస్సార్‌ సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
చదవండి: ఇది టీడీపీ, జనసేనకు జీర్ణించుకోలేని అంశమే

టీడీపీ బూత్‌ కమిటీ కన్వీనర్, ఒంగోలు నగర కార్యనిర్వాహక కార్యదర్శి రేల రాజేంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ ఆధ్వర్యంలో మరికొంతమంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరితో పాటు 3వ డివిజన్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి ఎలియాజర్, ఎస్సీ సెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రంజిత్‌ కుమార్‌ కూడా బాలినేని సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఈ సందర్భంగా రేవల రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమంపై చూపుతున్న శ్రద్ధ ప్రతి ఒక్కరినీ వైఎస్సార్‌ సీపీవైపు ఆకర్షితులను చేస్తోందని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై అభిమానంతో ఆయనతో కలిసి పయనిద్దామనే ఆలోచనతో పార్టీలో చేరామన్నారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్‌రెడ్డిని బాలినేని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో గుండు మధు, పార్టీ నాయకులు ఎందేటి రంగారావు, మహబూబ్‌బాషా, షేక్‌ హబీబ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు