కుప్పంలో టీడీపీ గూండాగిరి

9 Nov, 2021 04:50 IST|Sakshi
కుప్పం మునిసిపల్‌ కార్యాలయం గేట్లు ధ్వంసంచేసి చొరబడుతున్న టీడీపీ అల్లరిమూకలు

మున్సిపల్‌ కార్యాలయంపై తమ్ముళ్ల దాడి

కమిషనర్‌ చాంబర్‌ అద్దాలు ధ్వంసం

ప్రాణభయంతో వేరే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న కమిషనర్‌

కుప్పంలో గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ నేతల మకాం

తొలిసారిగా కుప్పంలో ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా ఓటు నమోదు చేయించుకున్న చంద్రబాబు

సాక్షి ప్రతినిధి, తిరుపతి/కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ గూండాగిరి చేస్తూ దాడులకు తెగబడుతోంది. మరో ఐదురోజుల్లో ఇక్కడి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు దశాబ్దాలకుపైగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఓటమి టెన్షన్‌తో విధ్వంసకర రాజకీయాలకు తెరలేపారు. ఇన్నేళ్లుగా ఆ ప్రాంతాన్ని కనీసంగా కూడా అభివృద్ధి చేయని ఆయన నిర్వాకాన్ని గుర్తించిన అక్కడి ప్రజలు ఇటీవల వరుసగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఛీకొడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ఇటీవల కుప్పంలో రెండ్రోజులపాటు పర్యటించి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీని గెలిపించి తన పరువు నిలబెట్టాలని స్థానికులను అభ్యర్థించారు. ఇందుకోసం ఆయన ఎప్పుడూలేని విధంగా ఒంగి ఒంగి దండాలు పెట్టారు. అయినాసరే పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో రూటు మార్చి దాడులకు తెరలేపారు.

గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ నేతల మకాం
కుప్పం పట్టణానికి జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు ప్రచారానికి వెళ్తే.. బయట నేతలు వచ్చేశారని నానాయాగీ చేస్తున్న చంద్రబాబు.. మరోవైపు,  ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ నేతలను పెద్ద సంఖ్యలో కుప్పానికి తరలించారు. అది కూడా గొడవలకు, ఘర్షణలకు బాగా పేరున్న టీడీపీ నేతలను ఎంపిక చేసి మరీ రంగంలోకి దించారు. ఇందులో భాగంగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, బండబూతుల నేతగా పేరున్న విశాఖకు చెందిన బండారు సత్యనారాయణమూర్తి, తరచూ వివాదాలకెక్కే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రత్తిపాడు ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా, విశాఖకు చెందిన ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తదితరులు గత కొద్దిరోజులుగా ఇక్కడే తిష్టవేసి ఉద్రిక్తతలు సృష్టిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నారు. ఇక ఆయా నేతలకు చంద్రబాబు గంటగంటకూ ఫోన్‌చేసి కుప్పం పరిస్థితులను ఆరా తీస్తున్నట్లు టీడీపీ వర్గాల కథనం. 
కుప్పం కమిషనర్‌ చాంబర్‌ ఎదుట టీడీపీ నేతలు. చిత్రంలో ధ్వంసం చేసిన చాంబర్‌ 

ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా బాబు 
ఇక.. కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరిగ్గా వారం కిందట చంద్రబాబు ఇక్కడి పురపాలక సంఘంలో ఓటును రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ‘‘ఏమో.. ఏదైనా జరగొచ్చేమో.. తన ఒక్క ఓటు అవసరమైతే...’’  అని ఆలోచించిన బాబు ఇటీవల కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు మున్సిపాలిటీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తొలిసారిగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.  అయితే.. బాబుకు ఆ అవసరం రానివ్వబోమని.. ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు