జూమ్ బాబు జూమ్.. మా బుర్రలు తినొద్దు మహాప్రభో..!

13 Nov, 2022 08:54 IST|Sakshi

ఆయన ఏపీలో ప్రతిపక్ష నేత. నిత్యం ప్రజల్లో ఉండాలని తన పార్టీ నేతలను ఆయన ఆదేశిస్తారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ఉద్యమించాలని ఉద్భోదిస్తారు. కాని ప్రతిరోజూ జూమ్‌ మీటింగ్‌లు పెట్టి గంటల కొద్దీ వారి మెదళ్ళను తినేస్తుంటారు. 

అయినను మీటింగ్ బెల్ కొట్టాల్సిందే.!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలకే చిరాకు పుట్టిస్తోంది. వారంలో ఐదు రోజులపాటు జూమ్ సమావేశాలంటూ తమ మెదళ్ళు తినేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజు గంటల కొద్దీ జూమ్ సమావేశాలు పెట్టిన చంద్రబాబు అధికారం పోగొట్టుకున్న తర్వాత కూడా అదే తరహాలో వ్యవహరించడం పట్ల మండిపడుతున్నారు. వారంలో ఐదు రోజుల పాటు తండ్రి, కొడుకులు రోజుకు మూడు గంటల పాటు జూమ్ సమావేశాల పేరుతో హింసించడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ తమకు ఈ బాధ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మా బుర్రలు తినొద్దు మహాప్రభో..!
సోమవారం వర్కింగ్ వీక్ మొదలవుతుంది. టీడీపీ నాయకులకు మాత్రం చంద్రబాబు, లోకేష్‌తో సోమవారం నుంచి జూమ్ సమావేశాలు ప్రారంభమవుతాయి. సోమవారం నాడు పార్టీ అనుబంధ సంఘాలు చేయాల్సిన కార్యక్రమాలపై వాటి ఇన్‌చార్జ్ లోకేష్ ఆయా సంఘాల నేతలతో మాట్లాడతారు. మంగళవారం పార్టీ పనితీరు, అనుబంధ సంఘాల పనితీరుపై అధినేత చంద్రబాబు సమీక్ష జరుపుతారు. బుధవారం పార్టీ వ్యూహాత్మక కార్యక్రమాలపై చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు.

గురువారం గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా మాట్లాడతారు. శుక్రవారం రాష్ట్రస్థాయి నేతలతో, 175 నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలపై వివరిస్తారు.  శని, ఆదివారాల్లో తండ్రి కొడుకులు ఇద్దరూ హైదరాబాదులో ఉంటారు కాబట్టి తమకు జూమ్ బాధ తప్పిందని, అదే ఈ రెండు రోజులు కూడా అమరావతిలోనే ఉండి ఉంటే వారం రోజులపాటు వరుసగా తమకు హింస తప్పేది కాదంటున్నారు. 

ఇంకెన్నాళ్లు ఇవే విషపు కుట్రలు?
జూమ్ సమావేశాల ద్వారా రోజూ ఏదైనా కొత్త విషయాలు చెబుతారా అంటే అది కూడా ఉండదంటున్నారు. రోజు చెప్పిందే చెప్పడంతో తమకు విసుగు పుడుతోందని.. రోజు కాన్ఫరెన్స్ ప్రారంభించడం ప్రభుత్వాన్ని విమర్శించడం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయమని తమకు ఆదేశాలివ్వడమే తప్ప కొత్త విషయాలు ఏమీ ఉండవని తేల్చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఒక్కో సందర్భంలో తండ్రి కొడుకులు ఇద్దరూ చెప్పిన సమయానికి జూన్ కాన్ఫరెన్స్ కు రాకపోవడం వల్ల ఐదారు గంటల సమయం వృధా అవుతోందంటున్నారు.

ప్రతిపక్ష పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉండాలే గాని జూమ్ సమావేశాలతో కాలక్షేపం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజలతోనే మమేకమైన విషయాన్ని ఈ సందర్భంగా టిడిపి నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మారకపోతే జీవితాంతం ప్రతిపక్ష నేత హోదాలోనే ఉంటారని టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు