నాడు మౌనం.. నేడు విమర్శల గానం: పచ్చ నేతల నీచ రాజకీయాలు

26 Oct, 2021 09:42 IST|Sakshi

టీడీపీ హయాంలోనే నీలమణి దుర్గ ఆలయం మీదుగా హైవే విస్తరణ, ఫ్లై ఓవర్‌ పనులు మంజూరు

నాడే సర్వే చేసి కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ

వాస్తవాలు తెలిసినా విషం కక్కుతున్న తెలుగు తమ్ముళ్లు

ఫొటోలో బోర్డు చూడండి. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ షిప్పింగ్, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్, హైవేస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ హైవేస్‌ శాఖ 326(ఎ)హైవే విస్తరణ లో భాగంగా ఫ్లై ఓవర్‌ నిర్మాణం కోసమని 2018లో ఏర్పాటు చేసిన బోర్డు ఇది. 1.477 కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ. 42.43కోట్లతో ఆర్‌కే ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన కాంట్రాక్టర్‌తో కేంద్ర ప్రభుత్వం 2018 నవంబర్‌ 20న ఒప్పందం చేసుకుంది. 15 నెలల్లోగా వర్క్‌ పూర్తి చేయాలని కాల వ్యవధి నిర్ణయించింది. అంటే టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ వర్క్‌ మంజూరు చేయడమే కాకుండా కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంది.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  పాతపట్నంలో హైవే విస్తరణ, ఫ్లై ఓవర్‌ నిర్మాణం కోసం 2018 నవంబర్‌ 20వ తేదీన కాంట్రాక్టర్‌తో కేంద్ర ప్రభుత్వ సంస్థ అగ్రిమెంట్‌ చేసుకుంది. టీడీపీ హయాంలోనే వాటి కోసం సర్వేలు జరిగాయి. 15 నెలల కాలంలో పూర్తి చేయాలని ఒప్పందం జరిగింది. కరోనా కారణాలతో జాప్యం జరగడంతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఈ సర్వేలపై టీడీపీ ఎప్పుడూ నోరెత్తలేదు. ఆలయ ప్రాంగణం కూల్చాల్సి వస్తుందని తెలిసినా అభ్యంతరం చెప్పలేదు. ఆ సర్వే జరిగినప్పుడు అప్పటి టీడీపీ నేతలు క్రియాశీలకంగా వ్యవహరించారు కూడా. కానీ ఇప్పుడు మాత్రం తమకు అలవాటైన విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి ఒడిగడుతున్నారు.

ఎప్పుడూ ఇంతే..
ఈ ఏడాది జనవరిలో టెక్కలి ఆది ఆంధ్రావీధి సమీపంలో గల సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి ఆనుకుని ఉన్న పార్కులోని బుద్ధుని విగ్రహానికి ఎప్పుడో మణికట్టు చేయి విరిగిపోతే దాన్ని పట్టుకుని రాజకీయంగా వాడుకోవాలని చూశారు. అచ్చెన్న తన అనుచరులను రంగంలోకి దించి విగ్రహ రాజకీయాలతో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు పక్కా ప్లాన్‌ చేశారు.  
సంతబొమ్మాళి మండలంలో విద్వేషాలు సృష్టించేందుకు యత్నించి టీడీపీ నాయకులు అడ్డంగా బుక్‌ అయ్యారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ నాయకులు నంది విగ్రహాన్ని కూడా అపహస్యం చేశారు. గతంలో పాలేశ్వరస్వామి ఆలయంలో పాడైపోయిన నంది విగ్రహాన్ని పక్కకు తొలగించి కొత్త నంది విగ్రహాన్ని ప్రతిష్టించారు. శిథిలావస్థకు చేరిన ఆ నంది విగ్రహాన్ని తీసుకొచ్చి పాలేశ్వరస్వామి జంక్షన్‌ వద్ద గల సిమెంట్‌ దిమ్మ పై రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా ప్రతిష్టించారు.

హిందూ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా శిథిలావస్థలో ఉన్న నంది విగ్రహాన్ని ఉత్తరం దిక్కు వైపు ప్రతిష్టించేశారు. పాలేశ్వరం జంక్షన్‌లో ఉన్న నంది విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం జరగబోతుందంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా     రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. కానీ వారు తీసిన గోతిలో వారే పడ్డారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో పాత నంది విగ్రహాన్ని తరలించడం, పాలేశ్వ రస్వామి జంక్షన్‌లో దిమ్మపై అదే విగ్రహాన్ని ఏర్పా టు చేయడం తదితర బాగోతమంతా నిక్షిప్తమైంది. అచ్చెన్నాయుడు బ్యాచ్‌ కుట్ర అంతా బయటపడింది.    


చిత్రం చూడండి. రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కోసం కృనాల్‌ నేతృత్వంలో ఢిల్లీ ఇంజినీర్ల బృందం వచ్చి ఇక్కడ సర్వే చేసింది. అప్పటికి చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఆయన ఉండగానే దీనికి సంబంధించిన అంచనాలు, సర్వేలన్నీ పూర్తయ్యాయి.  


ఈ ఫొటో చూడండి. 326(ఎ) హైవే విస్తరణ కోసం సర్వే చేస్తున్న దృశ్యమిది. 2019 ఏప్రిల్‌ 12వ తేదీన ఈ సర్వే జరిగింది. అప్పటికీ టీడీపీ ప్రభుత్వమే ఉంది.  

ఈ దృశ్యం చూడండి. హైవే విస్తరణకు ముందు పాతపట్నం నీలమణి దుర్గ ఆలయమిది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా రహదారి విస్తరణ, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం ఆలయ ప్రాంగణంలోని కొంత భాగా న్ని కూల్చుతామని ముందుగానే సమాచారమిచ్చారు. అప్పట్లో టీడీపీ నేతలు కనీసం నోరు మెదపలేదు.  


చిత్రాన్ని చూడండి. హైవే విస్తరణ, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసమని నీలమణి దుర్గ ఆలయంలో కొంత ప్రాంగణాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కేంద్ర సంస్థ ముందస్తు సమాచారమిచ్చి, అందరి సమక్షంలో కూల్చి వేసింది. అనుమతులన్నీ వారి హయాంలోనే వచ్చినా టీడీపీ ఇప్పుడు గొంతు చించుకుంటోంది.   

మరిన్ని వార్తలు